సమవృద్ధితో వాతావరణ సమతుల్యత

ABN , First Publish Date - 2021-10-29T06:23:18+05:30 IST

ప్రపంచానికి ఇదొక విపత్సమయం. వాతావరణ మార్పు వల్ల కలిగే విషమ పర్యవసానాలను శాస్త్రవేత్తలు నిర్దేశించిన విధంగా ఎదుర్కొంటున్నామా? లేదు. ఈ విపత్తుపై పోరులో మానవాళి ఒక అంతిమ దశలో ఉంది....

సమవృద్ధితో వాతావరణ సమతుల్యత

ప్రపంచానికి ఇదొక విపత్సమయం. వాతావరణ మార్పు వల్ల కలిగే విషమ పర్యవసానాలను శాస్త్రవేత్తలు నిర్దేశించిన విధంగా ఎదుర్కొంటున్నామా? లేదు. ఈ విపత్తుపై పోరులో మానవాళి ఒక అంతిమ దశలో ఉంది. ఇప్పటికైనా చేపట్టే చర్యలపైనే మన సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. నిజానికి ఆవశ్యక కార్యాచరణకు సమయం మించిపోయింది కూడా! ఈ అవగాహనతోనే ప్రపంచనాయకులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో గ్లాస్గో నగరంలో ఈ నెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్న 26వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్ 26)లో పాల్గొనబోతున్నారు. భూమి ఉపరితలం అత్యంత వేగంగా వేడెక్కుతోందని, ఈ విపరీత పరిణామం అనూహ్య స్థాయిలో ఆందోళనకరంగా మారుతోందని వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ కమిటీ (ఐపీసీసీ) ఇటీవల ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ విపత్కర పరిణామాల గురించి శాస్త్రవేత్తలు ఇంకెంత మాత్రం మనకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాతావరణ మార్పు వల్ల సంభవిస్తున్న ప్రాకృతిక విపత్తులు అనేకం మనకు నిత్యం అనుభవంలోకి వస్తున్నాయి.


కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన కాప్ 26 సదస్సు తన సొంత ఎజెండాను, పని తీరును సరిదిద్దుకోవలసి ఉంది. వాతావరణ మార్పుపై చర్చలు ఫలప్రదమవుతాయని చెప్పే పరిస్థితి లేదు. ‘శీతోష్ణస్థితి మార్పులపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా కన్వెన్షన్’ (యుఎన్ఎఫ్‌సిసిసి) నిపుణులు సిద్ధం చేసిన చర్చాపత్రాలను చదివితే అవి మరో గ్రహానికి చెందినవారు రాసినట్టుగా ఉంటాయి! వాతావరణ మార్పుపై అంతర్జాతీయ చర్చలు దశాబ్దాలుగా జరుగుతున్నా వాటిలో నిజమైన పురోగతి లేదని చెప్పక తప్పదు. విపత్తును అదుపు చేసేందుకు అనేక కమిటీలు, సంస్థలు ఏర్పాటు చేసి నిధులు కేటాయించారు. అయినా సమస్య తీరకపోగా మరింతగా విషమిస్తోంది. కారణమేమిటి? వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే దీనికి కారణం. కనుకనే చర్చాపత్రాలు అర్థరహితంగా రూపొందుతున్నాయి. 


వాతావరణ మార్పుపై పోరులో తన నాయకత్వాన్ని రక్షించుకోవడమే కాప్ 26 ప్రధాన కర్తవ్యం కావాలి. శాస్త్రవేత్తలు నిర్దేశించే చర్యల కార్యసాధకతలో సంపన్న, పేదదేశాల ప్రజల విశ్వాసాన్ని పునర్నిర్మించాలి. ఇందుకు కార్యాచరణ ఎజెండా స్పష్టంగా ఉండి తీరాలి. రేపు కాదు, నేడే, ఈ క్షణాన చేపట్టవలసిన చర్యలకు ఆ ఎజెండా ప్రాధాన్యమివ్వాలి. 


ఇందుకు తొట్టతొలుత అంతు లేకుండా సాగుతున్న చర్చల ప్రక్రియకు స్వస్తి చెప్పాలి. ఇది, వాతావరణ చర్చలను ఐక్యరాజ్యసమితి పరిధినుంచి తొలగించడం గురించి కాదు. నిజానికి ఆ చర్చలు బహుముఖంగా జరగాలి. అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలోనే అవి జరిగి తీరాలి. సంక్షోభాన్ని పటిష్ఠంగా ఎదుర్కొనే కార్యాచరణను రూపొందించి తీరాలి. ఎవరు ఏమి సాధించాలి, ఎలా సాధించాలి అన్న అంశాలను స్పష్టంగా నిర్దేశించి తీరాలి. పర్యావరణ విధ్వంసానికి, భూమి వేడెక్కడానికి ఎక్కువగా కారణమవుతున్న దేశాలను అందుకు జవాబుదారులుగా చేయాలి. కాలుష్య నిరోధక చర్యలు చేపట్టేలా పేదదేశాలపై ఒత్తిడి చేయడాన్ని నిలిపివేయాలి. ఆ దేశాల అవసరాలను అర్థం చేసుకోవాలి. రెండోచర్య భూ ఉపరితల ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెల్సియస్ పరిధిలోనే ఉంచేందుకు 2030 సంవత్సరం లోగా కార్బన్ ఉద్గారాలను సగానికి తగ్గించేందుకు ఒక పటిష్ఠ కార్యచరణ ప్రణాళికను రూపొందించి అమలుపరచాలి. ముఖ్యంగా చైనా తన కార్బన్ ఉద్గారాలను కచ్చితంగా తగ్గించేలా శ్రద్ధ చూపవలసిన అవసరముంది. ప్రతి దేశమూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల సాధన విషయమై తమ ప్రణాళికను ఐక్యరాజ్యసమితికి సమర్పించాలని ప్యారిస్ ఒప్పందం నిర్దేశించింది. చారిత్రకంగా కార్బన్ ఉద్గారాల ప్రస్తావనను తొలగించినందున ఆ ఒప్పందం సంపన్న దేశాల ప్రశంసలు అందుకుంది. పేదదేశాలకు నష్టపరిహారాల చెల్లింపు విషయాన్ని కూడా పట్టించుకోలేదు. సంపన్నదేశాలకే అది ఎక్కువ అనుకూలంగా ఉందనేది స్పష్టం. పర్యావరణ కాలుష్యానికి ఎక్కువగా కారణమవుతున్న సంపన్నదేశాలు, ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పేదదేశాలు తమతో సమ బాధ్యత వహించాలన్న వైఖరితో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆదర్శప్రాయమైన, కార్యసాధకమైన ఒప్పందం ఎలా సాధ్యమవుతుంది? గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేలా కాప్ 26 జాగ్రత్త వహించాల్సి ఉంది. 


వాస్తవమేమిటంటే కార్బన్ బడ్జెట్ (భూ ఉష్ణోగ్రతను నిర్దేశిత పరిమితి కంటే తక్కువగా ఉంచుతూ కార్బన్ ఉద్గారాలు ఏ స్థాయిలో ఉండాలో స్పష్టం చేసేవి)లను కొద్ది దేశాలు మాత్రమే నిర్దేశిస్తున్నాయి. అయితే పేదదేశాల అభివృద్ధి హక్కు ఎవరూ తిరస్కరించలేనిది. ఆ హక్కును పొందే క్రమంలో అవి నిర్దేశిత కార్బన్ బడ్జెటట్‌ను అధిగమించడం ఖాయం. పరస్పరాధారిత ప్రపంచంలో ఇది అన్నిదేశాలకు చిక్కులు సృస్టిస్తుంది. సంపన్నదేశాలు గతంలో చేసిన తప్పులను ఇప్పుడు భారత్ లాంటి దేశాలు చేయకూడదు. పేదదేశాలు తమ కార్బన్ ఉద్గారాలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు సంపన్నదేశాలు వాటికి పూర్తి స్థాయిలో తోడ్పడవలసిన అవసరమున్నది. ఇది వాటి కర్తవ్యం కూడా. అలా కాకుండా కార్బన్ ఉద్గారాలు మితిమీరిపోతున్నాయని వర్థమాన దేశాలను తప్పుపడితే దాని వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదు. వాటికి అభివృద్ధే ముఖ్యమన్న వాస్తవాన్ని కాప్ 26 గుర్తించి తీరాలి. 


వాతావరణ మార్పుపై పోరులో పేదదేశాలను పూర్తిస్థాయిలో భాగస్వాములను చేయడం ఎలా సాధ్యం? వాటికి ఆర్థికవనరులు సమకూర్చాలి. ఇది పారదర్శకంగా, గణనీయమైన స్థాయిలో జరగాలి. అప్పుడు మాత్రమే సంపన్నదేశాల ఎజెండాను పేదదేశాలు విశ్వసిస్తాయి. ఆర్థికసహాయం మాటలకే పరిమితం కాకుండా పారదర్శకంగా ఆచరణలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పును ఎదుర్కోవడంలో ప్రకృతి ఆధారిత పరిష్కారాలకు ప్రాధాన్యమివ్వాలి. ప్రాకృతిక వ్యవస్థలు కార్బన్ ఉద్గారాలను అదుపుచేయడంలో విశేషంగా తోడ్పడుతాయి. పేదదేశాలలోని అడవులు మొదలైన సహజ సంపదల పరిరక్షణపై దృష్టిని కేంద్రీకరించాలి. అడవులు మొదలైనవి పేద ప్రజల జీవనాధారాలుగా ఉన్నాయన్న సత్యాన్ని విస్మరించకూడదు. మరి ఇందుకు అవసరమైన ఆర్థికసహాయాన్ని అందించేందుకు సంపన్నదేశాలు సిద్ధంగా ఉన్నాయా? ఈ ఆర్థిక అంశంపై సమగ్ర చర్చలు జరపాల్సిన అవసరాన్ని కాప్ 26 ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఆవశ్యక చర్చలు జరిగితేనే ఈ అంతర్జాతీయ వాతావరణ సదస్సు గతంలో జరిగిన వాటికంటే భిన్నంగా చరిత్రలో నిలిచిపోతుంది.


సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

Updated Date - 2021-10-29T06:23:18+05:30 IST