వివక్షపై అంకుశం

ABN , First Publish Date - 2021-08-21T06:21:27+05:30 IST

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశపరీక్షకు అర్హులైన మహిళా అభ్యర్థులను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రశంసనీయమైనవి. మీ ఆలోచనా తీరు మార్చుకోండి అంటూ ఆర్మీని గట్టిగా మందలిస్తూ న్యాయమూర్తులు.....

వివక్షపై అంకుశం

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశపరీక్షకు అర్హులైన మహిళా అభ్యర్థులను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రశంసనీయమైనవి. మీ ఆలోచనా తీరు మార్చుకోండి అంటూ ఆర్మీని గట్టిగా మందలిస్తూ న్యాయమూర్తులు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, హృషికేష్‌రాయ్‌ల ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు లింగసమానత్వం దిశగా మరో అడుగుపడేందుకు ఉపకరిస్తాయి. ఎంట్రన్స్‌ పరీక్షకు మహిళలు హాజరై, ఎన్డీఏలో శిక్షణ తీసుకొనేందుకు వీలుగా సంబంధిత అధికారులను ఆదేశించాలన్నది పిటిషనర్‌ అభ్యర్థన. ఇది న్యాయస్థానాల జోక్యానికి వీల్లేని అతిముఖ్యమైన విధానపరమైన అంశమన్న కేంద్రప్రభుత్వం వాదననూ అభ్యంతరాలనూ న్యాయమూర్తులు పక్కకు నెట్టివేసి ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. 


సెప్టెంబరు 8న వెలువడే తుదితీర్పుకు లోబడి ఈ వ్యవహారమంతా ఉంటుందన్న న్యాయపరమైన లంకెను అటుంచితే, కేంద్రం వాదనలను న్యాయమూర్తులు పలు ప్రశ్నలతో, కీలకవ్యాఖ్యలతో పూర్వపక్షం చేశారు. కేంద్రప్రభుత్వం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యాభాటీ చెప్పినట్లుగా సైన్యంలో మహిళలకు ఇప్పటికే చోటున్నది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఓటీఏ) వంటి పద్ధతుల ద్వారా మహిళల ప్రవేశం జరుగుతోంది. వాటిని గుర్తుచేయడం ద్వారా ఈ దారిన ప్రవేశం నిషిద్ధమనీ, మహిళలను అన్నిదారుల్లోనూ అనుమతించనవసరం లేదని ప్రభుత్వం వాదిస్తున్నది. నియామక ప్రక్రియలో వివక్షలేదనీ, ప్రవేశమార్గాలనేకం ఉన్నాయనీ అంటూ, న్యాయస్థానాన్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగా దేశభద్రత అస్త్రాన్ని కూడా ప్రయోగించింది. 


ఆర్మీలో ప్రవేశానికి మహిళలు సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు వెలువరిస్తూ, మహిళలకు శాశ్వత కమిషన్‌ హోదా, అన్ని సర్వీసుల్లోనూ కమాండ్‌ పోస్టింగులు ఇవ్వడం వంటి పలు ఆదేశాలు జారీ చేసింది. సైన్యంలోకి మహిళల ప్రవేశం ఆరంభమైన 1992నుంచి వారు నిర్వహించిన ప్రశస్తమైన పాత్రను కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. జెండర్‌ సమానత గురించి ప్రత్యేక ప్రస్తావనలు చేసింది. అతి స్పష్టమైన, నిర్దిష్టమైన ఈ తీర్పు తరువాత కూడా ఆర్మీ తెలిసో, తెలియకో వ్యవస్థాగత నియమాలను సరిదిద్దుకోనందున మహిళలు తమ న్యాయపోరాటాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ముందు మీ వైఖరి మార్చుకోండి, ఆలోచనలను విశాలం చేసుకోండి అంటూ న్యాయమూర్తులు ఇప్పుడు వెలువరించిన ఆదేశాల వల్ల, ప్రవేశ పరీక్షద్వారా నిగ్గుతేలిన మహిళలకు ఎన్డీఏలోనూ, అనంతరం ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీల్లోనూ శిక్షణపొంది కమిషన్డ్‌ ఆఫీసర్లు అయ్యేందుకు అవకాశం దక్కుతుంది. లింగసమానతలో మన సైన్యానికి మరో అడుగువేసిన ఖ్యాతి దక్కుతుంది. ప్రతీసారీ తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం రానివ్వకుండా, జెండర్‌ సమానతను పరిరక్షించే వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకొని, ఆ విలువకు అనుగుణంగా సాగిపోవాలంటూ న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. పద్నాలుగులక్షల సైన్యంలో మహిళలు ఆర్మీలో ౦.56శాతం, ఎయిర్‌ఫోర్స్‌లో 1.౦8శాతం  ఉన్నారు. ౬.5శాతంతో నావికాదళమే కాస్త నయం. సైనికరంగం నుంచి మహిళలను దూరంగా ఉంచే ప్రయత్నం అనాదిగా ఉన్నదే. శారీరక దారుఢ్యం, లైంగికవేధింపులు, నాయకత్వ ప్రతిభ ఇత్యాది వాదనలను ముందుకు తెస్తూ, వ్యవస్థాగతమైన మార్పుచేర్పులకు సైన్యం సిద్ధం కావడం లేదు.


న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేయవలసి వస్తోంది. మహిళలు సైన్యంలోకి వచ్చి దాదాపు మూడుదశాబ్దాలు కావస్తున్న నేపథ్యంలో, వారు సమస్త బాధ్యతల నిర్వహణకూ అర్హులని ఇప్పటికే రుజువైంది. వివక్షను మనసుల్లోంచి చెరిపివేసి, సమానతను సాధించడానికి ఆర్మీ విశేషకృషి చేయవలసింది ఉంది. సైనికస్కూళ్లలో ప్రవేశానికి ఆడపిల్లలు కూడా ఇకపై అర్హులేనంటూ ప్రధానమంత్రి ఎర్రకోటనుంచి చేసిన ప్రకటన వివక్ష అంతానికి మరింత ఉపకరిస్తుంది.

Updated Date - 2021-08-21T06:21:27+05:30 IST