వరి రైతుకు ‘తరుగు’ దెబ్బ

ABN , First Publish Date - 2021-05-21T06:09:36+05:30 IST

సుదీర్ఘ అనిశ్చితి అనంతరం, రబీ ధాన్య సేకరణలో చిట్టచివరి గింజ వరకూ తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీతో ప్రభుత్వం కొనుగోలు ఆరంభించింది....

వరి రైతుకు ‘తరుగు’ దెబ్బ

సుదీర్ఘ అనిశ్చితి అనంతరం, రబీ ధాన్య సేకరణలో చిట్టచివరి గింజ వరకూ తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీతో ప్రభుత్వం కొనుగోలు ఆరంభించింది. కానీ మొదటి గింజను దించడం నుంచే మిల్లర్ల ఆటంకాలకు అంతులేదు. తప్ప, తాలు పేరిట క్వింటాలు వడ్లకు మూడు కిలోలకు పైగా కోత విధిస్తున్నారు. ప్రతి 40 కిలోల బస్తాకు రెండుమూడు కిలోలు అదనంగా కోతవేయడం అధికారికం అయింది. లారీకి ఐదారు క్వింటాళ్ళు దోచుకొంటున్నారు. అకారణ అర్థరహిత కొర్రీలతో ఏ రైతునూ వదలటం లేదు. ఇక 40 కిలోల బస్తా అన్నమాటకు ఏం విలువ మిగిలింది? ప్రభుత్వమే దానిని 43 లేదా 44 కిలోలుగా మారిస్తే సరిపోతుంది కదా? 40 కిలోలు ప్రభుత్వానికి, 3, 4 కిలోలు మిల్లర్‌కు అని నిర్ణయిస్తే సరి. ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యాన్ని పంపించినా మిల్లర్లు వాటిని సాధారణ రకంగా ‘బి’ గ్రేడ్‌గా నిర్ధారించి రైతులనుంచి ఒక్క క్వింటాలుకు రూ.20 వరకూ దోపిడీ చేస్తున్నారు. కొన్ని మిల్లులు ఏకంగా ఇది ‘ఏ’ గ్రేడ్‌ కాదు, ‘బి’ గ్రేడ్‌ ధాన్యమని, మిల్లుకు చేరిన లారీ ధాన్యం దించుకొనే సమయంలో తెలివిగా, సరుకు వెనక్కు పంపమంటారా, దించమంటారా? అని ఫోన్లు చేసి ఏకంగా రైతులను సెంటర్‌ ఇన్‌చార్జీలను హెచ్చరిస్తున్నారు. ఏ రైతు కూడా అసలే వేసవిలో ‘బి’ గ్రేడ్‌ సాగుచేయడు. గత్యంతరం లేక రైతులు ప్రతి క్వింటాలుకు కేవలం గ్రేడ్‌ పేరిట రూ. 20 నిలువు దోపిడీకీ గురవుతున్నారు. ఇదో కొత్త వ్యవస్థీకృత దోపిడీగా మారింది. ఇలా సన్న చిన్నకారు, కౌలు రైతుల కుత్తుకలను కత్తిరిస్తున్నారు. తెలంగాణ రైస్‌మిల్లులలో అధికారపార్టీ నాయకులే భాగస్వాములుగా మారి రైతులోకాన్ని మిల్లులకు బానిసలుగా మార్చారు. 


ఖరీఫ్‌లో సన్నరకం వరి వేయమని ప్రభుత్వం రైతును అడుగుకు తొక్కిన ఫలితమే పెద్దఎత్తున ఆత్మహత్యలు. ఇక రబీలో దోపిడీ కొత్త పుంతలు తొక్కుతోంది. హార్వెస్టర్స్‌ ఫ్యాన్ల వేగం పెంచి, ప్యాడీ క్లీనర్ల తూర్పార పట్టి, తాలు తొలగించినా.. ఇంకా తాలు, మట్టి ఉందంటూ తరుగు పేరుతో సాగించే ఈ దోపిడీ విలువ రూ.488 కోట్లని ఓ విశ్లేషణ. వాస్తవంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. తరుగు పేరుతో మిల్లర్లు రైతుల రక్తాన్ని జుర్రుకుంటున్నారు. మిల్లుకుపోయిన లారీలో అకారణ కొర్రీలు పెట్టి అడిగినంత ఇస్తే అన్‌లోడ్‌ చేస్తాం, లేకపోతే చెయ్యం అంటున్నారు. ఏటా రెండు వరి కోతల కాలాన్ని, రైతును ఇలా నిలువు దోపిడీ చేసి, సొంత ఆస్తి పెంచుకోవడానికి మిల్లర్లకు వరి సేకరణ చక్కటి అవకాశంగా మారింది. ధాన్యం తరుగు తీస్తే కఠిన చర్యలని మంత్రి చెప్పినా, తెలంగాణలో ఒక్క మిల్లు పట్టించుకున్న దాఖలా లేదు. పండిన పంటను అకాలవర్షాల నుంచి రక్షించడం రైతుకు చెలగాటమయ్యింది. అశాంతితో రైతు గుండె చెరువవుతోంది. ఇదే అదనుగా మిల్లర్లు వేస్తున్న ‘తరుగు దెబ్బ’ వరి రైతు నెత్తిపై పిడుగుపాటవుతోంది. పరిస్థితి అటు చూస్తే నుయ్యి, ఇటు చూస్తే గొయ్యిగా మారింది. ప్రభుత్వ ఉదాసీనత మిల్లర్ల దోపిడీకి హేతువైంది. 


వంద శాతం నాణ్యమైన, ప్రభుత్వ ప్రమాణాలున్న, వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని కూడా 42 కిలోలు తూకం వేయాలని రైతాంగం నెత్తిపై మిల్లర్లు పెట్టిన ఒత్తిడికి 2 కిలోల అదనపు తూకం సార్వత్రికమైంది. మిల్లులు ఖాళీఉన్నా, మిల్లుల్లో స్థలం ఖాళీ లేదనే సాకుతో వడ్లు దించడం లేదు. ఎక్కడికక్కడ ధాన్యాన్ని నిలువచేసే గోడౌన్‌ల సదుపాయాలపై దృష్టిలేమే ఈ దుస్థితికి కారణం. పండించిన ప్రతి చివరి గింజను కొంటామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటంలో, మిల్లర్లు రైతులను పెట్టే బాధలను నిలువరించడంలో విఫలమైంది. వివిధ ఎన్నికలలో భారీ డబ్బుతో గెలిచిన అనేకమంది మిల్లర్లు కీలక పదవుల్లో ఉండటం, మంత్రులను ప్రభావితం చేసేంతటి ఆర్థిక శక్తి కలవారు కావడమే ఇందుకు కారణం. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మేం వ్యతిరేకం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం, ఈ వందల కోట్ల తరుగు కుంభకోణాన్ని అరికట్టడంలో విఫలం చెందింది. మిల్లర్లు ఉద్దేశ్యపూర్వకంగా అనేక ఆటంకాలు సృష్టించి, ధాన్యంలో వివిధ రకాల వంకలుపెట్టి, కోతలు కోసి, దోపిడి రేటు, లాభాల రేటు పెంచుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. 


రైతులు ఆరబెట్టి తెస్తుండడంతో తేమ దోపిడీకి అవకాశం లేకపోవడంతో తప్పా, తాలు దోపిడీకి తెర లేపారు. ఫ్యాన్‌ వేగం పెంచి, తూర్పార పట్టి తప్పా తాలును రైతులు తొలగించారు. దాంతో ఇక ఉతార్‌ (పి.డి.యస్‌.కి ఇచ్చే బియ్యం) రావడం లేదనే కొత్త నాటకానికి మిల్లర్లు తెరదీసారు. గతమంతా 40 కిలోలకే బియ్యం ఉతార్‌ ఎలా వచ్చింది? నేడు 43 కిలోలు అయినా ఎందుకు ‘ఉతార్‌’ రావు? ఎవరిది సత్యమో వ్యవసాయమంత్రి చెప్పాలి. అధికార రాజకీయాల్లో రైస్‌ మిల్లర్లు మిలాఖత్‌ అయ్యారంటూ రైతుల గుండెలు రగులుతున్నాయి.


రైతులు రెండు సీజన్లలో కోటీ ఐదులక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారు. వేసవిలో 52 లక్షల 6 వేల ఎకరాలలో వరి పండించారు. ఈ 52 లక్షల ఎకరాల మాగాణి భూమి సాగైతేనే, వచ్చే వరి ధాన్యాన్ని కొనడానికి ఇలా యాతనలు పడుతుంటే, కెసిఆర్‌ చెప్పే కోటి ఎకరాల మాగాణి సాగైతే, ఇంకా ఒకటిన్నర రెట్లు అధికంగా ధాన్యం దిగుబడి వస్తే రైతు దుస్థితి ఏమిటి? నేడు కొనుగోలు కేంద్రాల నుంచి కదలని, తరచూ తడుస్తున్న పంటను, రోజూ కమ్ముకొస్తున్న మబ్బులను చూస్తూ ప్రతి రైతూ కుమిలిపోతున్నాడు.


దశాబ్దాలు గడిచినా ధాన్య సేకరణకు ఒక సమగ్ర విధానం లేదు, ఒక చట్టమూ రూపమూ లేదు. మొత్తం ధాన్య సేకరణ స్తంభనకు, రైతాంగం అశాంతికి కారణమవుతున్న అతి చిన్న అన్‌లోడింగ్ (దించుకునే) సమస్యను కూడా నేటి సేకరణ విధానం నెల గడిచినా పరిష్కరించదు. దశాబ్దాలు గడిచినా రైతాంగం సమస్యలకు మార్గం దొరకదా? ఉన్నతాధికారులు ధాన్య సేకరణపై ఆఫీసు గదుల్లో చేసే యుద్ధాలు కింద స్థాయిలో సఫలం కావడం లేదు. రైతాంగానికి సంతోషం బదులు అశాంతే మిగులుతోంది. ఒకపక్క మిల్లర్ల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుండగా- లారీ ఓనర్లు, రైతు సహకార సంఘాల నాయకులు, కొనుగోలు సెంటర్‌ ఇంచార్జీలకు రైతు ప్రతీ నలభై కిలోల బస్తాకు రూ.8 నుంచి రూ.10 దాకా చెల్లిస్తున్నాడు. వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు వింటూ, దట్టమైన నల్లటి మబ్బులను చూస్తూ బస్తాకు రూ.10 పైగానే కుమ్మరిస్తున్నాడు. గత వేసవిలో బస్తాకు రూ.20 చెల్లించాడు. లారీకి సెంటర్‌ ఇంచార్జీకి వెయ్యి రూపాయల చొప్పున పోగా, ప్రధాన వాటాగా లారీ యజమానులు, అధికార ప్రైమరీ అగ్రికల్చర్‌ కోపరేటివ్‌ సొసైటీల (పాక్స్‌) నాయకులు భారీ ఎత్తున డబ్బు దండుకుంటున్నారు. 


మిల్లర్లు, లారీ యజమానులు, ‘పాక్స్‌’ నాయకులు, సెంటర్‌ ఇంచార్జీల ‘సమష్టి దోపిడీ’కి రైతు కేంద్రబిందువయ్యాడు. ఈ దోపిడీలో పోయింది పోను రైతు కష్టం కూడా చేతికి రాదు. పైపెచ్చు రెండో విడత కరోనా గ్రామీణ రైతు భారతంలో కల్లోలం సృష్టిస్తోంది. వైద్యం పేర లక్షల దోపిడీకి గ్రామీణ రైతు భారతం వేదికైంది. ఈ ఆధునిక వ్యవస్థాగత దోపిడీకి రైతు లోకం నలుగుతోంది, రగులుతోంది.

ప్రొ. వినాయక్‌ రెడ్డి

విశ్రాంత అర్థశాస్త్ర ఆచార్యులు

కాకతీయ విశ్వవిద్యాలయం 

Updated Date - 2021-05-21T06:09:36+05:30 IST