పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు

ABN , First Publish Date - 2021-11-16T06:26:33+05:30 IST

భారత రాజ్యాంగం స్వతంత్ర భారత నిర్మాణంలో భాగంగా ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రసాదించిన పౌరహక్కులలో భావప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చింది. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని పారదోలడానికి నాటి నేతలు ప్రతికలను ఆయుధంగా...

పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు

భారత రాజ్యాంగం స్వతంత్ర భారత నిర్మాణంలో భాగంగా ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రసాదించిన పౌరహక్కులలో భావప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చింది. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని పారదోలడానికి నాటి నేతలు ప్రతికలను ఆయుధంగా స్వీకరించి స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరులందించారు. స్వాతంత్ర్య సాధన లక్ష్యంగా నాటి ప్రతికారంగం బ్రిటిష్‌ ప్రభుత్వ తీవ్ర అణచివేతలు, నిర్బంధాలు, ఆంక్షలు, చట్టపరమైన నిషేధాలు ఎదుర్కొంటూనే స్వతంత్రమైన, నీతివంతమైన భారత జనావళి భవితవ్యానికి అంకితమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నవభారత నిర్మాణంలో పాలుపంచుకున్న నేతలు పత్రికారంగ ప్రాధాన్యాన్ని గుర్తించి, పత్రికల స్థితిగతులు, స్వేచ్ఛ, ప్రవర్తనా నియమావళి, కనీస వేతనాలు పెంపొందింపచేయడానికి కేంద్ర, రాష్ట్ర పరంగా సత్కృషి కొనసాగించారు. ఫోర్త్‌ ఎస్టేట్‌గా గుర్తింపు పొందిన భారత పత్రికారంగం ఏడు దశాబ్దాల పైబడి ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో సామాజిక దుర్నీతిని, దురాచారాలను అవినీతిని ప్రతిఘటిస్తూ ప్రవాహానికి ఎదురీదుతోంది. దేశభక్తి, ప్రజాసేవా ధర్మం వంటి లక్ష్యాలు మారుతున్న కాలానుగుణంగా కనుమరుగై, అన్నిరంగాలతో పాటు పత్రికారంగం కూడా పెట్టుబడి, లాభనష్టాలు బేరీజు వేసుకోవలసిన వ్యాపారరంగంగా పరిణామం చెందక తప్పలేదు.


మహోన్నతం శక్తివంతం అయిన ప్రెస్‌ను మహాత్ముడు అదుపులేని వరద ప్రవాహంతో పోల్చారు. ఊళ్లు, పంటలు సర్వస్వం ముంచి వినాశనం సృష్టించే వరదప్రవాహంలా నియంత్రణ లేని కలం కూడా విధ్వంసం సృష్టిస్తుందన్నారు. అలా అని బయటివారు దాన్ని అదుపుచేయటం మరింత విషభరితం అవుతుందని, అంతకంటే అసలు నియంత్రణ లేకపోవడమే నయం అన్నారు. ప్రస్తుతం మన దేశంలో మీడియా క్రమబద్ధీకరణ సమస్యగా పరిణమించింది. స్వాతంత్ర్యానంతరం 1950 అక్టోబరులో ‘ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌’ తదితర జర్నలిస్ట్‌ సంఘాల డిమాండ్‌ ప్రకారం ఏర్పాటైన కమిషన్‌ 1952 అక్టోబరు నాటికి చట్టపరంగా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాగా అవతరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్మన్‌గా వ్యవహరించే ప్రెస్‌ కౌన్సిల్‌ దేశంలో పత్రికా స్వేచ్ఛ, పత్రికల బాధ్యతా ప్రమాణాల పెంపుదల లక్ష్యంగా ఎడిటర్లు, సీనియర్‌ జర్నలిస్ట్‌లు, మీడియా మేనేజర్లు, న్యూస్‌ ఏజన్సీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, యుజిసి, సాహిత్య అకాడమీ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ప్రాతినిధ్యం కలిగి ఉంది. ‘ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’తో పాటు న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఎ) సృష్టించిన న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ, బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లైంట్స్‌ కౌన్సిల్‌, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌... ఇలా నాలుగు సంస్థలు మీడియా క్రమబద్ధీకరణ కోసం పనిచేస్తున్నాయి.


2012లో పిసిఐ చైర్మన్‌గా, జస్టిస్‌ మార్కండేయ కట్జూ, ప్రింట్‌ ఎలక్ర్టానిక్‌ మీడియాలను కలిపి ఒకే గొడుగు కిందకు తేవాలని అందుకు అనువుగా ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టాన్ని మార్చాలని సూచించారు. పత్రికలతో పాటు డిజిటల్‌ మాధ్యమ ప్రసారాలలో భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే ప్రభుత్వాల ఉత్తర్వులపై, చర్యలపై సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు న్యాయ సంబంధిత కొరడా ఝుళిపిస్తూనే ఉంది. 2012లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన సూచిలో 131వ స్థానంలో ఉన్న మనదేశం ఇప్పుడు140వ స్థానానికి చేరి ఇంకా దిగజారిపోతోంది. నేడు వార్తలు, వర్తమాన అంశాలు, ప్రభుత్వాధిపత్యంపై ప్రతికూలంగా స్పందించే మీడియా రాజ్యాంగంలోని వాక్‌ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ హక్కులను రక్షించుకునే న్యాయపోరాటాలతో సతమతమవుతోంది. స్వతంత్రంగా, నిర్భయంగా, బాధ్యతాయుతంగా, ప్రగతిశీలకంగా మీడియా వ్యవహరించడం కేంద్రంలోనైనా, రాష్ర్టాల్లోనైనా, అవినీతి కార్యాచరణకు పాల్పడే ప్రభుత్వాధినేతలకు ఏమాత్రం రుచించడం లేదు. ఓట్ల రూపంలో పొందే ప్రజాదరణను కోల్పోయే ప్రమాదం మీడియా వల్ల పొంచి ఉందనే భయం వారిని వెంటాడుతోంది. అందువల్ల మీడియా గొంతు నొక్కే విధంగా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ఉత్తర్వులు, ఆంక్షలు విధించడం వాటికి పరిపాటి అయిపోయింది. ప్రభుత్వ ఆంక్షలకు భయపడి తలొగ్గే మీడియావర్గం కూడా ఒకటి రూపొందింది. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారుతుంది. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ప్రజా ఆంక్షలకు దర్పణం పట్టి తనకు మార్గదర్శిగా నిలిచే మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు పరిరక్షించడమే వాటికి, ప్రజానీకానికి శ్రేయోదాయకమవుతుంది.

జయసూర్య

సీనియర్‌ జర్నలిస్‌్ట (నేడు జాతీయ పత్రికాదినోత్సవం)

Updated Date - 2021-11-16T06:26:33+05:30 IST