శిఖరాగ్రం నుంచి అగాధంలోకి..

ABN , First Publish Date - 2021-12-30T16:15:22+05:30 IST

అమరావతిని పగపట్టి పడగొట్టారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీశారు. అభివృద్ధిని నిలిపివేసి ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాళా అంచుకు చేర్చారు....

శిఖరాగ్రం నుంచి అగాధంలోకి..

అమరావతిని పగపట్టి పడగొట్టారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీశారు. అభివృద్ధిని నిలిపివేసి ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాళా అంచుకు చేర్చారు. అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న రాష్ట్రం దిక్కుతోచని స్థితికి నెట్టబడింది. స్వార్ధ ప్రయోజనాలకోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలిపెట్టారు. ఇంత అధ్వాన్న పాలనతో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? సాధించిన ప్రగతి ఎలా పల్లవిస్తుంది? 


ఒక నేరస్థుడు ప్రభుత్వాధినేత అయితే! అనర్ధాలు చోటు చేసుకుంటాయి. అరాచకం ప్రబలిపోతుంది. ప్రజల ఆర్ధిక జీవనం ఇక్కట్ల పాలవుతుంది. అభివృద్ధి అసాధ్యమైపోతుంది. రాష్ట్రం అధఃపాతాళంలోకి జారిపోతుంది. ఈ ఉదంతాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనే ఒక తిరుగులేని నిదర్శనం. గూండాలు, రౌడీ షీటర్లు, హంతకులు, వైన్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా అందరు కల కలిసి పొలిటికల్ మాఫియాగా ఆవిర్భవించి ప్రజా సంపదను ఏ విధంగా కొల్లగొడుతున్నారో చెప్పడానికి జగన్ పాలనే దృష్టాంతం. నవ్యాంధ్రను సర్వనాశనం చేసిన అసమర్ధ పాలన అది.


అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం అధమ స్థానానికి పడిపోయింది. అయిదేళ్ల చంద్రబాబు పాలన అద్వితీయం కాగా జగన్ పరిపాలన అధ్వాన్నమని చెప్పి తీరాలి. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్‌కి 2014 జూన్ 8‍న బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి అన్ని గడ్డు పరిస్థితులే. ఆర్ధిక పరిస్థితి కడు దుర్భరం. పరిపాలన సాగించడానికి కనీస వసతులు లేవు. బహుశా దేశంలో మరే రాష్ట్రమూ అటువంటి విషమ పరిస్థితిని ఎదుర్కొని ఉండదు. అటువంటి దుర్భర స్థితి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ప్రథమ స్థానానికి చేర్చింది. 2019లో ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ తన రెండున్నరేళ్ల పాలనలో నవ్యాంధ్రను అధమ స్థానానికి చేర్చారు. 


అయిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధికి జాతీయంగాను,అంతర్జాతీయంగాను రాష్ట్రానికి 770 వరకు అవార్డులు దక్కడంతో పాటు, అభినందనలు వెల్లువెత్తాయి. అవశేష ఆంధ్రప్రదేశ్‌ని తక్కువ సమయంలో మళ్ళీ ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్‌లో రెండోస్థానానికి తీసుకు వచ్చిన ఘనత చంద్రబాబుదే అని ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ జగన్నాధన్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి దశ-దిశ, పెట్టుబడుల బారులు, సాగునీటి ప్రాజెక్టులు పరుగులు, లాభదాయక వ్యవసాయం, వికేంద్రీకరణతో అభివృద్ధికి ప్రణాళిక, సమృద్ధ సంక్షేమం, ఉపాధి ఉరుకులు, విద్యావ్యవస్థలతో విద్యాసుగంధాలు, కరువుచూడని పాలన, కొరతలు లేని, జనం రోడ్డెక్కని పారదర్శక పాలనతో ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ని ప్రథమ స్థానంలో నిలిపింది తెలుగుదేశం ప్రభుత్వం. సమాజంలోని అన్ని వర్గాలకు సమున్నత జీవన ప్రమాణాలు నెలకొల్పడానికి అవిశ్రాంత కృషి జరిగింది.


అనేక ప్రతికూలతల మధ్య ప్రస్థానం ప్రారంభించినా అన్నిటిని అధిగమించి సుస్థిర ఆర్ధిక వ్యవస్థగా నిలదొక్కుకున్నది ఆంధ్రప్రదేశ్. రూ 16 వేల కోట్ల ఆర్ధిక లోటుతో అవశేషాంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులలోనూ అయిదేళ్లలో దేశంలో మరే రాష్ట్రం సాధించనంత వృద్ధి రేటును ఆంధ్రప్రదేశ్ సాధించడం గర్వకారణం. వృద్ధిరేటు 2014–15లో 9.20 శాతం ఉండగా, 2015–16లో 10-60 శాతం, 2016–17లో 11.19 శాతం, 2017–18లో 11.22 శాతం, 2018–19లో 11.2 శాతం నమోదయింది. వరుసగా నాలుగేళ్ళ పాటు రెండంకెల వృద్ధి రేటు సాధించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది.


వ్యవసాయరంగంలో జాతీయ వృద్ధి రేటు 3 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్ అంతకంటే చాలా ఎక్కువ శాతం వృద్ధి రేటు సాధించింది. 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఆదాయ వనరులు పెంచి రాష్ట్ర భవిష్యత్ తీర్చిదిద్దడం కోసం గత ప్రభుత్వం చెయ్యని కష్టం లేదు. పేదల అభ్యున్నతికి ఒక పక్కన 100కి పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బలీయమైన ఆర్థిక శక్తిగా మలచడానికి చంద్రబాబు గత అయిదేళ్లు అవిరళ కృషి చేశారు. ఎకనామిక్ గ్రోత్‌లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఒకటవ స్థానం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 15 శాతం ఉన్న తలసరి ఆదాయం. 2014–15లో తలసరి ఆదాయం రూ 93,699 ఉండగా 2018–19లో రూ.1,64,25కి పెరిగింది. వైసిపి పాలనలో తలసరి ఆదాయం 1.03 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే అనుకూలమైన రాష్ట్రంగా నవ్యాంధ్రను మొదటి స్థానంలో నిలిపారు.


నూతన పారిశ్రామిక విధానం ప్రకటించడం ద్వారా చంద్రబాబు రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి బాటలు వేశారు. విభజన సమయంలో రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలు లేవు. కానీ గత ప్రభుత్వ కృషితోనే అనేక భారీ పరిశ్రమలు బారులు తీరాయి. అంతేగాకుండా విభజన సంక్షోభ సమయంలోనూ భాగస్వామ్య సదస్సులు నిర్వహించి రూ. 16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. అన్నీ కోల్పోయిన రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించి లక్షల మందికి ఉపాధి కల్పించి అద్భుతాలు సృష్టించడం నవ్యాంధ్రలోనే సాధ్యమైంది. నూతన రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది పరుగులు వెనుక చంద్రబాబు కఠోర శ్రమ ఉంది. తెలుగుదేశం హయాంలో పారిశ్రామికాభివృద్ధి రేటు 10.24 శాతంగా ఉండగా జగన్ పాలనలో 2020–21లో అది 3.26 శాతానికి పడిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు పారిపోయాయి.


తెలుగుదేశం ప్రభుత్వం అయిదేళ్లలో సాగునీటి రంగానికి రూ. 67 వేల కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 70 శాతం పూర్తి చేయగా, మిగిలిన పనులను 2 శాతం కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చెయ్యలేదు. మరే ఇతర ప్రాజెక్టునూ పూర్తి చెయ్యలేదు. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు 10 లక్షల ఇళ్ళు 

నిర్మించగా. జగన్ ప్రభుత్వం ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేదు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రైతు సాధికార సంస్థను, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ వంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది. తద్వారా వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యమిచ్చింది. వ్యవసాయరంగం జాతీయ సగటు వృద్ధిరేటు 7.6 శాతమే ఉన్నప్పటికి స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో 11.2 శాతం నికర వృద్ధి సాధించింది. ఆ అయిదేళ్లు నవ్యాంధ్రలో సాగు విరామం లేదు, రైతు ఆత్మహత్యలు లేవు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, విద్యుత్, నీటి పారుదల వంటి ప్రాధాన్యతా రంగాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ముందడుగు వేసింది.


దీక్షాదక్షతలతో ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సమయంలో 2019లో ఎన్నికలు జరిగాయి. కొత్త (బూటకపు) హామీలకు ప్రజలు మోసపోయి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించారు. 2019 ఎన్నికల్లో అధికారం శ్రీ420ల పరం అయింది. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు వేసిన పునాదులు అన్నీ కూలిపోయాయి. ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అధమ స్థానానికి చేర్చిన ఘనతను మాత్రమే జగన్ సర్కార్ దక్కించుకున్నది. అక్కసుతో, అసూయతో ప్రగతి బాట పట్టిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అమరావతిని పగపట్టి పడగొట్టారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీశారు. అభివృద్ధిని నిలిపివేసి ఆర్ధిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాళా అంచుకు చేర్చారు. అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న రాష్ట్రం దిక్కుతోచని స్థితికి నెట్టబడింది. నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 14 స్థానంలోకి, రీసెర్చ్ డెవలెప్‌మెంట్ పెట్టుబడుల ఓవరాల్ ర్యాంక్‌లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానానికి దిగజారింది. ఫర్ ఫార్మానెన్స్ మెట్రిక్ 13వ ర్యాంక్‌కు, ఆంధ్రప్రదేశ్ సస్టైన్ బుల్ డెవలప్‌మెంట్ గోల్ (ఎస్‌డిజి) 2020లో 4వ స్థానానికి చేరింది.


క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో ఆంధ్రప్రదేశ్ 2018లో 77 పాయింట్లతో 3 స్థానంలో ఉన్నది. జగన్ పాలనలో 19 స్థానానికి దిగజారింది. ఆరోగ్యం, సుఖశాంతులలో 2019లో దేశంలోనే 2వ స్థానంలో ఉండగా జగన్ పాలనలో 7వ స్థానానికి పతనం అయింది. పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలలో ఆంధ్రప్రదేశ్‌ని 13 స్థానానికి. ఆర్ధిక అసమానతలు తగ్గింపులో 6వ స్థానానికి దిగజార్చారు. దీని బట్టి సంక్షేమ పథకాల్లో ఎంత కోత పెట్టారో అర్ధం అవుతుంది. దేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ని 2వ స్థానానికి చేర్చారు. జగన్ పాలనలో 20 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేక నిరుద్యోగం 24 శాతానికి పెరిగింది. మానవాభివృద్ధి సూచీల్లో రాష్ట్రానిది 27వ ర్యాంకు. శాంతి, న్యాయం, వ్యవస్థల బలోపేతంలో ఆంధ్రప్రదేశ్ 2019లో అగ్రస్థానంలో ఉండగా జగన్ పాలనలో అది 9 స్థానానికి దిగజారింది. స్వార్ధ రాజకీయాలకోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలిపెట్టారు. ఎవరేమన్నా నవ్యాంధ్ర నాశనమయింది. విభజన అనంతరం శిథిలమైన రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం శిఖరాగ్రానికి చేర్చగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అసమర్ధ, అసంబద్ధ, కక్షసాధింపు విధానాల ద్వారా అగాధంలోకి కూలదోశారు.


-యనమల రామకృష్ణుడు 

మాజీ ఆర్ధిక మంత్రి

Updated Date - 2021-12-30T16:15:22+05:30 IST