ప్రజాస్వామ్యమా? వ్యక్తిస్వామ్యమా?

ABN , First Publish Date - 2021-09-16T06:10:20+05:30 IST

అనైతికమైన, అప్రజాస్వామిక విధానాల ద్వారా ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని ప్రయత్నించడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక వ్యక్తిస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం కలుగుతోంది....

ప్రజాస్వామ్యమా? వ్యక్తిస్వామ్యమా?

అనైతికమైన, అప్రజాస్వామిక విధానాల ద్వారా ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని ప్రయత్నించడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక వ్యక్తిస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం కలుగుతోంది. రాష్ట్రంలో మానవమృగాల అఘాయిత్యాలకు బలి అయిన బాధిత కుటుంబాలను పరామర్శించడం నేరమా? రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు సర్వసాధారణ నేరాలుగా మారాయి. నరసరావుపేటలో హత్యకు గురైన అనూష కుటుంబసభ్యులను పరామర్శించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అక్కడకు బయలుదేరితే జగన్ ప్రభుత్వం మూడువేల మంది పోలీసులను మోహరించి అనుమతి లేదంటూ అడ్డుకున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి బాధితులను పరామర్శించే స్వేచ్ఛ కూడా లేదా? ఒక ప్రజాప్రతినిధికి రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను కాలరాయడం ఏమిటి? రాష్ట్రంలో ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు వ్యవస్థను ప్రతిపక్షాన్ని అణచివేసి తమ రాజకీయ అవసరాలకు రాళ్ళెత్తే కూలీలుగా మార్చారు. ప్రతిపక్షాన్ని అణచివేయడంపై, వేధించడంపై చూపుతున్న పట్టుదల మానవమృగాల అఘాయిత్యాలకు బలి అవుతున్న మహిళల రక్షణపై చూపించి ఉంటే మహిళలపై ఇన్ని దారుణాలు జరిగేవి కావు. అధికార పార్టీ కార్యక్రమాలకు, ఊరేగింపులకు వర్తించని కొవిడ్ నిబంధనలు ప్రతిపక్షం పరామర్శలకు వర్తిస్తాయా? నర్సరావుపేటకు వెళ్లడానికి అనుమతి లేదని, మీడియాతో కూడా మాట్లాడవద్దని ఎమ్మెల్సీ లోకేశ్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు.


ప్రజలకు, రాజకీయ పార్టీలకు శాంతియుతంగా సభలు, ప్రదర్శనలు, ధర్నాలు జరిపే ప్రాథమిక హక్కు ఉందని గుర్తించి హింసకు తావు ఇవ్వకుండా ఆ హక్కును వినియోగించుకునేలా పోలీసులు తోడ్పడాల్సి ఉంది. పాలనాపరంగా వచ్చే వత్తిళ్లకు పోలీసులు లొంగితే ప్రజాస్వామ్య పునాదులకు బీటలు బారినట్లే. పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తుంటే ప్రజలు, ప్రతిపక్షం మాత్రం చట్టాలను ఎందుకు గౌరవించాలి? పాలకుల అసమర్థ తను, వైఫల్యాలను, జరుగుతున్న నేరాలను, ఘోరాలను ప్రతిపక్షం ప్రశ్నించకూడదా? అణచివేత, అక్రమ కేసులకు సంబంధించి ఆ మధ్య హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ పోలీసుల విధానం ఎమర్జెన్సీని తలపిస్తోందని, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు అవుతుందా అని, పోలీసులు చట్ట నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని ధర్మాసనం చీవాట్లు పెట్టినా పోలీసుల వైఖరిలో మార్పు రావడం లేదు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు తమకు తామే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చట్టం ఒప్పుకోదంటూ ముఖ్యమంత్రుల ఆదేశాలనే సున్నితంగా తిరస్కరించిన అధికారుల శకం అంతరించి రాజకీయబాసులు ఆడమన్నట్లు ఆడే అధికారుల సంతతి ప్రజాస్వామ్య వ్యవస్థనే కదలబారుస్తోంది నేడు. నిబద్ధతతో పనిచేసే యంత్రాంగం అంతరించి స్వామికార్యంతో పాటు స్వకార్యాన్ని సాధించుకుంటున్నారు అధికారులు. 


జగన్ ప్రభుత్వ అరాచకం, వేధింపులు, సాధింపులు, నియంతృత్వంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రజల, ప్రతిపక్షాల హక్కులను హరించడం మంచిది కాదని గుర్తించాలి. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులకు విధేయులుగా ఉన్నామని నిరూపించుకోవడానికి అంతులేని ఆరాటం ప్రదర్శిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం.


రెండున్నరేళ్ల జగన్ పాలనలో దుశ్శాసన సంతతి వికృత రూపం దాల్చి మహిళాలోకం వణికి పోతుంటే, ప్రాణం లేని దిశ చట్టం, దిశ యాప్‌తో ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. జగన్ సర్కార్ రెండున్నరేళ్ళ పాలనలో మహిళలపై 500లకు పైగా అత్యాచారాలు, సామూహిక హత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగాయి. మాయ చట్టాలు, మాయ యాప్‌లు తెచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు మభ్యపెడుతున్నారు. దిశ చట్టం కాకుండానే మహిళలను ముట్టుకొంటే 21 రోజుల్లో మరణ శిక్షే అంటూ ఊరూవాడా ఊదరగొట్టారు. అసలు ఆ చట్టం రూపుదాల్చకుండా అమలులోకి వచ్చినట్లు భ్రమలు కల్పించారు. తాము చేసిన దిశ చట్టం దేశానికే మార్గనిర్దేశం చేస్తోందని గొప్పలు చెప్పారు. చివరకు ఆ బిల్లును కేంద్రప్రభుత్వం వెనక్కి పంపింది. మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు, సత్వర న్యాయం కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు అనేక కమిషన్లు, పార్లమెంట్ కమిటీల సిఫార్సులు ఉన్నాయి. దిశ చట్టం తెచ్చి ఇంతకాలం అయినా రాష్ట్రపతి ఆమోదానికి నోచుకోలేదు. ఏదో విధంగా మహిళలను బురిడీ కొట్టించి బుట్టలో వేసుకోవాలన్న యావ తప్ప, మహిళలకు భద్రత కల్పించి వారి మానాభిమానాలకు రక్షణ కల్పించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న లక్ష్యం జగన్ ప్రభుత్వానికి లేదు. ఏదియేమైనా ప్రజాస్వామ్యం ముసుగులో వ్యక్తిస్వామ్యం, నియంతృత్వం ఇదే విధంగా కొనసాగితే మరిన్ని విషపరిణామాలకు దారి తీస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సంఘటనలపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, గళం విప్పాలి.

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2021-09-16T06:10:20+05:30 IST