పాఠ్యాంశాలుగా సమరయోధుల త్యాగాలు

ABN , First Publish Date - 2021-08-20T06:09:10+05:30 IST

సుదీర్ఘకాలం సాగిన భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలోకి తొంగిచూస్తే అడుగడుగునా ప్రజల ఆర్తనాదాలు, ఆక్రందనలు వినిపిస్తాయి..

పాఠ్యాంశాలుగా సమరయోధుల త్యాగాలు

సుదీర్ఘకాలం సాగిన భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలోకి తొంగిచూస్తే అడుగడుగునా ప్రజల ఆర్తనాదాలు, ఆక్రందనలు వినిపిస్తాయి. తమ తరువాతి తరాల వారైనా హాయిగా ఆనందంగా బతకాలని, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవించాలని నిరంతరం తపించి ఉద్యమించిన వారు చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు అనన్యసామాన్యమైనవి. భార్యాబిడ్డలను వదిలేసి ఏళ్ళకు ఏళ్ళు జైళ్లలో మగ్గిపోయిన త్యాగమూర్తులు, జైలుగోడల మధ్య పాచిపట్టిన అన్నం తినలేక రోజుల తరబడి పస్తులున్నవారు, ఆకలికి తట్టుకోలేక పురుగులు పట్టిన అన్నం ఏరుకొని ఆబగా తిన్నవారు ఎందరో. తెల్లవాడి నెదిరించి నవ్వుతూ ఉరికంబాలపై వేలాడిన యోధులు ఎందరో. దేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వాన్ని ధారబోసిన అలాంటివారిని గూర్చి గాని, సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గిపోయిన వారిని గూర్చి గాని ఈ రోజున తలచేవారు ఎవరైనా ఉన్నారా? ఆ యోధుల గూర్చి ఈ తరం వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత మేధావి వర్గాలకు లేదా? ఇప్పుడు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువులు లక్షలాది మంది సమరయోధులు అర్పించిన ప్రాణత్యాగాల ఫలితమేనని ఈ తరానికి తెలియాలి కదా! సమరయోధుల త్యాగాలు పాఠాల రూపంలో పిల్లలకు చేరువైతే స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ, ప్రాధాన్యం వారికి అర్థమవుతాయి. అప్పుడే ఛిద్రమైపోతున్న మానవ విలువలను, పతనమైపోతున్న ప్రజాస్వామిక విలువలను కొంతమేరకైనా కాపాడిన వారమవుతాం.


తోటకూర వేంకటనారాయణ

Updated Date - 2021-08-20T06:09:10+05:30 IST