ఏడాది పొడుగునా దక్కిన కానుకలెన్నో

ABN , First Publish Date - 2021-12-25T05:59:03+05:30 IST

కొత్త సంవత్సరం ఆగమించనుంది. నిష్క్రమించనున్న సంవత్సరంలో దేశ సౌభాగ్య నిర్మాతలయిన రైతులకు లభించిందేమిటి? సొంతభూమిని కార్పొరేట్లకు ఇచ్చే స్వేచ్ఛ. కార్పొరేట్ల నుంచి అప్పులు తీసుకునే స్వేచ్ఛ....

ఏడాది పొడుగునా దక్కిన కానుకలెన్నో

కొత్త సంవత్సరం ఆగమించనుంది. నిష్క్రమించనున్న సంవత్సరంలో దేశ సౌభాగ్య నిర్మాతలయిన రైతులకు లభించిందేమిటి? సొంతభూమిని కార్పొరేట్లకు ఇచ్చే స్వేచ్ఛ. కార్పొరేట్ల నుంచి అప్పులు తీసుకునే స్వేచ్ఛ. పంట ఉత్పత్తులను ఎక్కడైనా కార్పొరేట్లకు విక్రయించుకునే స్వేచ్ఛ, భూమిలేని వ్యవసాయ కూలీలుగా మారేందుకు స్వేచ్ఛ. ఈ ఉదార కానుకలను రైతులు తిరస్కరించడం పూర్తిగా భిన్నమైన కథ.


నేడు క్రిస్మస్ పర్వదినం. శాంటాక్లాజ్ బహుమతులతో ఇంటింటినీ సందర్శిస్తాడని క్రైస్తవ సోదరులు విశ్వసించే శుభసమయమిది. ఆయన అనేకానేకమందికి ఆశాభంగం కలిగించడం ఖాయం. అయినప్పటికీ ఆ దివ్య తాతయ్య సంప్రదాయం మానవ జీవితాలలో నిలిచిపోయింది. బాలలను ఆనందడోలికలలో ముంచెత్తే శాంటాక్లాజ్ ఒక మధుర స్వప్నమూర్తి. 


స్వప్నవేడుకల నుంచి జీవిత వాస్తవాలలోకి వద్దాం. ఒక వ్యక్తి (ఇతనెవరో ఎవరికీ తెలియదు. నేనైతే, శాంటాక్లాజ్‌తో అతడు సరిపోలడని కచ్చితంగా చెప్పగలను), మరి కొద్దిరోజుల్లో నిష్రమించనున్న ఈ సంవత్సరం పొడుగునా భారత్ సందర్శిస్తూనే ఉన్నాడు. అతడొక అవాంఛనీయ మనిషి. మనం కోరని కానుకలెన్నో అతడు తీసుకువచ్చాడు.


కుటుంబాలకు ఏమి తీసుకొచ్చాడో చూడండి: చిల్లర ద్రవ్యోల్బణం 4.91 శాతం. ఇందులో ఇంధన ద్రవ్యోల్బణం 13.4 శాతం. ఈ ఆర్థిక భారాన్ని తొలగించుకోవడం ఎలా? కరువుభత్యం, ఇంటి అద్దె కూడా ఇచ్చే ఉద్యోగాన్ని చూసుకోమని శాంటా సూచిస్తున్నాడు. యజమానే విద్యుత్, నీటి బిల్లులు కూడా చెల్లిస్తే మరీ మంచిది కదా. 


రైతులకు లభించినవేమిటో చూడండి: సొంతభూమిని కార్పొరేట్లకు ఇచ్చే స్వేచ్ఛ. కార్పొరేట్ల నుంచి అప్పులు తీసుకునే స్వేచ్ఛ. పంట ఉత్పత్తులను ఎక్కడైనా కార్పొరేట్లకు విక్రయించుకునే స్వేచ్ఛ, భూమిలేని వ్యవసాయకూలీలుగా మారేందుకు స్వేచ్ఛ. ఈ ఉదార కానుకలను రైతులు తిరస్కరించడం పూర్తిగా భిన్నమైన కథ . 


ఉత్పత్తిదారులు, వినియోగదారుల విషయాన్ని చూద్దాం. టోకు ధరల ద్రవ్యోల్బణం 14.23 శాతం. అంటే ఇంచుమించు అన్ని సరుకులు, సేవల ధరలు పెరిగాయి. వాటిలో ఏ ఒక్కదాని ధర తగ్గినా మిమ్మలను మీరు అదృష్టవంతులుగా పరిగణించుకోవచ్చు. అయితే ఒక దాని ధర తగ్గితే మరో ఐదు సరుకులు లేదా సేవల ధరలు పెరుగుతాయి. కనుకనే 2021లో టోకుధరల ద్రవ్యోల్బణం గత పన్నెండు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత అధికంగా ఉంది. 


యువతీ యువకుల విషయమేమిటి? నిరుద్యోగిత రేటు 7.48 శాతం. ఇందులో పట్టణ ప్రాంత నిరుద్యోగిత రేటు 9.09శాతం. పోస్ట్ -గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్కాలర్ల విషయమేమిటి? కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లలో పదివేలకు పైగా టీచింగ్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. అదృష్టవశాత్తు అధ్యాపకులు లేకుండానే ఉన్నతవిద్యను బోధించే మార్గాన్ని కనుగొన్నారు! 


కొత్త రిజర్వేషన్ల కథాకమామీషు చూద్దాం. ఖాళీగా ఉన్న పదివేల టీచింగ్ పోస్ట్‌లలో 4,126ను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ‘రిజర్వ్’ చేశారు. రిజర్వేషన్ విధానం కొనసాగి తీరుతుంది. అయితే ఈ విధానంలో ఒక కీలక మార్పు జరిగింది. రిజర్వేషన్లు ఇంకెంత మాత్రం పోస్ట్‌లలో కాదు, ఖాళీలలో. ఆ ఖాళీలు ఎప్పటికి భర్తీ అవుతాయో పాలకులే చెప్పాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం మరిన్ని వేకెన్సీలను సృష్టిస్తుంది. వీటినీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వ్ చేస్తుంది!

 

ఇఎమ్ఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్– నెలవారీ వాయిదాలు) చెల్లింపుదారులకు లభించిన కానుక అధిక వడ్డీరేటు. 2020–21 ఆర్థికసంవత్సరంలో బ్యాంకులు రూ.2,02,783 కోట్ల వసూలుకాని రుణాలను రద్దుచేశాయి. బ్యాంకులు ఇంకా రుణాలు ఇస్తున్నాయి కనుక రుణాలు తీసుకున్న వారు వాటికి కృతజ్ఞతాబద్ధులై ఉంటారు. మరి పేదల విషయమేమిటి? మహాశయులారా, వరుసలో నుంచోండి. ఓపిగ్గా వేచి ఉండండి. అయితే, మీకు అసలు అవకాశం రాకపోవచ్చు సుమా. ఎందుకని? ప్రభుత్వరంగ బ్యాంకులు పేద కార్పొరేట్ సంస్థలకు సహాయం చేయడంలో తలమునకలై ఉన్నాయి.


2020–21 ఆర్థిక సంవత్సరంలో కేవలం 13 కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 4,86,800 కోట్లు అప్పుపడ్డాయి. ఇందులో రూ.1,61,820 కోట్లను బ్యాంకులు ఏదో ఒకవిధంగా రాబట్టుకోగలిగాయి. మరి మిగతా రూ.2,84,980 కోట్ల విషయమేమిటి? ఆ నష్టాన్ని భరించడం ద్వారా భారత ప్రజల సంక్షేమానికి అంటే 13 కార్పొరేట్ కంపెనీల సంక్షేమానికి తమ వంతు తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు సుముఖంగా ఉన్నాయి. మరింత సహాయాన్ని అందించేందుకూ– మీరు గనుక తీసుకున్న భారీ రుణాన్ని ఎగవేసినవారయితే-– ఆ బ్యాంకులు సంసిద్ధంగా ఉన్నాయి మరి. 


ఆర్థికవేత్తలు, అర్థశాస్త్ర విద్యార్థుల విషయాన్ని చూద్దాం. కొవిడ్‌తో కూలబడిన ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ ఆంగ్లభాషా అక్షరం ‘V’ ఆకారంలో ఉందని అంటున్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్న వాదన. ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అర్థశాస్త్ర పాండిత్య ప్రతిభ ఆలంబనతో ప్రభుత్వం ఆర్థికవ్యవస్థ ఘనంగా కోలుకుంటోందని ఘంటాపథంగా చెబుతోంది. ఇండియన్ స్కూల్ ఆఫ్‌ బిజినెస్ నుంచి భారతప్రభుత్వ సేవకు తరలివచ్చిన సుబ్రమణియన్ తిరిగి అదే సంస్థకు వెళ్ళిపోనున్నారు.


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ ఇటీవల న్యూఢిల్లీలో భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ‘K’ ఆకారంలో ఉందని వెల్లడించారు. కంగారు పడకండి. ఆంగ్ల అక్షరమాలలో ఇంకా 24 అక్షరాలు ఉన్నాయి. గత అనుభవాల ప్రాతిపదికన సదా పరిపూర్ణ ఆశావాదంతో ఉండేవారు ఆ ఆర్థిక పునరుద్ధరణ ‘I’ రూపంలో ఉండవచ్చని జోస్యం చెప్పే అవకాశం ఉంది. నిరాశావాదులు ‘O’ వైపు మొగ్గు చూపవచ్చు. అర్థశాస్త్ర మేధావులు ‘M’కు అనుకూలంగా వాదించవచ్చు. 


ప్రపంచ పత్రికాస్వేచ్ఛ సూచీలో మన దేశం 180 దేశాలలో 142వ స్థానంలో ఉంది. గత ఏడాది ఇదే సూచీలో మన స్థానం 140. ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ అనే సంస్థ రూపొందించే ఈ సూచీ విశ్వసనీయమైనది కాదని సమాచార, ప్రసార శాఖ మంత్రివర్యులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు పత్రికాస్వేచ్ఛకు సరైన నిర్వచనం కొరవడిందని కూడా వాపోయారు. పత్రికాస్వేచ్ఛను నిర్వచించేందుకు ఈ కింద పేర్కొన్న పాత్రికేయులను ఆహ్వానించాలని శాంటా సూచిస్తున్నాడు. ఆయన సూచించిన పాత్రికేయులు: రాజ్‌దీప్ సర్దేశాయి, బర్ఖాదత్, కరణ్ థాపర్, సాగరికా ఘోష్, పరంజోయ్ గుహ థాకుర్తా, రాఘవ్ బహల్, బాబీ ఘోష్, పుణ్య ప్రసూన్ వాజపేయి, కృష్ణప్రసాద్, రూబిన్, ప్రణయ్ రాయ్, సుధీర్ అగర్వాల్.


ఇక అన్నివర్గాల ప్రజలకు ఉమ్మడిగా లభించినవేమిటో చూద్దాం. పోషకాహార లోపం, శిశు మరణాలను తప్పక కొనసాగింప చేసే విధానాలు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాలలో మనదేశం 101వ స్థానంలో ఉంది. కాన్పుల రేటు 2.0 శాతానికి పడిపోయింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు!


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)


Updated Date - 2021-12-25T05:59:03+05:30 IST