‘సాంకేతికత’కు చెరగని చిరునామా
ABN , First Publish Date - 2021-05-21T06:12:09+05:30 IST
రాజకీయాలను వ్యాపకంగా మలుచుకోవాలని రాజీవ్ గాంధీ ఎన్నడూ అనుకోలేదు. వాటిపై ఆసక్తి కూడా లేదాయనకు. పుస్తక పఠనం, మరీ ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ గ్రంథాలు...

రాజకీయాలను వ్యాపకంగా మలుచుకోవాలని రాజీవ్ గాంధీ ఎన్నడూ అనుకోలేదు. వాటిపై ఆసక్తి కూడా లేదాయనకు. పుస్తక పఠనం, మరీ ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్ గ్రంథాలు ఆయనకు ఇష్టం. సంగీతం, ఫోటోగ్రఫీపై ఎనలేని మక్కువ. దేశ తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ పదవి చేపట్టినప్పటికి రాజీవ్‌గాంధీకి మూడేళ్ళు. తండ్రి ఫిరోజ్ గాంధీ, తల్లి ఇందిరా గాంధీ నాయకత్వ పటిమను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఆయనది.
రాజీవ్‌గాంధీకి చిన్నతనం నుంచే విమాన ప్రయాణం మీద ప్రీతి. లండన్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని భారత్ వచ్చిన తరువాత కమర్షియల్ పైలట్‌గా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో జీవితం ప్రారంభించారు. చుట్టూ రాజకీయ కోలాహలం ఉన్నా, తల్లి నివాసంలోనే తానూ ఉన్నా రాజీవ్ అవేమి పట్టించుకోకుండా పైలట్ వృత్తిలోనే నిమగ్నమైనారు. ఆ వృత్తిలో ప్రశాంతంగా ఉండగా, 1980లో సోదరుడు సంజయ్ గాంధీ విమానప్రమాదంలో మరణించడంతో, అప్పటివరకు ఇందిరాగాంధీకి చేదోడువాదోడుగా ఉన్న సంజయ్ స్థానాన్ని భర్తీచేయవలసిందిగా, రాజకీయాల్లోకి రావలసిందిగా రాజీవ్‌పై ఒత్తిడి పెరిగింది. మొదట్లో కాదన్నా, తరువాత తలొగ్గక తప్పలేదు. అమేథీ నియోజవర్గానికి జరిగిన ఉపఎన్నికలో విజయం సాధించడం ద్వారా రాజకీయప్రవేశం జరిగింది.
1982 నవంబర్‌లో భారతదేశం ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారీ మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలన్నీ రాజీవ్ విజయవంతంగా పూర్తిచేశారు. అదేసమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియను భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇందిరాగాంధీ దారుణహత్యకు గురికావడంతో, దేశం యావత్తు శోకసంద్రంలో మునిగిన తరుణంలో పార్టీ సభ్యుల కోరికపై, ప్రజాభీష్టం మేరకు నలభైయేళ్ళ వయసులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రాజీవ్. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన ప్రభుత్వాధినేతల్లో రాజీవ్‌గాంధీ ఒకరు. వెనువెంటనే లోక్‌సభ ఎన్నికలకు ఆదేశించి, నెలరోజుల ప్రచారంలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అలుపు, అలసట లేకుండా ప్రయాణించారు. 250 సభల్లో ప్రసంగించి, కోట్లాది మందిని కలిశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. అప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కంటే రాజీవ్ సారథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓట్ల శాతాన్నీ, 401 లోక్‌సభ స్థానాలనూ సాధించింది.
రాజీవ్ ఆధునిక భావాలున్న నాయకుడు. అత్యాధునిక సాంకేతికత పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ. దేశ ప్రధానిగా పలు సంస్కరణలు చేపట్టి దేశం దశ -దిశ మార్చిన ఘనత ఆయనది. దేశంలో ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధికి పునాదులు వేసిన నాయకుడు ఆయన. అత్యాధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికీ, దేశ టెలీ నెట్‌వర్క్ అవసరాలు తీర్చడానికి 1984లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి–డాట్) స్థాపించారు. ఈ సి–డాట్ దేశంలోని పట్టణాలు, గ్రామాల కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. పబ్లిక్ కాల్ ఆఫీస్ (పి.సి.ఓ)లు గ్రామీణ ప్రాంతాలను బయట ప్రపంచంతో అనుసంధానించి గ్రామాల్లో వినూత్నమార్పులకు బీజం వేశాయి. 1986లో మహానగర్ టెలిఫోన్ నిగం లిమిటెడ్‌ని స్థాపించారు రాజీవ్. ఇది దేశ టెలిఫోన్ నెట్‌వర్క్ వ్యాప్తికి దోహదపడింది. నీరు, అక్షరాస్యత, రోగనిరోధకత, పాలు, చమురు, విత్తనాలకు సంబంధించి ఆరు టెక్నాలజీ మిషన్లను రాజీవ్ దేశానికి అంకితం చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని అనుబంధ రంగాల్లో కంప్యూటరీకరణను ప్రోత్సహించారు. రైల్వే, విమానయానం, రక్షణ వంటి రంగాలు ఆధునికీకరణకు నోచుకున్నాయి.
యువత రాజకీయాల్లోకి రావాలని పరితపించిన రాజీవ్, ఆ దిశగా రాజ్యాంగ సవరణ చేసి, ఓటుహక్కు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. తద్వారా యువత స్వయంగా ఎంపీలు, ఎమ్మేల్యేలుగా పోటీచేయడానికీ, యువకులను నేతలుగా ఎన్నుకోవడానికీ వీలు కల్పించారు. ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్ల్లడానికి వీలుగా పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునాది వేశారు. 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునికీకరించటానికీ, విస్తరించటానికి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకటించారు. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రతిభావంతుల్లో అత్యుతమైన వారిని వెలికితెచ్చారు రాజీవ్. ఈ పాఠశాలలు 6 నుండి 12వ తరగతి వరకు గ్రామీణ ప్రజలకు ఉచిత నివాస విద్యను అందిస్తున్నాయి. పలు విప్లవాత్మకమైన చర్యలు, నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపి, ప్రపంచపటంలో నిలిపిన మహనీయుడు రాజీవ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా, విశాఖపట్నం నుండి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో అడుగుపెట్టి, తనచుట్టూచేరిన వారిని ఆత్మీయంగా పలుకరిస్తున్న తరుణంలో, బాంబుపేలుడులో కన్నుమూశారు ఆయన. 1991 మే 21న దేశం యావత్తూ దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ సమాజంపైనా, రాజకీయాలలోనూ తనదైన చెరగని ముద్ర వేసిన భారతరత్నం రాజీవ్.
రవికాంత్ నూతలపాటి
(నేడు రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి)