చైనాకు ‘క్వాడ్’ చెక్ పెట్టగలదా?

ABN , First Publish Date - 2021-10-07T06:28:00+05:30 IST

చైనా విస్తరణవాదం నేపథ్యంలో ఏర్పడిన కూటమి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్). చైనా ఆర్థికంగా బలోపేతమై, ఇతర దేశాల భూభాగంలోకి విస్తరణ కాంక్షతో దురాక్రమణలు చేస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని...

చైనాకు ‘క్వాడ్’ చెక్ పెట్టగలదా?

చైనా విస్తరణవాదం నేపథ్యంలో ఏర్పడిన కూటమి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్). చైనా ఆర్థికంగా బలోపేతమై, ఇతర దేశాల భూభాగంలోకి విస్తరణ కాంక్షతో దురాక్రమణలు చేస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, పలు దేశాలలో శాంతియుత పాలనను చిన్నాభిన్నం చేస్తున్నది. హిందూ–పసిఫిక్ మహాసముద్రాలలో చైనా ఆధిపత్య కాంక్షను, దురాక్రమణను నియత్రించటానికి ఏర్పడిన కూటమే క్వాడ్. అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. క్వాడ్ కూటమి చైనా అనుసరిస్తున్న దౌత్య, సైనిక విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. పెచ్చు మీరుతున్న చైనా వ్యవహారానికి ముకుతాడు వేయడమే ఈ కూటమి ప్రధాన ఎజెండా. ఇందులో భాగంగా ఇటీవల మలబార్ తీరంలో జరిగిన ఉమ్మడి సైనిక విన్యాసాలతో క్వాడ్ సభ్యదేశాలు చైనా నియంత పోకడలను మూకుమ్మడిగా ఎదుర్కొంటామని సంకేతం ఇచ్చాయి. సెప్టెంబర్ 22–25 వరకు వాషింగ్టన్ వేదికగా జరిగిన క్వాడ్ కూటమి సమావేశంలో అఫ్ఘానిస్థాన్‌పై తాలిబన్ ఆక్రమణతోపాటు, ఉగ్రవాదం, సైబర్ నేరాలు, సముద్రహక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ భద్రత మొదలైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.


ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (సుమారుగా 1.4 బిలియన్ల జనాభా). అక్టోబర్ 1, 1949న స్వాతంత్ర్యం పొందిన జన చైనా అత్యంత వేగంగా శాస్త్ర సాంకేతిక విద్య వైద్య రంగాలలో దూసుకుపోయింది. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గల దేశంగా ఎదగడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అమెరికా వంటి అగ్రరాజ్యాలకు కూడా సవాలు విసురుతోంది. తనతో భూభాగాన్నీ, సముద్రాన్నీ సరిహద్దు పంచుకున్న దేశాలన్నింటికీ కొరకరాని కొయ్యగా తయారైంది. పాకిస్థాన్ వంటి దేశాలతో వర్తక, వాణిజ్య, దౌత్య సంబంధాల ద్వారా మిత్రత్వాన్ని నెరుపుతోంది. ఇటీవలి కాలంలో చైనా వ్యూహాత్మకంగా జపాన్‌లోని మిలిటరీ బేస్ క్యాంప్ సమీపంలో భూమిని కొనుగోలు చేసింది. ఇది జపాన్‌ సముద్రమార్గానికి ప్రమాదకరం. దీనికి తోడు పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, టిబెట్ లాంటి దేశాలలో చైనా నౌకాశ్రయాలను, విమానాశ్రయాలను నిర్మిస్తూ భారత్‍ను చుట్టూ దిగ్బంధం చేయడానికి ప్రయత్నిస్తోంది. 


చైనా–భారత దేశాల మధ్య సరిహద్దు వివాదాలు స్వాతంత్ర్యకాలం నుంచి నేటికీ కొనసాగుతున్నాయి. చైనా నిరంకుశ రాజవంశాల నుంచి సివిల్‌ వార్‌‍తో స్వాతంత్య్రం పొందిన తరువాత, అధ్యక్షుడు చౌ ఎన్ లై పాలనలో అభివృద్ధి ప్రస్థానం వైపు నడిచింది. 1954లో అధ్యక్షుడు చౌ ఎన్ లై, భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మధ్య పంచశీల ఒప్పందం కుదిరింది. హిందూ–చీనీ భాయి భాయి అంటూ ఇరుదేశాలూ కొన్నాళ్లు స్నేహపూర్వకంగా మెలిగాయి. కానీ తదనంతర కాలంలోనే చైనా భారత భూభాగాల దురాక్రమణకు పాల్పడింది. 1965లో భారత్–చైనా యుద్ధం జరిగింది. ఫలితంగా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు తెగిపోయాయి. ఆసియాలోనే పెద్ద దేశాలైన భారత్‌–చైనా సరిహద్దు వివాదాలు నేటికీ ఎడతెగక సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో రెండు దేశాల సరిహద్దు వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2020 జూన్ 15న చైనాతో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో సుమారుగా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. మరోవైపు భారత్‌తో సరిహద్దు వివాదం ఉండడమే కాక ఉగ్రమూకలతో మనదేశంలో చొరబడి కల్లోలం సృష్టిస్తున్న పాకిస్థాన్‌లో చైనా సిల్క్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది.


హిందూ మహా సముద్రం మీదుగా యూరప్ దేశాలకు జలరవాణా ద్వారా వ్యాపారాలు చేయడానికి చైనాకి జలమార్గాలు, ఓడరేవులు లేవు. ఇందుకోసం చైనా హిందూ, అరేబియా మహాసముద్రాల ద్వారా జలమార్గం కోసం శ్రీలంక, మాల్దీవులు, పాకిస్థాన్‌ దేశాలను కలుపుకుంటోంది. భారత్‍కు దక్షిణ దిశలోని శ్రీలంక హిందూ మహాసముద్రంలో కీలకమైన ద్వీప దేశం. పశ్చిమ తీరంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి శ్రీలంక ముఖ్యకేంద్రం. చైనాకు హిందూ మహాసముద్రంలో ఎలాంటి హక్కు లేదు. అయినప్పటికీ భారతదేశాన్ని వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టేందుకు శ్రీలంకలో అతిపెద్ద నగరమైన కొలంబోకు దగ్గరలో ఒక హార్బర్ సిటీ నిర్మాణానికి పూనుకుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (BRI) పథకంలో భాగంగా సముద్ర సిల్క్ రహదారి పేరుతో నూతన పోర్ట్ సిటీని, ఓడరేవును నిర్మించేందుకు శ్రీలంకకు వేల డాలర్లను అప్పుగా కూడా ఇచ్చింది. పోర్టు సిటీ పేరుతో చైనా జోక్యం శ్రీలంక సార్వభౌమాధికారానికి భంగం కలిగించే విధంగా ఉందంటూ ఆదేశ సుప్రీంకోర్టులో కేసు నమోదయింది. దీంతో మహేంద్ర రాజాపక్షే ప్రభుత్వం బిల్లులోని కొన్ని అంశాలను సవరించింది. మైత్రిపాల సర్కార్ ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన రాజపక్షే ప్రభుత్వం ప్రాజెక్టును తిరిగి చైనాకి అప్పగించింది. హంబన్‍టోటా నౌకాశ్రయాన్ని కూడా చైనాకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చింది. ఇదంతా హిందూ మహాసముద్రంలో హక్కులను సంపాదించి, భారత్‍ను సముద్ర మార్గపరంగా అష్టదిగ్బంధం చేయడానికి చైనా పన్నిన వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.


చైనా నుంచి పెరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళం రూ.43 వేల కోట్ల వ్యయంతో ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత కొత్త జలాంతర్గాముల కోసం ప్రణాళికలు రూపొందించడం ఇదే మొదటిసారి. గతంలో పాకిస్థాన్‌ నుంచి మాత్రమే భారత్‌కు ముప్పు ఉండేది. కానీ నేడు భారత్–చైనా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దేశ రక్షణ విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా, పాకిస్థాన్‌లతో ఏకకాలంలో యుద్ధాన్ని ఎదుర్కోవలసి వస్తే భారత సైనిక బలం సరిపోదు. అందుకే భారతదేశం రక్షణకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే ‘క్వాడ్’ కూటమిలో భాగస్వామ్యంతో పాటు, ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. 1971 యుద్ధంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన పాత్ర పోషించింది. ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ల కోసం 2013లో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, 2020లో విక్రాంత్ రక్షణకు సేవలందిస్తున్నాయి. 2030 నాటికి ఐఎన్‌ఎస్ విశాల్‌ను భారత నౌకాదళంలోకి తీసుకు రావాలని ప్రయత్నం జరుగుతోంది. ఇవి దేశ రక్షణకు అత్యంత కీలకం.


భారతదేశం శాంతికాముక దేశం. ప్రపంచంలో ఎన్నో దేశాలు హింసాత్మక పోరాటాల వల్ల స్వాతంత్ర్యం సాధించాయి. కానీ భారత ఉపఖండం మాత్రం శాంతితోనే వలస పాలకుల నుండి స్వేచ్ఛను పొందింది. నాటి నుండి నేటి వరకు మనదేశం ఏ ఒక్క దేశంపైన దురాక్రమణ చేసిన దాఖలాలు లేవు. ఏ రాజ్యాన్నైనా హస్తగతం చేసుకోవాలని, భూ భాగాన్నైనా ఆక్రమించాలని ప్రయత్నించలేదు. ఇదే ఒరవడి కొనసాగాలని ఆశిద్దాం. ఆసియాలోనే అతిపెద్ద దేశాలైన భారత్–చైనాలు స్వాతంత్ర్యం తొలినాళ్ళ నాటి శాంతి, సహకారం సూత్రాల ఆధారంగా ముందుకు సాగాలని భావిద్దాం. 

డాక్టర్ ఎ. కుమార స్వామి

ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - 2021-10-07T06:28:00+05:30 IST