‘యాంటీ ‘కరోనా’ ట్వెంటీ’!
ABN , First Publish Date - 2021-01-01T06:01:21+05:30 IST
అయ్యో ‘ట్వెంటీ ట్వెంటీ’ (2020) అయ్యావు నీవు మాకు యాంటీ! నిన్ను తలచుకుంటేనే కోపం వస్తోంది...
అయ్యో ‘ట్వెంటీ ట్వెంటీ’ (2020)
అయ్యావు నీవు మాకు యాంటీ!
నిన్ను తలచుకుంటేనే కోపం వస్తోంది
కుత్తుక బంటీ
ఎందుకంటే
నువ్వు వచ్చీ రావడంతోటే
అణువంత సూక్ష్మ‘కరోనా’ను వెంటేసుకొచ్చావు
కాని ప్రపంచం మొత్తం మీద, అనేక అణుబాంబుల్ని మించిన
విస్మయ రోగ విస్ఫోటనం గావించావు!
విపణి వీధుల్నే గాక
విద్యాసంస్థల్నీ విరాగుల్ని జేశావు.
అన్ని రంగాల్నీ ఆర్థికంగా దెబ్బతీశావు!
నిర్దయగా ఎందరెందర్నో
కాలగర్భంలో కలిపేశావు!
కన్నవారిని– కట్టుకున్నవారినీ
కడసారి చూపులకూ దూరం చేశావు
పలకరింపులూ–పరస్పర కరచాలనాలూ లేకుండా చేశావు
వార్తా పత్రికల్నీ వరుసబెట్టి కుదించేశావు
ఉత్పవాల్ని – పెళ్లిళ్లనూ
మత్సరంతో మానిపించేశావు
ఎవరి నుంచి ఎలా అంటుకుంటావో తెలియక
ఎక్కడి వారినక్కడే నిలిపేశావు
సుప్రసిద్ధ కవుల్నీ–గాయకుల్నీ
ఆశ్చర్యంగా భూస్థాపితం చేశావు!
అందుకే నీకు మార్యాదగా
వీడ్కోలు చెప్పాలంటే మనస్కరించడం లేదు
ఇక ‘వ్యాక్సిన్’తో వచ్చే
సరికొత్త సంవత్సరమా!
నీవైనా ఏర్పడ్డ లోటును భర్తీ చేయి!
ఆరోగ్య ప్రదాయినిగా అడుగేయి!!
కల్మష గతాన్ని కాస్తా
సత్కర్మల ‘శానిటైజర్ల’తో కడిగేయి!
డా.వడ్డేపల్లి కృష్ణ