‘ఉద్యోగ నేత’ల తీరు మారాలి!

ABN , First Publish Date - 2021-02-05T06:48:12+05:30 IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగులు శాశ్వతం. రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు శాశ్వతం కాదు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ తీరు మార్చుకొని ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడాలి...

‘ఉద్యోగ నేత’ల తీరు మారాలి!

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగులు శాశ్వతం. రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు శాశ్వతం కాదు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ తీరు మార్చుకొని ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడాలి. ప్రజాభీష్టం మేరకు తమ బాధ్యతలు గుర్తెరిగి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఉద్యోగ సంఘాల నాయకులూ వ్యవహరించాలి.


ఉద్యోగుల తరపున నిలబడి, ప్రభుత్వంతో పోరాడి వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు అసలు లక్షాన్ని గాలికి వదిలేసినందుకు సామాన్య ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ఈ సంఘాల నాయకులు ఉద్యోగులకూ, ప్రభుత్వానికీ మధ్య వారధిగా ఉంటూ తమవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ తెలుగు రాష్ట్రాలలోని ఉద్యోగ సంఘాల నాయకుల తీరు ఇందుకు భిన్నం. ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసం వీరు ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే, సంఘాల నాయకులుగా చెలామణి అవుతున్నవారు ఉద్యోగాల్లో చేరినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడెంత అనే విషయంపై విచారణ జరిపిస్తే వీళ్ళ నిర్వాకాలు బయట పడతాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు చేస్తున్న మేలేమీ లేకున్నా ఆ హోదాలో చలామణీ అవుతూ, కేసీఆర్ పెట్టే ‘భోజనాలకు’ అలవాటు పడి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఉద్యోగుల, ప్రజల దృష్టిలో బాకాసురులుగా పేరుగడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులూ తమ సొంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసం కనీస బాధ్యతలు కూడా విస్మరిస్తున్నారు. 


తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులను ఉపయోగించుకొని ఉద్యమ నాయకులుగా పేరు గడించిన కొందరు ఉభయ రాష్ట్రాలలో ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. స్వార్థమే పరమావధిగా ఎంతకైనా తెగించి మాట్లాడేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాల విషయంలో తెలంగాణలో అధికార టి.అర్.ఎస్. పార్టీ రాజకీయ కోణంలో రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. ఇది కేసీఆర్‌ ఆశీస్సులు పొందడం కోసం కాక మరేమిటి? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసిన చట్టాలతో ఉద్యోగ సంఘాలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు చేస్తే నిరసన తెలపడంలో తప్పులేదు. కానీ రైతు చట్టాలతో ఉద్యోగ సంఘాలకు సంబంధం లేకున్నా టి.అర్.ఎస్. పార్టీ ఇచ్చిన బంద్‌ పిలుపునకు మద్దతివ్వడంతో వీరంతా గులాబి కండువా కప్పుకోకపోయినా తామూ ఆ తానులోని ముక్కలమేనని నిర్లజ్జగా చెప్పినట్లయింది. అందుకే బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగ సంఘాల వైఖరిని తీవ్రంగా విమర్శించడమే కాదు, ఇకముందు ఉద్యోగుల సంక్షేమ బాధ్యతలను తాము తీసుకుంటామన్నారు. దీంతో ఈ నాయకులు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దుబ్బాకతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టి.ఆర్.ఎస్. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బిజెపి అధికారంలోకి వస్తే ఈ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారనే సందేహాలు ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.


తమకు ఏ మాత్రం సంబంధం లేని విషయంలో ఇలా అనవసరంగా అభాసుపాలయిన ఈ నాయకులు ఇటీవల తమ తోటి ఉద్యోగులయిన అర్.టి.సి. కార్మికుల సుదీర్ఘ సమ్మె విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. కేసీఆర్‌ ఏకంగా ఆర్.టి.సి.ని ప్రైవేట్ పరం చేయాలనుకున్నా, కార్మిక సంఘాలను పూర్తిగా రద్దు చేసి ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా తమ అనుకూల వ్యక్తులతో డిపో కమిటీలు వేసినా, సమ్మెకాలంలో అనేకమంది కార్మికులు అభద్రతాభావంతో ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోయినా ఈ సోకాల్డ్ నాయకులు కనీసం సంతాపం తెలుపలేకపోయారే... వీరు ఇంకా ఆ పదవుల్లో కొనసాగడానికి అర్హులేనా? కేంద్రప్రభుత్వం అర్.టి.సి. కార్మికుల పక్షాన నిలబడకపోయివుంటే ఆర్.టి.సి.ని కేసీఆర్‌ బతుకనిచ్చేవారా? ఇంకా ఎంతమంది చిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడేవారో కదా! రైతు చట్టాల విషయంలో ఇంతగా ఓవర్ యాక్షన్ చేసిన ఈ లీడర్లకు రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు మాత్రం కనిపించకపోవడం శోచనీయం. వీరెప్పుడయినా రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారా? కనీసం రైతు ఉద్యమాలకు మద్దతు పలికారా? వీరు ప్రభుత్వానికి గులాములుగా మారారు కాబట్టే ఉద్యోగులు ఆశించిన రీతిలో పి.అర్.సి. నివేదిక రాలేదన్న విమర్శలున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు మొసలి కన్నీరు కారుస్తూ తాము కేసీఆర్‌తో మాట్లాడుతామనీ, ఆయన న్యాయం చేస్తారనీ అంటున్నారు. ఇక, వీరి వైఖరి విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఉద్యోగనాయకులూ, అధికారపక్షమూ కూడబలుక్కొని నడిపిస్తున్న అనుమానాలూ ఉన్నాయి. గతంలో వివిధ సందర్భాల్లో చేసినట్లే ఇప్పుడూ పి.అర్.సి. నివేదికను కేసీఆర్‌ పక్కన పెట్టి ఉద్యోగులు కోరుకుంటున్న ఫిట్‌మెంటును ప్రకటించి, ఈ బిర్యానీ బ్యాచ్‌తో పాలాభిషేకాలు చేయించుకోవడంలో భాగంగానే, ముందుగా ఇలాంటి నివేదిక ఇప్పించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ సంఘాల నాయకుల వైఖరి చూస్తుంటే వారు తెలంగాణ నాయకులతో మరింత పోటీపడుతున్నారనిపిస్తోంది. అధికారపార్టీకి అండగా నిలిచే ప్రయత్నంలో వీరు ఇంకా రెచ్చిపోయి చివరికి సుప్రీంకోర్టుతో కూడా చీవాట్లు తిన్నారు. స్వామి భక్తిని చాటుకోవడంలో తమకు ఎవరూ తీసిపోరని నిరూపించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఒక ఉద్యోగ సంఘం నాయకుడిని – ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ బద్ధ సంస్థ, దాన్ని ఎదిరించడం ప్రభుత్వ ఉద్యోగులకు సమంజసమేనా? అని ప్రశ్నిస్తే, ఎస్.ఇ.సి. అయితే ఏంటి? మేము కూడా రాజ్యాంగ బద్ధ ఉద్యోగులమే, ఆయన (ఎన్నికల కమిషనర్) పెద్ద ఉద్యోగి అంతే అని సదరు నాయకుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ సోకాల్డ్ నాయకులకు రాజ్యంగమూ, చట్టాల పట్ల ఉన్న పరిజ్ఞానం ఏ పాటిదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగుల సంక్షేమం పేరిట ఇలా మొసలి కన్నీరు కారుస్తున్న ఈ నాయకులు డాక్టర్ సుధాకర్ విషయంలో ఎందుకు స్పందించలేదు? ఆసుపత్రుల్లో అసౌకర్యాలపై ప్రశ్నించినందుకు రాష్ట్ర పాలకులు పనిగట్టుకొని ఈ వైద్యుడిని వేధిస్తే, ప్రభుత్వ వైఖరిని ఈ నాయకులు ఎందుకు తప్పుపట్టలేదు? డాక్టర్ సుధాకర్ చేసిన తప్పేంటి? ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదా? మరో మహిళా ఉద్యోగిని వేధింపులకు గురైతే వీరంతా ఏమయ్యారు? గతంలో ఒక ప్రభుత్వ అధికారిణి తన బాధ్యతల్లో భాగంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసి అవమానానికి గురైతే, ఆ ఉద్యోగికి అన్యాయం జరిగితే ప్రశ్నించే ధైర్యం లేని ఈ నాయకులు ఎన్నికల కమిషనర్‌ను ఎదిరించడానికి మాత్రం హద్దులు లేకుండా నోటికి వచ్చినట్లు విమర్శిస్తున్నారు. ఎవరి అండతో ఇలా మాట్లాడుతున్నారో ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? మీ బంగారు భవిష్యత్తు కోసం స్వార్థంతో ఉద్యోగుల క్షేమాన్ని బలి పెట్టడం సమంజసమా? దేశమంతా వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతెందుకు, తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికతోపాటు జి.హెచ్.ఎం.సి ఎన్నికలు జరిగాయి కదా? ఎక్కడా కరోనా వ్యాప్తి చెందినట్లుగా, ఉద్యోగులు కరోనా బారిన పడినట్లుగా దాఖలాలు లేవు.


పైపెచ్చు దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఉద్యోగ సంఘాల వైఖరి స్వార్థంతో కూడింది కాకపోతే మరేమిటి? వారు నాయకులైతే మాత్రం ఉద్యోగుల అభిప్రాయాలని తెలుసుకోనక్కరలేదా? ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించిన ఉద్యోగులూ లేకపోలేదు. అధికార పక్షం ఎన్నికలను వ్యతిరేకిస్తున్నదంటే వారికున్న రాజకీయ కారణాలు వారికుంటాయి. అందులో ఉద్యోగ సంఘాలు భాగస్వామ్యం కావడం ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యోగులు శాశ్వతం. రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు శాశ్వతం కాదనే విషయాన్ని విస్మరిస్తే ఎలా? ఇప్పటికయినా ఉద్యోగ సంఘాల నాయకులు తమ పద్ధతులు మార్చుకొని ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడాలి. ఉద్యోగులతో పాటు ప్రజలంతా కోరుకుంటున్నది ఇదే. ప్రజాభీష్టం మేరకు తమ బాధ్యతలు ఇకముందయినా గుర్తెరిగి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యవహరిస్తారని ఆశిద్దాం.


శ్యాంసుందర్ వరయోగి

రాష్ట్ర బిజెపి ప్రశిక్షణ కమిటీ కో-కన్వీనర్

Updated Date - 2021-02-05T06:48:12+05:30 IST