సౌందర్య, కారుణ్య కవి
ABN , First Publish Date - 2021-07-31T05:45:14+05:30 IST
కలల పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించి, కళ్ల చివర కాంతి సంగీత గీతాన్ని రచించి, నవనవాలైన ఊహా వర్ణార్ణవాలను ఉప్పొంగించిన అందమైన కవి, జీవించడం ప్రేమించడం తెలిసిన కవి, ఆగ్రహాన్ని కూడా ఆర్తిగా కరుణగా....
కలల పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించి, కళ్ల చివర కాంతి సంగీత గీతాన్ని రచించి, నవనవాలైన ఊహా వర్ణార్ణవాలను ఉప్పొంగించిన అందమైన కవి, జీవించడం ప్రేమించడం తెలిసిన కవి, ఆగ్రహాన్ని కూడా ఆర్తిగా కరుణగా పలికించిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. నూరేళ్ల కిందట ఆగస్టు ఒకటో తేదీన జన్మించి, నలభైనాలుగేళ్ల అర్ధాయుష్షులోనే అస్తమించిన ఈ సౌందర్య ప్రేమికుడు తన ఆనవాళ్లుగా దయా పారావతాల్లాంటి, విజయ ఐరావతాల్లాంటి, వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్ల ల్లాంటి అక్షరాలను వదిలివెళ్లారు. శ్రీశ్రీ తరువాత అంతటి భావుకుడు అని విమర్శకులు ప్రశంసించిన ఈ కవి శతజయంతి సంవత్సరం సందర్భంగా ఏడాది నుంచి తెలుగుసాహిత్య సమాజం ప్రత్యేకంగా స్మరించుకుంటున్నది.
గోదావరి జిల్లాల పెద్ద కులాల పట్టణ సంస్కారం, చదువు, సంపన్నత అన్నీ ఉన్న జీవితం తిలక్‌ది. అనారోగ్యం తప్ప ఏ లోటూ తెలియదు. భావకవిత్వం ఇంకా యువకులను మైమరిపించడం మానని రోజుల్లో, అప్పుడప్పుడే నవ్య కవిత్వాన్ని, అభ్యుదయ అగ్నికవిత్వాన్ని కొత్తతరం మోసుకువస్తున్న కాలంలో, తిలక్ రాయడం మొదలుపెట్టారు. అభ్యుదయం దశ ముగిసిపోయి, చేవచచ్చిపోయి, సమాజం కొత్త గొంతుకల కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఆయన మన మధ్య నుంచి నిష్క్రమించారు. ఆ సంధ్యా సందర్భాల లేత ముదురు వన్నెలనే ఆయన కవిత్వమూ పలికింది. ‘‘కాదు ధనికస్వామ్యం, సామ్యవాదం’’ అని రాజకీయాభిప్రాయాలను సూచించిన తిలక్, ఆయన కవిత్వం పలికిన సారళ్యానికి, మార్దవానికి, శైలిలోని మాధుర్యానికి, భావనల్లోని అద్భుత భావుకత్వానికి, వ్యక్తీకరణలోని ఆర్తికి, కరుణకు అనంతర తరాల పాఠకుల అభిమానాన్ని పొందుతూనే ఉన్నారు. స్మరించినప్పుడు, స్ఫురించినప్పుడు ఒక పారవశ్యంలోకి, ఒక మనో ప్రకంపనలోకి నడిపించే తిలక్ కవిత్వపాదాలు ఎన్నో. కవిత్వం చదవడం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ పరామర్శించే పది పుస్తకాలలో ‘‘అమృతం కురిసిన రాత్రి’’ తప్పకుండా ఉంటుంది.
అభ్యుదయ కవిత్వం కొన్ని పాళ్లు, భావ కవిత్వం కొన్ని పాళ్లు, భావనలో అభ్యుదయ కవి, శైలిలో భావకవి- అని కుందుర్తి ఆంజనేయులు తిలక్‌పై తీర్పు చెప్పారు. తిలక్‌ను అర్థం చేసుకోవడానికి ఆయన వస్తువును, భాషను పరీక్షకు పెట్టినవారు అనేకులున్నారు. తమ మార్గానికి రాలేదని నిరసించినవారున్నారు. ఆయన కవిత్వ జీవితం సాగింది అటూ ఇటూగా రెండున్నర దశాబ్దాలే. అందులోనూ ఒక పదేళ్లు ఆయన అనారోగ్యంతో కవిత్వం రాయలేదు. ఈ పాతికేళ్ల కాల స్వభావం ఏమిటో అర్థం చేసుకుంటే, ఆ కాలంలో నిర్ణయాత్మకమైన ఏ మొగ్గూ చూపలేక, తటస్థతో, మధ్యస్థమో, సమ్మిశ్రమో అయిన భావాల దగ్గర నిలిచిపోయినవాడిగా తిలక్‌ను అర్థం చేసుకోవాలి. తన ఆలోచనల గురించి తిలక్‌కు ఒక అవగాహన ఉన్నది. ‘‘కరుణ, సౌందర్యమూ, మానవత్వమూ’’ తన ఆదర్శాలకు ప్రాతిపదికలని ఆయనే చెప్పుకున్నారు. ‘కరుణ లేని కవివాక్కు సంకుచితమౌతుంది’ అని కూడా ఆయనే అన్నారు.
ఆధునిక కాలంలో, వచనకవిత్వంలో కరుణను కవిత్వంలో అమితంగా పలికించిన కవిగా తిలక్ గుర్తుండిపోతారు. ఆ కరుణ అభ్యుదయ హృదయ స్పందనగా కనిపించదని రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నది నిజమే కావచ్చు. అట్లాగే, ఆయనలో అంతా చూడగలిగే సౌందర్య దృష్టి, కె.వి. రమణారెడ్డి అన్నట్టు ‘స్వీయ సౌందర్య ప్రీతే’ కావచ్చు. కానీ, తిలక్ పలికిన ఆర్తి, సౌందర్యం కవిత్వ పాఠకుల అభిరుచులను ఉన్నతీకరిస్తూనే ఉన్నాయి. ఆయన పలికించే జాలి ఎటువంటి ఆచరణనూ ప్రేరేపించదని అంటారు కానీ, అది నిజం కాదేమో. తిలక్ సుప్రసిద్ధ గీతం ‘ఆర్తగీతం’ -‘‘మనల్ని క్షోభపెడుతుంది హింసపెడుతుంది. ఈ పద్యంలోని ఆర్తిమన ఆర్తి అవుతుంది. అది మన నిస్సహాయతను బలంగా మారుస్తుంది’’ అని వెల్చేరు నారాయణరావు అభిప్రాయపడ్డారు.
తిలక్ అకాలమరణం తెలుగుసాహిత్యప్రపంచాన్ని కుదిపివేసింది. తన లాంటి వారు బతికి ఉండడమేమిటి, తిలక్ చనిపోవడమేమిటి- అని శ్రీశ్రీ బాధపడ్డారు. ఒక గొప్పసంగీతం మధ్యలో ఆగిపోయినట్టు నండూరి రామమోహనరావుకు అనిపించింది. ఆయన పూర్తి కాలం జీవించి ఉంటే, ఆయన సృజన నుంచి సమాజం మరింత లాభపడి ఉండేది. చివరి దాకా ఆయన పద్యకవిత్వం కూడా రాశారు. కవి మాత్రుడే కాదు, తిలక్ మంచి కథకుడు కూడా. కాల్పనికేతర వచనరచయిత కూడా. తిలక్ శతజయంతి సందర్భంగా, ‘కవిసంధ్య’ సంస్థ, సుప్రసిద్ధ కవి శిఖామణి సంపాదకత్వంలో ‘అమృతవర్షిణి’ అన్న స్మృతిసంచికను తీసుకువచ్చింది. తిలక్ మీద వచ్చిన రచనలు, సన్నిహితుల, పరిచయస్తుల జ్ఞాపకాలు అన్నిటినీ సంకలించిన ఈ పుస్తకం నిజంగా అమృతవర్షిణే. తిలక్ గురించిన అనేక అంచనాలు, అవగాహనలు ఈ సంచిక పరిచయం చేస్తుంది. రేపు ఆదివారం సాయంత్రం జూమ్ వేదికగా జరిగే తిలక్ శతజయంతి సభలో ఈ పుస్తకం లాంఛనంగా ఆవిష్కృతమవుతుంది.
ఒక శతజయంతి సంవత్సరం ముగిసిపోతూ, మరో మహారచయిత స్మరణకు దారి ఇస్తున్నది. శుక్రవారం, జూలై 30 నాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి 99వ జయంతి. 2022 జూలై 30 నాడు శతజయంతి దాకా ఏడాది పొడుగునా రా.వి. శాస్త్రి సాహిత్యాన్ని మననం చేసుకోవడానికి, మెరుగుగా అర్థం చేసుకోవడానికి తెలుగు సాహిత్య సమాజం ప్రయత్నిస్తుంది. పీడనను, వేదనను, అధోజగత్తు అంధకారాన్ని, చట్టబద్ధ వ్యవస్థల డొల్లతనాన్ని వాస్తవం, వ్యంగ్యం, నుడికారం, కవిత్వం కలగలసిన శైలితో చిత్రించిన రచయిత రా.వి.శాస్త్రి్. గుర్తుండిపోయే గొప్ప రచయితల సాహిత్యాన్ని మరో మారు తరచి చూడడానికి, మన అవగాహనలను సవరించుకోవడానికి శతజయంతుల వంటి సందర్భాలు పనికివస్తాయి. సాంస్కృతిక స్పృహ ఉన్న సమాజాలు సాహిత్యం ద్వారా సమాజానికి లభించిన లబ్ధికి తప్పనిసరిగా కృతజ్ఞతలు ప్రకటిస్తాయి.