సబ్‌ప్లాన్ నిధులు సద్వినియోగమయ్యేనా?

ABN , First Publish Date - 2021-03-24T06:07:00+05:30 IST

కులం ప్రాతిపదికన నెలకొన్న అసమానతలు దళిత గిరిజనుల జీవన స్థితిగతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధికి ఆమడదూరంలో ఆ వర్గాల...

సబ్‌ప్లాన్ నిధులు సద్వినియోగమయ్యేనా?

కులం ప్రాతిపదికన నెలకొన్న అసమానతలు దళిత గిరిజనుల జీవన స్థితిగతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధికి ఆమడదూరంలో ఆ వర్గాల ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. జంతువులను, చెట్లను, రాళ్లను, యంత్రాలను సైతం దేవుళ్ళుగా పూజింంచే సమాజం సాటి మనిషిని అంటరాని వాడిగా, అస్పృశ్యుడిగా చూసింది. అస్పృశ్యుడిగా తన జీవితంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొని మొక్కవోని పట్టుదలతో ప్రపంచ మేధావిగా ఎదిగిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆ వర్గాల అభ్యున్నతికి, సామాజిక మార్పుకు, అసమానతలను రూపుమాపడానికి విశేషంగా శ్రమించారు. అంబేద్కర్ ఆశించినట్లు కుల నిర్మూలన జరగాలంటే అట్టడుగున ఉన్న దళిత,గిరిజన వర్గాల అభివృద్ధి జరిగి అసమానతలు తొలగిపోవాలి.


సామాజిక న్యాయం రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిలో అంతర్భాగం. కాలానుగుణంగా గతంతో పోలిస్తే షెడ్యూల్డ్ కులాల, తెగల ప్రజానీకం అభివృద్ధి చెందినా, ప్రధాన జీవన స్రవంతి కంటే ఇంకా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ఈ వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలితాలు అందాలని, సమాజంలో అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజానీకానికి, ఇతర ప్రజానీకానికి మధ్యనున్న అభివృద్ధి అసమానతలను తొలగించాలన్న లక్ష్యంతో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ఉప ప్రణాళికల ద్వారా ప్రత్యేక కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. 


సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి, వికాసం కోసం నిర్దిష్ట పథకాలను, ప్రణాళికలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా సమాజంలోని అత్యంత అణగారిన వర్గాలుగా ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలకు; ఇతర ప్రజానీకానికి మధ్య ఉన్న అభివృద్ధి అసమానతలు, ఇతర వివక్షతలను తొలగించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా రాజ్యాంగం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి ధ్యేయంతో 1974లో గిరిజన ఉప ప్రణాళిక, 1979లో ఎస్సీలకు ప్రత్యేక ఉప ప్రణాళికలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం ఈ వర్గాలకు నిధులు కేటాయించడం, వనరుల సమీకరణ, సమీకృతాభివృద్ధి పథకాలను అమలు చేయడం వంటివి ఈ ప్రణాళికల ప్రధాన లక్ష్యాలు. వీటిని అమలుచేసేలా కేంద్ర ప్రణాళిక సంఘం రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. అయితే కేంద్రప్రభుత్వంతో పాటు చాలా రాష్ట్రాలు ఈ మార్గదర్శక సూత్రాలను విస్మరించాయి. 2016–-17లలో కేంద్రప్రభుత్వం ప్రణాళిక, ప్రణాళికేతర కేటాయింపులను సంయుక్తంగా నిర్వహించేందుకు నిర్ణయించి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ను తీసుకురావడం జరిగింది. ఈ వర్గాలకు కేటాయించిన నిధులను దారి మళ్లించడం, సకాలంలో సక్రమంగా వినియోగించకపోవడం మొదలైన కారణాల వల్ల ప్రభుత్వాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. వీటిని అరికట్టడం, సక్రమ వినియోగం కోసం చట్టబద్ధత అనివార్యంగా కనిపిస్తుంది.


కేంద్ర బడ్జెట్ కేటాయింపులలో ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా నిష్పత్తి అనుసరించి ఉపప్రణాళికా నిధుల కేటాయింపు లేకపోవడం బాధాకరం. జనాభా దామాషా ప్రకారం కేటాయించవలసిన నిధులలో భారీగా కోత కనిపిస్తుంది. అంతేగాక కేటాయించవలసిన నిధులను కూడా ఆ వర్గాల ప్రత్యేక ప్రయోజనాల కొరకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పథకాలకు ఖర్చు చేసిన నిధులు కూడా అతి స్వల్పమే. కేటాయించిన నిధులు 50 శాతం కూడా ఖర్చు చేయకపోవడం మరొక సమస్య. దేశంలో ఎస్సీల జనాభా 1961 జనాభా లెక్కల ప్రకారం 14.7 శాతం కాగా అది 2011 నాటికి 16.6 శాతానికి చేరుకుంది. అంతేకాక ఎస్టీల జనాభా 1961 జనాభా లెక్కల ప్రకారం 6.9 శాతం కాగా అది 2011 నాటికి 8.6 శాతం ఉన్నది. ఎస్సీ, ఎస్టీల మొత్తం జనాభా దాదాపు 31 కోట్లు. ఇది దేశం మొత్తం జనాభాలో నాలుగోవంతు.పేదరిక శాతం మాత్రం 41.30గా ఉన్నది.


ఇక ఈ జనాభా శాతానికి అనుగుణంగా ఇప్పటివరకు ఏ ఒక్క వార్షిక బడ్జెట్లో కూడా కేటాయింపులు జరగలేదు. దాదాపు ప్రతి బడ్జెట్లోనూ 50 శాతం పైగా కేటాయింపుల్లో కోత ఎదురైంది. ఆరో పంచవర్ష ప్రణాళిక కాలం నుండి ఇప్పటి వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్డీఏ ప్రభుత్వం 2014-–19 ఐదేళ్ల కాలంలో ఎస్సీ కేటాయింపుల్లో 51 శాతం ఎస్టీ కేటాయింపుల్లో 41 శాతం నిధులు కోత విధించింది. కేటాయించిన ఎస్సీ నిధులలో 60 శాతం ఖర్చు చేయగా, ఎస్టీ నిధులు 70 శాతం ఖర్చు చేశారు. వీటిలో ఆ వర్గాలకు నేరుగా ప్రయోజనం కలిగే పథకాలకు 20శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారు. ఉదాహరణకు 2017-–18 బడ్జెట్ట్‌ను పరిశీలిస్తే ఎస్సీలకు కేటాయించవలసిన 16.6 శాతం నిధులకు గాను కేవలం 8.8 శాతం కేటాయించగా వాటిలో 6.1 శాతం ఖర్చు చేయగా దానిలో నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలకు 4.4 శాతం నిధులు వినియోగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-–22 బడ్జెట్లో ఎస్సీలకు లక్షా ఇరవై ఆరు వేల కోట్ల అనగా వారికి కేటాయించవలసిన 16.6 శాతంలో 59 శాతం, ఎస్టీలకు సుమారు 80 వేల కోట్లు అనగా వారి కేటాయించవలసిన 8.6శాతంలో 55 శాతం కేటాయించడం జరిగింది. దీనిలో ఎస్సీలు నేరుగా ప్రయోజనం పొందే పథకాలకు రూ.48,397 కోట్లు, ఎస్.టిలు నేరుగా ప్రయోజనం పొందే పధకాలకు రూ.27830 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. దీనిలో ఎంత శాతం ఖర్చు చేస్తారు అనేది వేచి చూడాలి.


ఉప ప్రణాళిక అమలును సాంకేతిక దృక్పథంతో కాకుండా సామాజిక, ఆర్థిక దృక్పథంతో పరిశీలించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న వేగవంతమైన మార్పులలో ఎస్సీ ప్రజానీకాన్ని కూడా భాగస్వాములను చేయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. గిరిజనుల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సేవల రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. జాతీయాదాయంలోనే కాదు, రాష్ట్ర ఆదాయంలో కూడా అధిక భాగం సేవల రంగం నుంచే వస్తోంది. కానీ, ఈ నూతన సంపదలో ఎస్సీ, ఎస్టీ ప్రజానీకానికి సరైన భాగస్వామ్యం లేదు. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో భాగమైన సమాచార, సాంకేతిక, జీవసాంకేతిక రంగాలు భవిష్యత్తులో సంపదను సృష్టించే కీలక రంగాలు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఈ వర్గాల భాగస్వామ్యంపై అత్యంత శ్రద్ధ అవసరం. 


ఎస్సీ, ఎస్టీలకు ఇతర వర్గాల మధ్య నున్న వ్యత్యాసాలను రూపుమాపేలా ఆయా వర్గాలకు ప్రత్యక్ష, మెరుగైన ప్రయోజనాలను అందించేలా పథకాలను రూపొందించాలి. వ్యక్తిగతంగా, కుటుంబాలవారీగా, నివాసాలవారీగా బడ్జెట్ రూపకల్పనకు ఆరునెలలు ముందే ప్రణాళికలను తయారుచేయాలి. ఈ చట్టం ద్వారా కేటాయించే నిధుల దారిమళ్లింపుగాని, ఖర్చు చేయని పక్షంలో మురిగిపోయేందుకు కానీ అవకాశం ఉండకుండాను,నిధులను ఖర్చు చేయడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంలోను ప్రభుత్వం నిబధ్ధతతో వ్యవహరిస్తే ఆశించిన లక్ష్యాలు చేరేందుకు అవకాశం కలుగుతుంది.ఉప ప్రణాళికలను పారదర్శకంగా అమలు చేసేందుకుగానూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి.

నేలపూడి స్టాలిన్ బాబు

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కమిటీ మాజీ సభ్యులు

Updated Date - 2021-03-24T06:07:00+05:30 IST