జన్మ
ABN , First Publish Date - 2021-10-25T06:01:30+05:30 IST
‘మళ్లీ జన్మ ఉంటే ఎలా పుడతావు’ అందామె సన్నటి జల్లు పడుతోంది దేవుడు చినుకుల భాషలో మాట్లాడుతున్నట్టు...

‘మళ్లీ జన్మ ఉంటే ఎలా పుడతావు’ అందామె
సన్నటి జల్లు పడుతోంది
దేవుడు చినుకుల భాషలో మాట్లాడుతున్నట్టు
చల్లగా, నెమ్మదిగా, ఉల్లాసంగా
‘మళ్లీ ఇంత ప్రేమించేవాడిగానా’ అడిగింది
‘ప్రేమలోకి ఒకసారి మేలుకొంటే మళ్లీ అవసరం లేదు
మెలకువ రాకపోయివుంటే మళ్లీకి అర్థమూ లేదు’
‘వేదనామయ లోకంపై దయ చూపేవాడిలానా’ అన్నది
‘మన దయ చూపే అనుభవం కోసం
లోకంలో వేదన ఉండాలనుకోవటం కఠినంగా లేదా’
‘పోనీ స్వాప్నికుడిలానో, గాయకుడిలానో..’
‘లేదు, జీవితాన్ని ఉన్నట్టుగా చూడనివ్వని
మత్తులో మునగటం కాసేపు బావుంటుంది
తరువాత మరింత దిగులు కమ్ముతుంది’
‘ఎలా పుడదామని వుంది మరి’
‘నిజం చెప్పాలంటే పుట్టాలని లేదు
ఈ కోరిక వలన పుట్టాల్సివస్తుందేమో తెలీదు’
‘పుట్టుక నా చేతుల్లో ఉంటే
మరీ కొంచెంసేపు కనిపించి మాయమయే
ఇంద్రధనువై పుట్టాలని ఉంది’
పడమటి కాంతిలో పలుచనినీటి తెరల్లో
ఏడురంగులు తెరుచుకున్నాయి
నేల నుండి నింగికి, నింగి నుండి నేలకి
తెరుచుకున్నచోటికి వెళ్లి చూడబోతే
ఇంద్రధనువు కనిపించదు
నేను ఇంద్రధనువైనా అంతే
ఇంతకూ, నేను తెరుచుకున్నచోటికి వెళ్లి
నన్ను చూడగలనా ఎప్పటికైనా..
బివివి ప్రసాద్
90320 75415