ఉపాధి వేతనాల్లో కులం లెక్కలు!

ABN , First Publish Date - 2021-07-06T06:37:47+05:30 IST

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి....

ఉపాధి వేతనాల్లో కులం లెక్కలు!

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలు తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులలో, అలాగే లేబర్ బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పులు చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది మార్చి 2న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఈ సర్క్యులర్‌లో సూచించిన మార్పులు, ఆ మార్పులు తీసుకొచ్చిన విధానంపై దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 


కేంద్రప్రభుత్వ సర్క్యులర్‌లో సూచించిన మార్పుల సంగతి అర్థం కావాలంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కార్మికుల వేతనాల చెల్లింపునకు సంబంధించి, మండల కేంద్రం స్థాయిలో జరిగే తంతు గురించి కొంత తెలుసుకోవాలి. కార్మికులు తమ వాటా పని పూర్తి చేసుకున్న తర్వాత వారి హాజరును ధ్రువపరచే మస్టర్లు, పని కొలతల వివరాలు మండల ఉపాధి హామీ కార్యాలయానికి చేరుకుంటాయి. అక్కడ కావాల్సిన తతంగం పూర్తి ఐన తర్వాత కార్మికులకు వేతనాలు చెల్లించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఫండ్ ట్రాన్సఫర్ ఆర్డర్ (నిధుల బదిలీ ఉత్తర్వులు, ఎఫ్‌టిఓ) జారీ చేస్తారు. పని జరిగిన సాధారణ క్రమంలో ఎఫ్‌టిఓల జారీ జరుగుతుంది. కేంద్రం ఎఫ్‌టిఓలను పాస్ చేసిన తర్వాత వేతనాలు కార్మికుల అకౌంట్‌లో జమ అవుతాయి. 


ఇప్పటి వరకు, కార్మికుల కులం ఆధారంగా ఎఫ్‌టిఓల జారీ జరగలేదు. అయితే గత ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పద్ధతి ప్రకారం మండల స్థాయిలో ఫండ్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల ఎఫ్‌టిఓలుగా విభజిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం గ్రామీణ ఉపాధి హామీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఆమోదం కోసం పంపుతాయి. వాటిని లేబర్ బడ్జెట్ ప్రతిపాదనలు అని అంటారు. ఇకపై లేబర్ బడ్జెట్ ప్రతిపాదనలు పంపేటప్పుడు ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాలుగా ప్రత్యేకంగా విభజించి పంపాలని కేంద్రం, సర్క్యులర్‌లో పేర్కొంది. అంటే ఇక నుంచి ఉపాధి హామీ పథకంలో వివిధ సామాజిక వర్గాల ఆధారంగా (ఎస్సీ, ఎస్టీ, ఇతరులు) ‘ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు’ కార్మిక బడ్జెట్‌లు ఉంటాయి. 


దేశంలో ప్రజా సంఘాలు, వామపక్షాలు సాగించిన ఉద్యమాల ఫలితంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఆవిర్భావం నుంచి కూడా పథకం అమలులో ప్రజా సంఘాలు చాలా చురుకైన పాత్ర పోషించాయి. అలాగే ఉపాధి హామీ పథకానికి నిధులు సమకూర్చేది కేంద్రం అయినా, దానిని అమలు చేసేది రాష్ట్రాలు. అలాంటిది రాష్ట్రాలతో కానీ, ప్రజా సంఘాలతో కానీ చర్చించకుండా, గోప్యంగా, హడావుడిగా మార్పులు తీసుకువచ్చారు. అలాగే ఈ ప్రతిపాదనల లక్ష్యం, తీసుకురావడం వెనుక హేతువు గురించి ఎక్కడా వివరించలేదు, ఈ సర్క్యులర్‌ను వెబ్‌సైట్‌లో పెట్టడం కూడా ఇప్పటి వరకూ జరగలేదు. ఉపాధి హామీ పథకాన్ని పర్యవేక్షించే ఒక ఉన్నత అధికారి మే నెలలో బయటపెట్టే వరకూ ఈ సర్క్యులర్ గురించి కార్మికులకు, ప్రజా సంఘాలకు తెలియలేదు. 


కేంద్రం తీసుకువచ్చిన మార్పులపై ప్రజా సంఘాలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో కొన్ని (వెనుకబడిన) జిల్లాలకు మాత్రమే పరిమితం చేద్దామని బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ సొంత పార్టీతో సహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుండి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆ ప్రతిపాదనలు వెనక్కి తీసుకుంది. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన మార్పులతో మరల అలాంటి ప్రయత్నం చేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే కరోనా విపత్తు సమయంలోనూ, ప్రతి సంవత్సరం కరువు సంభవించినప్పుడు, ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇతర ఉపాధి అవకాశాలు లేని వేసవి కాలంలో పని కల్పించి ఆదుకుంటున్న ఉపాధి హామీ పథకం అందరికీ అందుబాటులో లేకుండా పోతుంది. ఇది ఎస్సీ, ఎస్టీ కార్మికులకు మాత్రమే కాక అన్ని కులాల గ్రామీణ పేదలకు శరాఘాతంగా పరిణమిస్తుంది. 


ఇకపై ఈ వర్గాలకు ప్రత్యేక ఎఫ్‌‌టిఓలను జారీ చేయడం ద్వారా ఆ మేరకు సబ్ ప్లాన్ నిధులలో కోత విధించే అవకాశం ఉందన్న భయం ఉంది. ఇప్పటికే సబ్ ప్లాన్ నిధులు, చట్ట స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు తమకు నచ్చిన పథకాల రూపంలో ఖర్చు చేస్తున్నాయి. 


కొత్త ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బహిరంగంగా స్పందించలేదు. కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎన్‌ఎన్ సిన్హా మాత్రం ఒక వార్తా పత్రికతో మాట్లాడుతూ కేంద్రం కొత్తగా తెచ్చిన మార్పులపై భయాందోళనలు అనవసరమని, ఎస్సీ/ఎస్టీ కార్మికుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసుకోవడానికే తప్ప ఈ మార్పుల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని సెలవిచ్చారు. 


ఐతే మితిమీరిన సాంకేతిక పరిజ్ఞానం వాడకం వలన ఇప్పటికే ఉపాధి హామీ వేతనాల చెల్లింపు ప్రక్రియ చాలా సంక్లిష్టంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 860 కోట్ల రూపాయల వేతనాలు, వేతన చెల్లింపులలో సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయాయి. 


నిజానికి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతన చెల్లింపు పద్ధతులు సవరించబడిన ప్రతి సారీ కార్మికులకు అపారమైన నష్టం కలిగింది. వ్యవస్థ మారినప్పుడు ఉత్పన్నమైన సమస్యలు నెలలు లేదా సంవత్సరాలు పరిష్కారానికి నోచుకోకుండా ఉంటాయి. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 2017 డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్ మెంట్ సిస్టం వలన ఏర్పడిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 4 సంవత్సరాలు గడచినా రెండు తెలుగు రాష్ట్రాలలో కార్మికులకు సుమారు 70 కోట్ల పై చిలుకు రూపాయలు కార్మికులకు ఇప్పటికీ అందలేదు. వాటిపై కార్మికులు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. 


అలాగే కొన్నాళ్లుగా జాతీయస్థాయిలో ఉపాధి హామీ పథకంలో ఎస్సీ కార్మికుల భాగస్వామ్యం క్రమంగా తగ్గుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎస్సీ/ఎస్టీ కార్మికుల సంక్షేమం గురించి ప్రభుత్వం నిజంగా ఆందోళన చెందుతుంటే, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. వేతనాలు తక్కువగా పడడం, సమయానికి వేతనాలు చెల్లించకపోవడం, సాంకేతిక సమస్యల వలన వేతనాలు ఆగిపోవడం కార్మికులు ఉపాధి హామీ పని పట్ల ఆసక్తి చూపించకపోవడానికి ప్రధాన కారణాలని మా పరిశీలనలో తేలింది.


ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కేంద్రం, ఉపాధి హామీ వేతనాల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తుంది. ఉదాహరణకు జార్ఖండ్ రాష్ట్రంలో 2021–22లో ఉపాధి హామీ కార్మికులకు వేతనాల విడుదలకు సగటున 26 రోజులు తీసుకుంటున్నట్లు మా పరిశీలనలో తేలింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఐతే ఆ సమయం 26 రోజులకంటే ఎక్కువని మా ప్రాథమిక అంచనా. అంటే అర్థం కరోనా మహమ్మారి రెండవ తరంగం వలన గ్రామీణ భారతదేశం కునారిల్లుతున్న సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వేతనాలను విడుదల చేయడం లేదు, సరికదా చట్టం నిర్దేశించినట్లు ఆలస్యపు పరిహారం కూడా చెల్లించడం లేదు. 2020–21లో దేశ వ్యాప్తంగా వేతనాల చెల్లింపుల్లో జరిగిన జాప్యం వలన 28 లక్షల రూపాయల ఆలస్యపు పరిహారం కార్మికులకు అందితే అందులో తాము చేసిన ఆలస్యానికి కేంద్రం ప్రభుత్వం చెల్లించింది ‘సున్నా’. మున్నెప్పుడూ లేనట్లుగా ఈ సంవత్సరం జూన్ నెలలో ఉపాధి హామీ వేతనాల బకాయిలు తెలుగు రాష్ట్రాల్లో రూ.2000 కోట్లు దాటిపోయాయి. 


ఆలస్యపు పరిహారం చెల్లించకపోవడం స్వరాజ్ అభియాన్ వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2018 మే 18 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు కూడా వ్యతిరేకం. ఈ పరిస్థితులలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలు వెంటనే వెనక్కు తీసుకోవాలి. విపత్తు సమయంలో హేతుబద్ధత లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రయోగాలు చేయడం మానుకోవాలి. ఈ నేపథ్యంలో పని చేసిన 15 రోజుల లోపు వేతనాలు జమ చేయడం, లేని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించడం జరగాలి. వేతనాలను కనీస వేతనాల చట్టం నిర్దేశించిన స్థాయికి పెంచడం చేయాలి. కరోనా విపత్తు కారణంగా ఉపాధి హామీ పని దినాలను 150 రోజులకు పెంచాలి.


పనిని కోరుతున్న ప్రజలందరికీ ఉపాధి హామీ పథకం సార్వత్రికంగా అందుబాటులో ఉండాలి, సాంకేతిక వ్యవస్థలను మరింత క్లిష్టతరం చేయకుండా చట్టంలో పేర్కొన్న కాలపరిమితిలో చెల్లింపులు అన్నీ కార్మికులకు జమ చేయాలి. ఈ దేశ ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టడానికి ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాలి, కరోనా విపత్తు సమయంలో వాటి అవసరం మరింతగా ఉంది. లేదంటే ‘గ్రామీణ ఉపాధి హామీ పధకం అంటే గుంతలు తవ్వడం, తవ్విన వాటిని పూడ్చడం’ అని 2014లో పార్లమెంట్ సాక్షిగా ఉపాధి హామీ పథకాన్ని ఎద్దేవా చేసిన ప్రధానమంత్రి ఇంకా అదే అభిప్రాయంతో ఉన్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. 

చక్రధర్ బుద్ధ

కురువ వెంకటేశ్వర్లు

Updated Date - 2021-07-06T06:37:47+05:30 IST