‘హరితహారం’పై కమిటీ వేయాలి
ABN , First Publish Date - 2021-07-03T06:11:01+05:30 IST
తెలంగాణలో అడవులు 33 శాతం ఉండే విధంగా చూడడం కోసమే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. మొదటి మూడేళ్లలోనే 230 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల్లోను, ఆ ప్రాంతాలకు...
తెలంగాణలో అడవులు 33 శాతం ఉండే విధంగా చూడడం కోసమే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. మొదటి మూడేళ్లలోనే 230 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల్లోను, ఆ ప్రాంతాలకు అవతల 120 కోట్ల మొక్కలను నాటారు. ప్రభుత్వం సగటున ఏడాదికి 400 కోట్ల రూపాయలకు పైగా పచ్చదనంపై ఖర్చు చేస్తోంది. కోట్లు వెచ్చించి మొక్కలు నాటడం హర్షించదగ్గ విషయమే కానీ వాటికి రక్షణ కరువైంది. ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేస్తే గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నారు. నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారులదే. అందువల్ల మొక్కని కాపాడేందుకు ప్రభుత్వం ఐదుగురితో హరితదళం అనే పేరిట పర్యవేక్షణ కమిటీని నియమించాలి. ఈ కమిటీలో సామాజిక కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి. వీరికి వాహనాలు కూడా సమకూర్చాలి. హరితహారం కార్యక్రమం ఏడో విడత ప్రారంభమైన దృష్ట్యా వెంటనే ఈ చర్యలు తీసుకోవాలి. దీనితో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో, వాటి పరిరక్షణలో భాగస్వాములై సామాజిక బాధ్యత నెరవేరుస్తూ ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు తమ వంతు కృషి చేయాలి.
గుండమల్ల సతీష్ కుమార్, సంస్థాన్ నారాయణపురం