నాలుగు స్తంభాలు నిలిస్తేనే ప్రజాస్వామ్యం పదిలం
ABN , First Publish Date - 2021-02-04T09:21:31+05:30 IST
ప్రధానమంత్రి మోదీ ఎప్పుడూ ‘జనతా జనార్దన్’ అంటారు, అంటే ప్రజలే దేవుడు అని అర్థం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల చుట్టూ...
ప్రధానమంత్రి మోదీ ఎప్పుడూ ‘జనతా జనార్దన్’ అంటారు, అంటే ప్రజలే దేవుడు అని అర్థం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధి ఫలాల పంపిణీ మారుమూల ప్రాంతాల ప్రజల్లో చివరి వ్యక్తి వరకూ అందాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు విధులను నిష్పాక్షికంగా నిర్వర్తించడానికి, రాజ్యాంగంలో పొందుపరచిన ప్రకరణలకు లోబడి పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి రాజ్యాంగం సహేతుకమైన చెక్స్ అండ్ బ్యాలెన్స్‌లతో మార్గదర్శకం చేస్తూంది. ప్రభుత్వాలు రాజ్యాంగ నిబంధనల స్ఫూర్తితో చట్టాలను, విధానాలను అమలు చేస్తాయి. ముఖ్యంగా, ఆ చట్టాలూ విధానాలూ భారతదేశ భూభాగంలో నివసించే ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదు. భంగం కలిగిస్తే అలాంటి చట్టాలూ విధానాలూ చెల్లనేరవు. రాజ్యాంగ వ్యవస్థలో విధులను నిర్వర్తించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రకరణలకు అనుగుణంగా తమ విధులను, బాధ్యతలను నిర్వర్తించాలి. ఆ పరిధిని మించి పనిచేయడానికి అనుమతి లేదు.
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, మూడు స్తంభాలనదగిన వ్యవస్థలు రాజ్యాంగం ద్వారా తగినంత చెక్స్ అండ్ బ్యాలెన్స్‌లతో పాలనా యంత్రాంగాలను కాపాడతాయని భావించారు. వీటిలో మొదటి స్తంభం- పార్లమెంటు, శాసనసభలు. వీటి ద్వారా చట్టాలను రూపొందించి పాలన విధానాలకు రూపం ఇస్తారు. రెండవ స్తంభం- విధానాలను అమలు చేయడానికి అవసరమైన కార్యనిర్వాహక వ్యవస్థ. దీని పని పార్లమెంటు, శాసనసభ చేసిన చట్టాలను అమలు చేయడం. దీనినే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటారు. మూడవ స్తంభం- న్యాయవ్యవస్థ. ప్రభుత్వాల చట్టాలు, నిర్ణయాలు, వాటి అమలు రాజ్యాంగ నిబంధనల పరిధిలో ఉన్నాయో లేదో, రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలకు లోబడి ఉన్నాయో లేదో సమీక్షించటానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ న్యాయవ్యవస్థ/ జ్యుడిషియరీ.
పార్లమెంట్, శాసనసభ చేసిన చట్టాలలోనూ, కార్యనిర్వాహక విధానాల అమలులోను న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్న సంఘటనలను అనేకం మనం చూశాం. ముఖ్యంగా, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా విధ్వంసకర ప్రవర్తన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచూ సవాళ్లను ఎదుర్కొంది. ఉదాహరణకు, ఏపీసీఆర్‍డీఏ చట్టం ద్వారా చెల్లుబాటు అయ్యే ఒప్పందంతో రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చిన రైతులను నమ్మకద్రోహంతో వంచించిన ఉదంతం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తీర్పు వచ్చింది. ఇంకా ఇదే అంశంపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసి రైతుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిందని భావించిన రాష్ట్ర హైకోర్టు సిఆర్‌డిఎ చట్టం రద్దును ఆపివేసింది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమరావతిని నిర్వీర్యం చేయాలని భావించింది. రాజ్యాంగ విరుద్ధంగా రాజధానిని మూడుముక్కల ఆటగా మార్చి కొత్త చట్టాలను రూపొందించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో భారత పౌరుడిగా నాతో సహా మరికొంతమంది అమరావతి రైతుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై పిల్ దాఖలు చేశారు. ఇప్పటికే గౌరవనీయ హైకోర్టు రాజధాని నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ఖజానా ద్వారా వెచ్చించిన నిధులను వృథా చేయడంపై ఆక్షేపణ వ్యక్తపరుస్తూ, ఏపీసీఆర్‌డీఏని లెక్కలు అడుగుతూ, ఆ చట్టం రద్దుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఇది కాక, ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హక్కులను ఉల్లంఘించేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె కు విరుద్ధంగా ప్రభుత్వం ఏపీ పంచాయతీ రాజ్ చట్టం సవరణ చేసింది. దాన్ని తప్పుపడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టసవరణ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
అలాగే ప్రభుత్వ విధానాల అమలులో పౌరుల ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకోవడంలో కార్యనిర్వాహక వ్యవస్థ విఫలమైనప్పుడు కోర్టులలో ప్రతికూల తీర్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో తెలుగు మీడియం స్థానంలో బలవంతపు ఇంగ్లీష్ మీడియంను రుద్దటం వంటి విషయాలలో కోర్టు ఆదేశాల ద్వారా ఇటువంటి విధానాల అమలును ఆపడం జరిగింది. ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతిష్ఠంభన ఉన్నప్పుడు ఎస్.ఆర్. బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ తీర్పును నేటికీ అనుసరిస్తున్నాము. అలాగే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి మూడు వ్యవసాయ చట్టాలను 18 నెలలకు వాయిదా వేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించి, ఒక కమిటీని వేయడానికి ముందుకు వచ్చింది.
ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యంపై ప్రభుత్వం బహిరంగ దాడి చేసిందనటంలో అతిశయోక్తి లేదు. వైయస్ జగన్, అతని పార్టీ ప్రతినిధులు సంపూర్ణ అధికారం ఇచ్చిన అహంకారంతో న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా విరుచుకుపడటంతో శాసన, న్యాయవ్యవస్థల మధ్య సత్సంబంధాలు దిగజారాయి. ఒకవైపు కేంద్రప్రభుత్వం న్యాయవ్యవస్థను గౌరవించి మూడు వ్యవసాయ చట్టాలపై కోర్టు ఆదేశాలను అనుసరిస్తే, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి రైతులకు వ్యతిరేకంగా సహజ న్యాయ సూత్రాలకు తిలోదకాలిచ్చింది.
రాజ్యాంగ వ్యవస్థలు పరస్పర సహకారంతో, ఏ ఆధిపత్య పోరూ లేకుండా పని చేయడం ద్వారా మన ప్రజాస్వామ్యంలోని మూడు స్తంభాలకు శోభ చేకూరుతుంది. చివరిది, నాల్గవ స్తంభం అయిన మీడియా ప్రజాస్వామ్య విలువలను చాటడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ నాలుగు స్తంభాలు రాజ్యాంగబద్ధంగా, పరస్పరం చేదోడు వాదోడుగా ఉండాలి కాని, ఒకరి పరిధిని మరొకరు అతిక్రమించకూడదు.
లంకా దినకర్