పట్టణ పేదలకూ ‘ఉపాధి హామీ’

ABN , First Publish Date - 2021-09-09T06:17:08+05:30 IST

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) తరహాలో పట్టణ ప్రాంత పేదలకు ప్రత్యేక చట్టం కావాలని పౌరసమాజ కార్యకర్తలు చాలాకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు....

పట్టణ పేదలకూ ‘ఉపాధి హామీ’

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) తరహాలో పట్టణ ప్రాంత పేదలకు ప్రత్యేక చట్టం కావాలని పౌరసమాజ కార్యకర్తలు చాలాకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం సంభవించిన కొన్ని పరిణామాలు ఆ డిమాండ్ నెరవేరగలదనే ఆశలు రేకెత్తిస్తున్నాయి. వాటిలో మొదటిది- పట్టణప్రాంత పేదల కోసం ‘నరేగా’ మాదిరి ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురావడం అత్యవసరమని కార్మిక మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం తన తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సూచించడం; రెండవది- పట్టణప్రాంత పేదలకు ఉపాధి కల్పించడానికి 100 కోట్ల రూపాయలతో ఒక పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం పూనుకోవడం; మూడవది- నగరవాసులైన పేదలకు ఒక ప్రత్యేక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని గత నెల 21 న జరిగిన ప్రతిపక్ష పార్టీల సదస్సు ముక్తకంఠంతో డిమాండ్ చేయడం. 


నిజానికి కొవిడ్ ఉపద్రవం ప్రారంభమయినప్పటి నుంచీ పట్టణప్రాంత పేదల ఉపాధి కల్పనకు ఒక ప్రత్యేక పథకం అవశ్యకత గురించి చర్చ జరుగుతూ వస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలోని నగర, పట్టణ ప్రాంతాల పేదలు మరింతగా పేదరికంలోకి జారిపోయారని, గ్రామీణ సహచరులతో పోల్చితే ఎక్కువ మంది ఆకలిదప్పులకు గురయ్యారని, తక్కువ పోషకాహారం వినియోగించుకున్నారని ‘రైట్ టు ఫుడ్ కాంపెయిన్’ సంస్థ విడుదల చేసిన ‘హంగర్ వాచ్’ నివేదిక పేర్కొంది. పట్టణ పేదలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది గత ఏడాది అక్టోబర్ నెలలో రోజుకు కనీసం ఒక పూట ఆకలితో ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. అలానే కొవిడ్ కాలంలో పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగిత కంటే 2.5 శాతం ఎక్కువని పలు సర్వేలు స్పష్టం చేశాయి.  


గ్రామీణప్రాంత పేదలతో పోల్చితే పట్టణప్రాంత పేదల స్థితిగతులు అధ్వాన్నంగా ఉన్నాయి. పట్టణ ప్రాంత పేదల కంటే గ్రామీణప్రాంత పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా అందుబాటులో ఉండడంతో పాటు, పల్లెసీమల ప్రజలకు ‘నరేగా’ అమలు చేయడమే అందుకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో గ్రామీణ ప్రాంత కార్మికులు 78 వేల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని వేతనాల రూపంలో సంపాదించుకున్నారు. పట్టణప్రాంత పేదలకు మాత్రం అలాంటి అవకాశం లేకుండా పోయింది. ‘నరేగా’ లాంటి పథకం అందుబాటులో లేకపోవడమే వారి దుస్థితికి ప్రధాన కారణం. 


నిజానికి మనదేశంలో పట్టణప్రాంత పేదల స్థితిగతులకు సంబంధించిన పరిశోధనలు పరిమితంగా జరిగాయి. ప్రభుత్వ ఏజెన్సీల దగ్గర పట్టణ ప్రాంత పేదరికం గురించి అందుబాటులో ఉన్న సమాచారం, దాని ఆధారంగా జరిగే చర్చ కూడా సాపేక్షంగా చాలా తక్కువ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశ జనాభాలో చాలా తక్కువమంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. ఈ కారణంగా పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. 1951లో దేశ జనాభాలో 17 శాతంగా ఉన్న పట్టణప్రాంత జనాభా 2011 నాటికి ఇంచుమించు 31 శాతానికి పెరిగింది. అలానే 1951లో 6 కోట్ల పైచిలుకు ఉన్న పట్టణ జనాభా, 2011 నాటికి 38 కోట్లకు పెరిగింది. పెరిగిన జనాభా చాలావరకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వలస వచ్చినవారే. మరి కొంతమంది మాత్రం, వివిధ రాష్ట్రప్రభుత్వాలు పెద్ద గ్రామాలను మునిసిపాలిటీలుగా మార్చడం వల్ల ఆ గ్రామీణులు తమ ప్రమేయం లేకుండా రాత్రికి రాత్రే పట్టణప్రజలుగా మారిపోయారు.


నిజానికి గ్రామీణ పేదప్రజల వలే పట్టణప్రాంత పేదలు కూడా ఉపాధి, ఆహారం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలలో సరైన సదుపాయాలు అందకపోవడం వల్ల నానా సమస్యల పాలవుతున్నారు. తమ సామాజిక సముదాయాల నుంచి దూరంగా బతకాల్సిరావడం; నివాస సౌకర్యాలు, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం; నివాసం నుంచి పని ప్రదేశానికి పోవడానికి రవాణా ఖర్చులు మొదలైనవి పట్టణపేదలు అదనంగా ఎదుర్కొంటున్న సమస్యలు. ఇక వీరిలో దాదాపు 50శాతం మంది స్వయంఉపాధి లేదా ఎలాంటి సామాజిక భద్రతా లేని పనులలో ఉండడం పరిస్థితిని ఇంకా జటిలం చేస్తోంది. 


స్వాతంత్ర్యానంతరం పట్టణప్రాంత పేదల శ్రేయస్సుకై పలు పథకాలు అమలు చేశారు. అయితే అవేవీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదని చెప్పక తప్పదు.  ఉదాహరణకు కేంద్రప్రభుత్వ నిధులతో జవహర్‌లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్(JNNURM), స్వర్ణ జయంతి షహర్ రోజ్గార్ యోజన (SJSRY)తో సహా పలు పథకాలు అమలు జరిగినా అవి మహానగరాలకే పరిమితమయ్యాయి. ఒడిషా, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఇటీవల కాలంలో తమ సొంతనిధులతో పట్టణప్రాంత పేదల కోసం ఉపాధికల్పనా కార్యక్రమాలను రూపొందించాయి. ఇక కేరళలో అయితే 2010 నుంచే ఇలాంటి కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. ఏమయినా మనదేశంలో ఎలాంటి చట్టబద్ధమైన హామీ లేకుండా చేపట్టిన పేదరిక నిర్మూలనా పథకాలు, ఉపాధి కల్పనా కార్యక్రమాలు చాలావరకు విఫలమయ్యాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం.


ఈ నేపథ్యంలో పట్టణ ఉపాధి హామీ చట్టం గురించి మనం మాట్లాడుకోవాలి. ‘నరేగా’ అమలుకు ఆవల ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న పేదలకు ఉపాధి కల్పించడం ‘పట్టణ ఉపాధి హామీ చట్టం’ ముఖ్య ఉద్దేశ్యం కావాలి.  అలా జరిగితే సంవత్సరానికి నిర్ణీత సంఖ్యలో పనిదినాలు కల్పించడం ద్వారా పేదలు నిర్ణీతమొత్తం సంపాదించుకోవడానికి హామీ ఉంటుంది. దీని వల్ల కనీసం, దుర్భర దారిద్య్రం నుంచి వారిని కాపాడడం సాధ్యమవుతుంది. అలాగే మన పట్టణాలు, నగరాలలో ఉమ్మడి జాగాలు పూర్తిగా అంతరించిపోయాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. నీటి వనరులు అదృశ్యమవుతున్నాయి. వాతావరణ కాలుష్యం లాంటి సమస్యలకు పట్టణ ప్రాంతాలు ఆలవాలమవుతున్నాయి. ఇవన్నీ పెను సమస్యలు. వీటి పరిష్కారానికి పట్టణ ఉపాధి హామీ చట్టం విశేషంగా తోడ్పడే అవకాశముంది. ఆ చట్టం కింద పలు అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. యువత నైపుణ్యం పెంపునకు పలు కార్యక్రమాలను రూపొందించి, పటిష్ఠంగా అమలుపరిస్తే వారి వృత్తిజీవిత పురోభివృద్ధికి దోహదం చేకూరుతుంది. మన పురపాలక సంఘాలు మానవ వనరుల లేమితో బాధపడుతున్నాయి. ఈ లోటు తీర్చడానికి ఆ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. 


సరే, ‘నరేగా’ అమలుపై ఎన్ని విమర్శలు ఉన్నా స్వతంత్ర భారతదేశంలో పేదరిక నిర్మూలనలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం కీలకపాత్ర పోషించిందన్న మాట నిర్వివాదాంశం. ఈ కార్యక్రమం పేదరికాన్ని 32శాతం వరకు తగ్గించిందని, 1.4 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోకుండా అడ్డుకుందని, మహిళలు నగదు ఆదాయాన్ని ఆర్జించేందుకు మొదటిసారి అవకాశాన్ని కల్పించిందని ఒక ప్రతిష్ఠాత్మక అమెరికా విశ్వవిద్యాలయ పరిశోధనలో నిర్ధారణ అయింది. ‘నరేగా’ మాదిరిగా నిర్ణీత పనిదినాలు, నిర్దిష్ట సమయంలో పని కల్పించలేని పక్షంలో నిరుద్యోగభృతి, వేతనాల చెల్లింపు, ఆలస్యపు పరిహారం, సోషల్ ఆడిట్ తదితర హక్కులతో పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించడం కేంద్రప్రభుత్వ తక్షణ కర్తవ్యం. దేశ అభివృద్ధి, పట్టణీకరణతో(చిన్న చిన్న మినహాయింపులతో) మాత్రమే సాధ్యమని మితవాద పార్టీలు, వామపక్షాలు భావిస్తున్నాయి. కనుక పట్టణప్రాంత పేదల ఉపాధికి చట్టబద్ధ హామీకై సమస్త రాజకీయపక్షాలు సమైక్యంగా కృషి చేయవలసిన అవసరం ఉంది. 


వ్యక్తిస్వాతంత్ర్యం, వ్యక్తి జీవనానుభవాల రక్షణకు గాను భారత రాజ్యాంగంలోని అధికరణ పౌరులకు జీవించేహక్కు ప్రసాదించింది. ఉపాధి పొందే హక్కు  జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు ‘ఓల్గా టేల్లీస్ వర్సెస్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్’ కేసులో భాష్యం చెప్పింది. అలాగే ‘మేనకాగాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో గౌరవంగా జీవించేహక్కు, జీవించే హక్కులో భాగమని వక్కాణించింది. ఈ రెండు తీర్పుల ఆధారంగా ‘పనిహక్కు’ను రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుగా సూత్రీకరించవచ్చు. ఈ పరిస్థితులలో ‘పట్టణ ప్రాంత పేదల ఉపాధి హామీ’ చట్టాన్ని తేవడం ద్వారా కేవలం గ్రామీణప్రజలకు అందుబాటులో ఉన్న పని హక్కును పట్టణప్రాంత ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లవుతుంది. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ చొరవ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిత్యం చెబుతుండే సుభాషితం ‘సబ్ కా సాత్ – -సబ్ కా వికాస్’ పైన ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.

చక్రధర్ బుద్ధ

పరిశోధకులు, ‘లిబ్ టెక్ ఇండియా’ సంస్థ

Updated Date - 2021-09-09T06:17:08+05:30 IST