ప్రచారం ఉచ్చులో దాతృత్వం

ABN , First Publish Date - 2021-12-31T07:43:09+05:30 IST

అగ్ర రాజ్యాలకి, అభివృద్ధి చెందే దేశాలకే కాదు ఎక్కడ ఉన్నా ప్రతి మనిషికీ, జీవికీ పిడికెడంత దాతృత్వం, దానగుణం ఉండగలగాలి. ప్రభుత్వాలు, ముఖ్యంగా ఏకకేంద్ర అధికార పీఠాలు, చేయాల్సిన సంక్షేమ దాతృత్వ కార్యకలాపాలను ఏకంగా ప్రచారానికి...

ప్రచారం ఉచ్చులో దాతృత్వం

అగ్ర రాజ్యాలకి, అభివృద్ధి చెందే దేశాలకే కాదు ఎక్కడ ఉన్నా ప్రతి మనిషికీ, జీవికీ పిడికెడంత దాతృత్వం, దానగుణం ఉండగలగాలి. ప్రభుత్వాలు, ముఖ్యంగా ఏకకేంద్ర అధికార పీఠాలు, చేయాల్సిన సంక్షేమ దాతృత్వ కార్యకలాపాలను ఏకంగా ప్రచారానికి అనువైన డంభాలుగా మార్చేశాయి. హక్కు భుక్తంగా వచ్చే సహకారాన్ని దానంగా చూపెడుతున్నాయి. ప్రజలు చెల్లించగా వచ్చిన ఆదాయంతో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఆర్భాటాలుగా మారిపోతున్నవి. లబ్ధిదారులను అడుక్కునే వారిగా, బిచ్చగాళ్లుగా మార్చే సన్నివేశం ఇది. ఈ నమూనాని కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు పాటిస్తున్నాయి/రు. దీనివల్ల సమాజంలో ఒక విధమైన అపసవ్యత ఏర్పడుతుంది. నిజానికి దాత ఎవరు, స్వీకర్త ఎవరు అనే విచిక్సతకి ఆస్కారం ఏర్పడుతున్నది. స్వీకర్తకి తీసుకునే అర్హత ఏమిటి అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తున్నది.


ముఖ్యంగా భారతదేశంలో గమనిస్తే సహకారం ఎక్కువగా పురుష ప్రధానంగా అందుతుంటుంది. కళ్ల ముందున్న వ్యక్తులకు, సమూహాలకే ఎక్కువగా సహాయం చేరుతుంటుంది. దీన్ని స్త్రీ కోణంలోకి మార్చాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందన్నది గమనించాలి. పేదలకు సాయం అందించేప్పుడు స్త్రీలు రెండు గోడలకు ఆవల కూడా కనపడరు. సహాయం నమూనా చట్రంలో స్త్రీలే కాదు, దివ్యాంగులు ముఖ్యంగా పిల్లలు ఉండరు. మన పథకాల రూపకల్పనలో సాధారణీకరణ లక్షణం పాతుకుపోయింది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, ఆయా సమూహాల అవసరాలు, దీర్ఘకాలిక మన్నిక గణన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ సహకారానికి ఒక అర్థం చేకూరుతుంది. తాత్కాలిక సాయం కొంతకాలం దాకా పనికివస్తుంది. కాని చేసే సహకారం, అందించే వస్తువు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగి ఉంటే చేసిన సహాయానికి పరమార్థం ఉంటుంది. బజారులో సులభంగా లభించే వస్తువులు కొని ఇవ్వడం, ఆ తరువాత ఏమిచ్చామన్నది కూడా మర్చిపోవడం రివాజు అయ్యింది. పైగా ఇచ్చే వస్తువు ఎదుటివారికి ఎంత ఉపయోగం అన్నది కూడా ఒక ప్రముఖమైన అంశం. ప్రతి సహాయక చర్య స్వీకర్తల అవసరాన్ని తీర్చాలి. వారికి ఏది, ఏ రూపంలో ఉపయోగకారిగా ఉంటుందో ముందస్తుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటినే అందించడం సరైన పద్ధతి. ఈ కోణంలో దాతలు – వ్యక్తులవనీండి, సంస్థలవనీండి, ప్రభుత్వాలవనీండి – ఆలోచించాలి, చర్చించాలి. అదేమీ లేకుండా తోచింది ఇచ్చి, ఇచ్చామనుకోవడం సరికాదు. దానివల్ల మనల్ని మనం భుజం తట్టుకుని సంతృప్తి పడడం తప్పితే తీసుకునేవారినికి పెద్దగా ఏమీ సాయం అందదు. 


ఎవరికైనా ఒక చెక్కు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫొటోల కోసం మీటరున్నర చెక్కుని తయారు చేయించి ఇస్తారు. అప్పుడప్పుడు చేసే ఆ సహాయం, చెక్కు పెద్ద ప్రతి కోసం పెట్టే ఖర్చూ ఇతమిత్థంగా సమానంగా ఉండే అవకాశమూ ఉంటుంది. కొండొకచో ఒక్కోసారి దానికొక జిగేల్మనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం కద్దు. అంటే తీసుకునే స్వీకర్తకి మన సహాయం అందించడం వలన లభించే సంతృప్తి ఏమిటన్నది మరుగునపడి, మనకి మాత్రం ఒక జీవితకాలపు తృప్తి మిగుల్చుకోవాలని చూస్తారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు, కొంతమంది నాయకులు కూడా ఇలాంటి పనులు చేయడం గమనించాలి. మానవీయత లోపించే విధానాలు హెచ్చయి అసలు లక్ష్యం వెనకబడి దెబ్బతింటున్నది. దయాగుణం ప్రదర్శనా స్థాయికి చేరి అపహాస్యం పాలవుతున్నది. ఒక చేతితో చేసిన సహాయం మరో చేతికి తెలియకూడదన్నది నానుడి. మొన్నమొన్నటిదాకా పాటించబడిన మంచిగుణం. చాలా మంది రూపాయి దానం చేసి వేయి రూపాయల ప్రచారం పొందుతున్నారు. సెల్‌ఫోన్లు వచ్చాక ఇది మరీ పరాకాష్టకి చేరుకుంది. 


దానం చేసేవారు స్వీకరించినవారి కన్నా అధికులు అనే భావన వచ్చిందంటనే ఆ దానానికి విలువ ఉండదు. ఇప్పుడు ఆదివాసీలపై కొందరు పెద్దలు, కొన్ని ఎన్జీఓలు, రాజకీయ నాయకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో హోదాలలో ఉన్న వ్యక్తులు, సంస్థలు చేసే దాతృత్వ కార్యక్రమాలు బేనర్లు, ఖర్చులు, అట్టహాసాలు లేకుండా జరగడం లేదు. తమ తమ కార్యాలయాల నివేదికలలో ప్రస్తావించిందే ప్రస్తావించడమూ గమనించవచ్చును. గ్రామాల దత్తత కూడా ఈ కోవ లోనిదే. చెట్లు నాటే కార్యక్రమాలు నాటుతున్నప్పటి ఫొటోల కోసం తప్ప, ఆ తదుపరి జరగాల్సినదేమిటో ఆలోచించే తీరిక ఎవరికీ ఉండదు. 


ప్రస్తుతం ఈ దేశంలో దాతృత్వానికి కులం, వర్గం అంటిపెట్టుకుని ఉంటున్నాయి. పైకి కనపడని ఈ విధానంలో తమ వారికి కోట్లాది రూపాయలు అందిస్తారు. విషయం బయటికి రాదు. తమ ఆశ్రితులకి, కులం వారికి భూములని, పదవులని, ఉద్యోగాలను మంజూరు చేస్తారు. అవీ పైకి చెప్పబడవు. కేవలం పేదలకు చేసిన అతిచిన్న సహాయాలను మాత్రం పెద్దగా ప్రచారం చేసి చూపుతారు. ఇలాంటి స్వభావం అదోరకం మానసిక రుగ్మతగా మారుతున్న దాఖలాలు విచారకరమైనవి. వీటిని దయాగుణం అనలేం. దాతృత్వం కూడా అనలేము. 


ఉదాహరణకు ఆదివాసీలకు కొందరు సహాయం అందించాలని అనుకుంటారు. కాని అందరు ఆదివాసీలు ఒకటికాదు అన్న అవగాహన, ఆలోచన ఉండకనే పని చేద్దామనుకుంటారు. వారిలో ఎవరు పేదలు, ఎవరికి ఎక్కువ సహాయం అవసరం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఈ ఆలోచన దరిదాపుల్లో కనిపించదు. కోయ, గోండి, బంజార వంటి ఆదివాసీ తెగల వారికి, ఉపతెగలు ఉన్నాయని, వారు పేదరికాల్లో మగ్గిపోతున్నారని తెలియని సంస్థలతో, మనుషులతో మన సమాజం నిండిపోయింది. గోండీ ఆదివాసులకి ప్రధాన్‌లు, తోటీలు, దీఝాలు ఉపతెగలు. వీరి ఆవాసాలు చాలా వెనకబడి ఉన్నాయి. గోండు ప్రజలు వీరిని ఆదరించి వారికి కొంత బతుకు తెరువు చూపిస్తారు. కాని చాలా సంస్థలకు ఈ విధానం ఒకటి ఉందని తెలియదు. వీళ్ల వరకు చాలా సంస్థలు వెళ్లవు. వ్యక్తులయితే ఆ ఛాయలకే వెళ్లరు.


సేవా కార్యక్రమాలను, దాతృత్వ కార్యక్రమాలను సంక్షేమ పథకాల పరిధి పరిమితుల అవగాహన కోసం, పరిశీలన కోసం అవిభక్త ఆదిలాబాదు జిల్లా ప్రాంతాలకి వెళ్తున్నాం. ఈసారి ఉపతెగలకి చెందిన మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా సామగ్రి తీసుకుపోతున్నాం. వారితో చర్చించి వాస్తవ అవసరాలు సమాజం దృష్టికి తేవాలని అనుకుంటున్నాం. ఉట్నూరు మండలం, పెందూర్‌ గూడలో డిసెంబరు 31వ తారీఖున జరిగే గోండ్వాన్‌ పంచాయత్‌రామ్‌ సెంటర్‌, ఆదిలాబాదు వారు ఏర్పాటు చేసే సభలో మా భావాలను వారి ముందు ఉంచుతాం. ఈ కార్యక్రమంతో కలిసి వచ్చేవారికి ఇదే ఆహ్వానం.

ప్రొ. గూడూరు మనోజ

గోండీ తెగ సంస్కృతీ అధ్యయన వేదిక, హైదరాబాద్

Updated Date - 2021-12-31T07:43:09+05:30 IST