‘ప్రైవేటు’ కోసమే ప్రభుత్వ స్కూళ్ల మూసివేత!

ABN , First Publish Date - 2021-07-08T05:41:47+05:30 IST

విద్యార్థులు లేని విద్యాసంస్థలను విలీనం చేయడమే మంచిదని ప్రభుత్వ గజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం ప్రభుత్వానికి నివేదించడమంటే–విద్యను ప్రైవేటీకరించమని సూచించడమే...

‘ప్రైవేటు’ కోసమే ప్రభుత్వ స్కూళ్ల మూసివేత!

విద్యార్థులు లేని విద్యాసంస్థలను విలీనం చేయడమే మంచిదని ప్రభుత్వ గజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం ప్రభుత్వానికి నివేదించడమంటే–విద్యను ప్రైవేటీకరించమని సూచించడమే. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించే నిధులు క్రమేపీ తగ్గిపోతున్నాయే తప్ప పెరగడం లేదు. నిధులు లేక, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయక, బ్లాక్‌బోర్డు, కంటింజెన్సీ నిధులు ఇవ్వక, భవనాలు నిర్మించక, విద్యార్థులకు సరిపడ మూత్రశాలలు, లైబ్రరీలు, బెంచీలు వంటి వసతులు కల్పించక ప్రభుత్వమే విద్యాసంస్థల మూసివేతకు మార్గం సుగమం చేసింది. ప్రభుత్వ స్కూళ్ళలో చేరేవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద విద్యార్థులే ఎక్కువ. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఏ కారణంతో విద్యార్థులు చేరడం లేదు? వాటి మూసివేతకు దారితీస్తున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు ఏమిటి అని విశ్లేషించకుండా, పిల్లలు లేకపోతే మూసివేయండని  సూచించడం సిగ్గుచేటు. ఇది విద్యను ప్రైవేటీకరించడానికి మార్గం సుగమం చేస్తుంది. విద్యాసంస్థల్లో లేదా వైద్యసంస్థల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లు రిటైరయినా, మరణించినా ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదో సర్కార్‌ వెల్లడించాలి. పైపెచ్చు ఈ సంస్థలకు కేటాయించాల్సిన నిధులను దారిమళ్ళిస్తోంది. గతంలో విద్యా పరిరక్షణ కోసం ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేసేవి. ఈ ఆనవాయితీకి గజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం తిలోదకాలు ఇచ్చింది. విద్య ప్రైవేటీకరణ యత్నాలను నిలువరిస్తూ ఉపాధ్యాయ సంఘాలు  ప్రగతిశీలశక్తులతో ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉంది.

పాపని నాగరాజు

సామాజిక తెలంగాణ మహాసభ

Updated Date - 2021-07-08T05:41:47+05:30 IST