బొరుసు వాన

ABN , First Publish Date - 2021-09-03T06:21:53+05:30 IST

వర్ష రుతువుక్కూడా బొమ్మాబొరుసులుంటాయి. కాని ఈ ముసురు మాత్రం బొరుసే, ఇది రుతు చక్రానికి విరిగిన ఇరుసు....

బొరుసు వాన

వర్ష రుతువుక్కూడా

బొమ్మాబొరుసులుంటాయి.

కాని ఈ ముసురు మాత్రం బొరుసే,

ఇది రుతు చక్రానికి

విరిగిన ఇరుసు.


నిజానికి వర్షం ఎంత సుందరం!

అయితే

ఇది గాలీవానల దుర్మైత్రి

జాలి లేని కాళరాత్రి.


ఎంతగానో ఎదురుచూశాం

చినుకుల కోసం,

వేసవితో వేసారిపోయిన ప్రాణాలు

ఆకాశానికి కండ్లతికించిన వైనాలు.


తొలకరి వస్తే

అది ఎండాకాలం పోలేక పోలేక

కార్చే కన్నీళ్లు అనుకున్నాం

మేఘాల సందుల్లోంచి

చల్లనిగాలులు వీస్తే

‘హమ్మయ్య’ అనుకున్నాం.


రోజులు రోజులుగా

ఒకటే ముసురు,

అర్ధరాత్రి కుంభవృష్టిలో

అర్ధరాత్రి చితికిపోతోంది.

వాగులో మునిగిపోయిన వారి

బంధువుల శోకంలా ఉంది ఆ చప్పుడు

దుఃఖం తీరేది కాదు

అది మబ్బులకఫన్ కప్పిన 

ఆకాశం లాంటిది.


నీటి బిందువులను

ముత్యాలనుకున్నాం.

ఇవాళ నిప్పుకణికలై బతుకుల్ని కాల్చేశాయి

వర్షం యావత్ ప్రపంచాన్ని

కలిపి కుట్టే తడిదారం అనుకున్నాం

ఇప్పుడదే ప్రాణాలకు

ఉరితాడయ్యింది.


అందం ఉన్నచోటనే

ఆపద ఉంటదా!

జగదేకసౌందర్య గీతం కదా

జలపాతం.

అదిప్పుడు

మృత్యువుకు సంకేతమయ్యింది.


వానా వానా వద్దప్పా!

మారణహోమం చాలప్పా!!

డా. ఎన్. గోపి

Updated Date - 2021-09-03T06:21:53+05:30 IST