భారత చరిత్రలో అసమ్మతి స్వరాలు

ABN , First Publish Date - 2021-05-02T06:01:25+05:30 IST

‘భారతదేశ చరిత్రలో అసమ్మతీ, అనంగీకారం అనాదిగా ఉన్నాయి. ప్రశ్నించబడకుండా మేధో సంఘర్షణ లేకుండా ఏ సంస్కృతీ రూపొందలేదు’...

భారత చరిత్రలో అసమ్మతి స్వరాలు

‘భారతదేశ చరిత్రలో అసమ్మతీ, అనంగీకారం అనాదిగా ఉన్నాయి. ప్రశ్నించబడకుండా మేధో సంఘర్షణ లేకుండా ఏ సంస్కృతీ రూపొందలేదు’ అని ప్రముఖ చరిత్రవేత్త రొమిలా థాపర్ నొక్కి చెప్పారు. గత అక్టోబర్ లో ప్రచురితమైన ఆ విదుషీమణి కొత్త పుస్తకం ‘అసమ్మతిస్వరాలు’ (The Voices of Dissent)లో చరిత్ర పొడవునా పరచుకుని ఉన్న అసమ్మతిని ఆమె ఉదాహరణలతో వివరించారు. పాశ్చాత్యులు ప్రవేశించేవరకూ ఈ దేశంలో సంస్కృతి అఖండంగా ఉందనే అభిప్రాయాల్ని రొమిలా థాపర్ పూర్వ పక్షం చేశారు. జ్ఞానాన్వేషణ మార్గంలో అసమ్మతి అన్ని సమాజాల్లో ఉందనీ, అందుకు భారతదేశం మినహాయింపు కాదనీ, పైగా భారతీయ తాత్విక చింతనని అది సమున్నతం చేసిందనీ ఆమె అన్నారు. 


ఒక వ్యక్తి లేదా సమూహం తమ మీద ఆధిపత్యం లేదా ప్రభావం చూపే వ్యవస్థల పట్ల కలిగి ఉండే అసంతృప్తి లేదా అనంగీకారమే ‘అసమ్మతి’ (dissent) అని రొమిలా అన్నారు. సాధారణంగా భారతీయ సమాజం సహనగుణశీలమైనదనీ, ఎన్నో సంస్కృతుల్ని సాదరంగా ఆహ్వానించిందని చేసుకునే ఆత్మస్తుతిని నిరాకరిస్తూ భారతీయ సమాజం వైరుధ్యాలు లేని అద్భుత సామరస్యంతో ఏమీ మనలేదనీ దాని వంతు హింస, అసహనం, భావసంఘర్షణ దానికీ ఉన్నాయని స్పష్టం చేస్తూ వర్తమానం లోని అసమ్మతికి ఉపోద్ఘాతం భారతీయ గతంలోనే ఉందని ఈ చరిత్రవేత్త నిరూపించారు. ప్రశ్నించే హక్కు చరిత్రలో నిరంతరం ప్రశ్నించబడడాన్ని, ఆ హక్కు కొన్ని వర్గాలకే పరిమితం కావడాన్ని ప్రస్తావిస్తూ జాతీయభావం అంకురించి ప్రజాస్వామ్యాలు సంస్థాపితం కావడంతో అది ప్రజల పరం అయిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఆ హక్కును నియంత్రిస్తూండడాన్ని ఆమె నిలదీశారు. ‘భారతీయ గతం అపవాదాలకు అతీతమైనది కాదు, అది సర్వజన సమ్మతంగా ఎప్పుడూ లేదు’ అని ఈ జెయన్‌యూ ఎమిరిటస్ ప్రొఫెసర్ విస్పష్టంగా చెప్పారు. 


సమ్మతికి ‘నేను’ (the Self) అనీ, అసమ్మతికి ‘ఇతరులు’ (the Other) అనే సూచికలు ఉపయోగించారు థాపర్. కొందరిని ఇతరులుగా చూడడం గతంలో కూడా ఉంది. మన నాగరికతలన్నీ రకరకాల పోగులతో అల్లిన దారాలే. వాటిలో కొన్ని ఇక్కడే పుట్టినవైతే మరికొన్ని వలసల రూపంలో వచ్చి చేరినవి. ఇక్కడ పుట్టినవే వలసలుగా తరలి వెళ్లినవీ ఉన్నాయి. ఈ క్రమంలో ‘నేను’, ‘ఇతరుల’ స్థితులు స్థానభ్రంశం చెంది ఉండవచ్చు కానీ అసలంటూ లేకపోలేదని ఆమె అన్నారు. ఈ మొత్తాన్ని వివరించడానికి, ముఖ్యంగా మతానికి సమాజానికి ఉన్న సంబంధం మీద, ‘నేను’, ‘ఇతరులు’ చూపిన ప్రభావాన్ని అంచనా వెయ్యడానికి అహింసాయుతంగా జరిగిన సంఘటనల్ని, పరిణామాల్ని ఉదాహరణలుగా చూపించారు. అందుకు క్రీపూ రెండవ సహస్రాబ్దిలో మొదలుపెట్టి ప్రాచీన యుగం నుంచి రెండు, మధ్యయుగం నుంచి ఒకటి, ఆధునిక యుగం నుంచి రెండు మొత్తం ఐదు ఉదంతాలను ఉదహరించారు. ఇవి దాసి పుత్ర సమస్య దగ్గర మొదలై షహీన్ బాగ్ ఉద్యమం దాకా సాగాయి.


మొదటిది- రుగ్వేదం ‘ఇతరులు’గా ప్రస్తావించిన దాసదస్యులలో కొందరిని బ్రాహ్మణులుగా కలుపుకోవడం గురించి. ఈ దాసదస్యులు ఆర్య భాష సంస్కృతం మాట్లాడలేని అనాగరికులు. రాక్షసులు. యజ్ఞాలు చెయ్యరు. విగ్రహారాధకులు. వారికి కొంత పశుసంపద, కొన్ని పురాలు ఉన్నాయి. తాంత్రిక విద్యలు తెలిసిన వారి పట్ల ఆర్యులకు అయిష్టంతో పాటు అసూయ కూడా ఉంది. వేద వాఙ్మయాన్ని చూస్తే దాసదస్యులు అనేవారు స్థానికులనీ, దేశంలోకి ప్రవేశించి నిలదొక్కుకున్న ఆర్యులతో వారికి ఘర్షణలు జరిగి, సంపర్కం కుదిరి సామాజిక విభజన జరిగిందని అర్థమౌతుంది. దాసులలో ఆధిక్యం ఉన్నవాళ్లు అగ్రవర్ణాల్లో కలిసిపోగా లేనివాళ్లు సేవలకు పరిమితమయ్యారు. ఈ సందర్భంగా దాసీపుత్ర బ్రాహ్మణుడు అనే మాట వినిపిస్తుంది. రుగ్వేదం లో కొన్ని రుక్కులు రాసిన రుషి కక్షివంతుడు, సరస్వతి నదిని తన వెంట ప్రవహింప చేసుకున్న రుషి కాశ ఐలూషుడు దాసీపుత్రులే. ఇది స్థానికంగా ఉన్న ‘నేను’ను, ‘ఇతరులు’ ఆక్రమించుకుని ‘నేను’గా మారి ‘ఇతరులు’గా మారిన ‘నేను’ను కలుపుకున్న సందర్భం.


రెండవది- క్రీపూ మొదటి సహస్రాబ్దికి చెందింది. ఇక్కడ సమ్మతి లేదా ‘నేను’ వైదిక మతం. అందులోంచి పుట్టిన అసమ్మతి లేదా ‘ఇతరులు’ శ్రమణులుగా పిలువబడిన జైనులు, బౌద్ధులు, చార్వాకులు. ‘నేను’ను ‘ఇతరులు’ ప్రశ్నించారు. అందులోని వర్ణవ్యవస్థని కర్మకాండలనీ నిరసించారు. బోధనలు ప్రజల భాషల్లోకి వచ్చాయి. స్పర్థ ఊపందుకుంది. ‘నేను’ను దాటుకుంటూ ఇతరులు ముందుకెళ్లారు. వైదికం వెనక్కు తగ్గింది. శ్రమణ మతాలు ఉచ్ఛస్థితినందుకున్నాయి. సమ్మతికి వ్యతిరేకంగా పుట్టిన అసమ్మతి సమ్మతి స్థాయిని అందుకుంది. ఈ సమ్మతి కూడా క్రమంగా తన అగ్రస్థానాన్ని కోల్పోతూ వచ్చింది. ఈ లోగా మొదటి సమ్మతి అయిన వైదికం, మొదటి ఇతరులైన శ్రమణ మతాల స్ఫూర్తితో మొదట భాగవత మతంగా, తర్వాత పౌరాణిక మతంగా మార్పు చెందింది. శ్రమణ మతాల్లో మహావీరుడు, బుద్ధుడు దేవతలుగా మారడంతో వైదికం వారి స్థానాల్ని రామకృష్ణులతో భర్తీ చేసింది. విగ్రహారాధనను అంగీకరించింది. వేదాల మాదిరి కాకుండా పురాణాలు అన్ని వర్గాలకీ అందుబాటులోకి వచ్చాయి. బౌద్ధ స్థూపాల ప్రభావంతో దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. శ్రమణ మతాలు క్షీణ దశ పట్టాయి. పౌరాణిక మతంగా మారిన వైదికం మళ్లీ ‘నేను’గా మారింది. అందులోనుంచి శైవ, వైష్ణవ, శాక్త, శక్తి అంటూ మళ్లీ ఇతరులు పుట్టుకొచ్చారు. వెయ్యేళ్ల పాటు సమ్మతి, అసమ్మతుల మధ్య సుధీర్ఘంగా సాగిన ఈ సంభాషణలో ఆదాన ప్రదానాల నిష్పత్తి తేల్చడం కష్టం.


క్రీశ రెండవ సహస్రాబ్దికి చెందింది మూడవ ఉదాహరణ. మధ్యయుగాల నాటి ఈ ఘట్టంలో మతానికీ సంఘానికి జరిగిన అపూర్వ సంభాషణ ఆ రెండు రంగాల్ని జ్వాజ్వల్యమానం చేసిందని రొమిలా థాపర్ అన్నారు. భక్తి, సూఫీ ఉద్యమాల పేరిట విస్తరించిన ఈ యుగచైతన్యంలో వాటిని నడిపిన సంత్‌లు, పీర్‌లు ప్రధాన మతాలైన పురాణ హైందవానికీ, ఇస్లాంకీ ‘ఇతరులు’. వివిధ విశ్వాసాలను సౌకర్యం కోసం హిందు అనీ, ముస్లిం అనీ రెండే మతాలుగా వర్గీకరించే ఆత్రుతలో వాటి మధ్య ఉన్న సున్నితమైన వైరుధ్యాలు, సందిగ్ధతలు, మార్మికత విస్మరించబడ్డాయని ఈ ప్రాజ్ఞి అన్నారు. బ్రాహ్మణాధిక్యత, భారీ దేవాలయాలూ, అపారమైన సంపదలతో విజృంభిస్తున్న పురాణ హైందవం మీద కర్మకాండలకన్నా భక్తి కలిగి ఉండడమే ప్రధాన లక్షణంగా కబీరు, దాదు, రవిదాస్, నానక్‌లు ఒకవైపు, ఇస్లాం నమాజ్ మీద, హజ్ యాత్రల మీద, ఉపవాసాల మీద అవిశ్వాసంతో అహింస, భక్తి, సంయమనాలతో పీర్‌లు మరొకవైపూ తాత్విక తిరుగుబాటు చేశారు. ఈ రెండిటి మూలాలూ ఒకనాటి శ్రమణ సంస్కృతిలో ఉన్నాయి. వీళ్లంతా కొత్త మతాల్ని స్థాపించలేదు. మతాన్ని తత్వాన్నీ ఆధిపత్య వర్గాల నుంచి విముక్తం చేశారు. లాల్ దేడ్, మీరాబాయ్ వంటి మహిళా బోధకులు ప్రవేశంతో సామాజిక రంగం తేజోవంతమైంది. బుల్లేషా, మాలిక్ మహమ్మద్ జైసీ వంటి వారు కృష్ణ భక్తిని ప్రదర్శిస్తూ అద్భుతమైన గీతాలు రాశారు. ఈ గీతాలను ఇప్పటికీ హిందూస్తానీ సంగీత కచేరీలలో గానం చేస్తూనే ఉన్నారు. కాగా స్థానిక మతాలు ఇస్లాంను ‘ఇతరులు’గా చూడడం గురించి ప్రస్తావిస్తూ ‘అరబ్బుల, తురుష్కుల మూలాలు ఒకనాటి యవనులు శకుల్లో ఉన్నాయని’ రొమిలా అన్నారు. ఒక సమ్మతిని ఒక అసమ్మతిగా మాత్రమే ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేస్తూ అనేక సమ్మతులు అనేకానేక అసమ్మతులూ ఉండడం ఈ యుగలక్షణంగా ఆమె రుజువు చేశారు. 


‘ఆధునిక యుగంలో వలసవాదులు ప్రారంభించిన భారతీయ చరిత్ర, సంస్కృతుల అధ్యయనం (ఇండాలజీ) కేవలం వలసదృక్పథంతో చూడబడిన అగ్రవర్ణ సాంస్కృతిక అధ్యయనమే’ అని అంటూ ‘అది నిమ్నకులాల సంస్కృతుల అధ్యయనాన్నీ వివిధ సాంస్కృతిక అసమ్మతుల అస్తిత్వాన్ని నిరాకరించిందని’ రొమిలా థాపర్ అన్నారు. పాశ్చాత్య విద్వజ్ఞులు పరిశీలించిన సంస్కృత ఆధారాలు ఒక హిందువు ముందుగా తన కులం చేత గుర్తించబడతాడు కానీ మతం చేత కాదని చెప్పలేకపోయాయని కూడా ఆమె అన్నారు.


దేశాన్ని ప్రజాస్వామిక స్వేచ్ఛా దేశంగా మార్చిన గాంధీ సత్యాగ్రహాన్ని నాల్గవ ఉదాహరణగా రొమిలా తీసుకున్నారు. ఇది గత కాలపు అనేక సమ్మతి అసమ్మతుల సంగ్రహ రూపం. భారతీయ సమాజం యుగాలుగా అసమ్మతిని అంతర్లీన శక్తిగా కలిగి ఉండడం వల్లే సత్యాగ్రహం విజయవంతమైంది. బ్రాహ్మణ సంప్రదాయం మీద శ్రమణులు అసమ్మతి చూపితే వారినుంచి సంత్‌లు, పీర్‌లు స్ఫూర్తిని పొందిన నేపథ్యంలో గాంధీ శ్రమణ సంప్రదాయం నుంచి ప్రేరణ పొందారు. 


మతతత్వ మూలాల గురించీ ఆ రాజకీయాల గురించీ కొంత వ్యాఖ్య చేసిన అనంతరం థాపర్ ఐదవ ఉదాహరణగా షహీన్‌బాగ్ ఉద్యమాన్ని తీసుకున్నారు. అనాదిగా మొదలైన అసమ్మతి కొనసాగి సమకాలీనంలో ప్రతిధ్వనించింది అంటూ దీన్ని గాంధీ సత్యాగ్రహానికి కొనసాగింపుగా ఆమె గుర్తించారు. షహీన్‌బాగ్‌కు స్వయంగా వెళ్లి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళల్ని కలిసి వచ్చిన రొమిలా తన అనుభవాన్ని వివరించారు. ఆ ఉద్యమకారుల ప్రధాన కోరిక తమ పౌర హక్కులు రద్దు కాబడవనే హామీ. అంతే. అసోంలో సృష్టించబడిన అయోమయం లోంచి ఉత్పన్నమైన న్యాయబద్ధమైన కోరిక అది. ‘భారతదేశపు మహిళగా నా సహవాసుల పట్ల వారి న్యాయబద్ధమైన కోరిక పట్ల నాకు గౌరవమూ, గర్వమూ కలిగాయి’ అంటూ ‘ఒక వ్యక్తి పుట్టుక, పుట్టిన ప్రదేశం, పౌరసత్వం గురించి మాట్లాడడానికి మహిళల కన్నా అర్హులు ఎవరుంటారు?’ అనే ఎంతో అర్థవంతమైన ప్రశ్నను రొమిలా సంధించారు. 


జాతీయభావం ఒక ప్రగతిశీల శక్తి. ఇది, రాచరికాల స్థానంలో ప్రజాస్వామిక జాతీయరాజ్యాల్ని స్థాపించింది; ఒకనాటి పాలితుల స్థానంలో పౌరుల్ని తెచ్చింది. పౌరులకూ రాజ్యానికీ మధ్య నిరంకుశమూ విదేశీయమూ కాని ప్రభుత్వాన్ని జాతీయభావం ప్రతిపాదించింది. ప్రభుత్వం అంటే పౌరుల ప్రతినిధి అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ వ్యవస్థ పౌరుల హక్కులను కాపాడవలసిన బాధ్యతను రాజ్యం మీద పెట్టింది. ఈ ఒప్పందాన్ని రాజ్యాంగం నిక్షిప్తం చేసింది. కాబట్టి జాతీయభావం అంటే సమాన హోదా, సమాన హక్కులు ఉన్న ప్రజలందరూ కలిసి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకోవడం. అందువల్ల మతం, జాతి, భాష ప్రాతిపదికన వారి పట్ల వైమనస్యం చూపడానికి వీల్లేదనీ, ఒక మతం పట్ల అపేక్ష, విమతాల పట్ల వివక్ష జాతీయభావం కాజాలవని ఈ చరిత్ర పారంగతురాలు అన్నారు. మానవ సమాజాల్లో ప్రభుత్వాలకు ప్రజలందర్నీ సమానంగా చూడగలిగే నైతిక నియమావళి ఉండాలి. పౌరస్వరం అందరికీ వినిపించడమే ఆధునిక యుగ లక్షణం. పౌరులు మాట్లాడినప్పుడు ప్రభుత్వాలు వారి నోళ్లు నొక్కడానికి చేసిన ప్రయత్నాలు విఫలమై వినడం విధాయక మౌతున్న సందర్భం ఇది. భవిష్యత్ అంతా రాజ్యానికీ పౌరులకు ఒకరి పట్ల ఒకరికి ఉన్న హక్కులూ బాధ్యతల పట్ల జరిగే శక్తివంతమైన సంభాషణ మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉందని ‘అసమ్మతి స్వరాలపై తన సుదీర్ఘ వ్యాసాన్ని రొమిలా థాపర్ ముగించారు.

కొప్పర్తి వెంకటరమణమూర్తి


వేదకాలం నుంచి పౌరసత్వ చట్టాల వ్యతిరేక ఉద్యమాల దాకా భారతదేశ చరిత్రలో ఒక స్వతస్సిద్ధ మేధో వాహినిగా ఉన్న అసమ్మతి గురించి రొమిలా థాపర్ తన ‘అసమ్మతి స్వరాలు’లో ప్రతిభావంతంగా వివరించారు. భారతదేశ చరిత్ర రచనలో మౌలిక కృషి చేసిన ఈ సుప్రసిద్ధ విద్వజ్ఞురాలు తన భావాలు, విశ్వాసాలకు అనుగుణంగా రెండుసార్లు పద్మ పురస్కారాలను తిరస్కరించిన ప్రజా మేధావి.

Updated Date - 2021-05-02T06:01:25+05:30 IST