అన్నదాతలను తొక్కిన అహంకార రథం!

ABN , First Publish Date - 2021-10-07T06:32:45+05:30 IST

కార్టూనిస్టు సందీప్ అధ్వర్యుకు అశోకుడు గుర్తుకు వచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ‘లైన్ ఆఫ్ నో కంట్రోల్’ శీర్షికలో రెండు రోజుల కిందట వేసిన కార్టూన్‌లో పశ్చాత్తప్తుడైన అశోకుడిని చిత్రించాడు....

అన్నదాతలను తొక్కిన అహంకార రథం!

కార్టూనిస్టు సందీప్ అధ్వర్యుకు అశోకుడు గుర్తుకు వచ్చాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ‘లైన్ ఆఫ్ నో కంట్రోల్’ శీర్షికలో రెండు రోజుల కిందట వేసిన కార్టూన్‌లో పశ్చాత్తప్తుడైన అశోకుడిని చిత్రించాడు. కళింగ యుద్ధంలో హింసకు పాల్పడినందుకు కుమిలిపోయే అశోకుడు కాదు. మొన్న ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘాతుకానికి చింతిస్తున్న అశోకుడు. ‘‘నా చక్రాన్ని మళ్లీ కనుగొనవలసిన అవసరం ఏమైనా ఉండిందా’’ అన్నది ఆ వ్యంగ్య చిత్రంలో వ్యాఖ్య. మళ్లీ మొదటికి రావడం, చేసిన పనే చేయడం అన్న ప్రతికూల అర్థాలు, మొదలు నుంచి నిర్మించుకుంటూ రావడం అన్న సానుకూల అర్థం కూడా కలిగిన ‘రీఇన్వెంటింగ్ ద వీల్’ అన్న జాతీయాన్ని అశోకుడి చక్రానికి, లఖింపూర్ ఖేరీలో రైతుల మీదుగా దూసుకుపోయిన వాహన చక్రానికి ఆ కార్టూన్ అన్వయిస్తుంది. భారత రాజ్య అధికారిక చిహ్నమైన అశోకచక్రం, ఆ చక్రవర్తి విశ్వసించి, ప్రచారం చేసిన కరుణ, సమభావం వంటి విలువలకు ప్రతీక. ఆ చక్రం మానవ పురోగతికి కూడా చిహ్నం. కానీ, దాన్ని నిరసనపై దాడిచేసే ఆయుధంగా వాడటమా?


ఈ సందర్భంలో విష్ణుకుండిన రాజులలో సుప్రసిద్ధుడైన మాధవ వర్మ గుర్తుకు వస్తున్నాడు. రహదారి పక్కన ఒక తల్లి బిడ్డను పక్కన పెట్టుకుని చింతపండు విక్రయిస్తోంది. చింతపండు అమ్ముతోందంటే, ఆమె కూడా ఒక మోస్తరు రైతే అయి ఉంటుంది. రాజకుమారుడి రథం అదుపు తప్పో, అసలు అదుపే లేకనో వీరి మీదికి దూసుకువచ్చింది. పిల్లవాడు చనిపోయాడు. ఆ నేరానికి పరిహారంగా, తన కుమారుడికి మరణశిక్ష విధించాడు మాధవవర్మ. అందరి ప్రాణాలూ సమానమైనవే అని అతను ఆచరణలో చూపాడు. మాధవవర్మ న్యాయబుద్ధికి దేవుడు సంతోషించి, కనకవర్షం కురిపించి, మృతులు ఇద్దరినీ బతికించాడని కథలు చెబుతారనుకోండి. 


ఇక్కడ బాధపడీ బాధ్యత తీసుకునీ తిరిగి జరగకుండా నివారించడానికి తపనపడే అశోకుడూ లేడు. న్యాయబుద్ధి చూపే మాధవవర్మ కూడా ఎవరూ లేరు. ఈ దేశానికి కావలసిన ధర్మమేమిటో, న్యాయమేమిటో కనీసపు ఊహ కూడా లేకుండా, ఆధ్యాత్మిక అభినయాలతో రాజకీయాలు చేసే పాలకులు మాత్రమే నేటి ప్రజలకు ప్రాప్తించారు. సంసారం జంఝాటం అని, భవబంధాలు స్వార్థం పెంచుతాయని సన్యాసం పుచ్చుకోకుండానో, పుచ్చుకునో అకుటుంబీకులుగా ఉన్నామని గొప్పలు చెప్పుకునే నేతలు, ఇప్పుడు ఏ బంధాలకు లోబడి నేరస్థులను రక్షిస్తున్నారో చెప్పాలి. నేరం చేసిందని కాదు, జనం చెడుగా అనుకుంటున్నందువల్లనే సీతను పరిత్యజించవలసి వస్తున్నది అని భావించిన రాముడికి అధికారప్రతినిధులుగా తమను తాము చెప్పుకునే నాయకులు, జనం నిందితులుగా నమ్ముతున్నవారిని కనీసం పదవి నుంచి తప్పించరేమి? ఏ ధర్మశాస్త్రాలు చదివి, ఏలికలకు, వారి పిల్లలకు ‘బారా ఖూన్ మాఫ్’ సదుపాయం అందిస్తున్నారు? 


కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా నియోజకవర్గంలో, ఆయన కుమారుడి ప్రమేయంతో నేరం జరిగింది. మామూలు నేరం కాదు. తమ ప్రజాప్రతినిధిని కలవడానికి, తమ సమస్యలు నివేదించడానికి, లేదా తమను కష్టపెడుతున్నందుకు నిరసనలు చెప్పడానికి వచ్చిన ప్రజల మీదికి మోటారువాహనాన్ని ఎక్కించి తొక్కించడం అన్నది మహా ఘోరం. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రాష్ట్రప్రభుత్వ సారథి రాగద్వేషాలను భేదభావాలను జయించవలసిన సర్వసంగపరిత్యాగి మాత్రమే కాదు, అన్నీ అనుకూలిస్తే మున్ముందు ఢిల్లీ గద్దెనెక్కగలిగేవాడు. దురదృష్టకరమైనది అని తప్ప యోగి ఆదిత్యనాథ్ మరొక్క మాట మాట్లాడలేదు. ఆ ప్రాంతంలోనే ఆ దగ్గరలోనే పర్యటనలో ఉంటారు కానీ, ప్రధాని నోట ఒక్క ‘అయ్యో’ వస్తే ఒట్టు. పైగా పరామర్శకు వెళ్లేవాళ్లందరినీ ఇళ్లలోనూ మార్గమధ్యంలోనూ కట్టడిచేయడం, దాన్నొక ఘనకార్యంగా సమర్థించుకోవడం. 


ఎక్కడైనా ఏదైనా జరగరానిది జరిగితే, బలహీనులపై అఘాయిత్యం జరిగితే, ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, బాధితులను పరామర్శించడం ప్రతిపక్షాల హక్కు మాత్రమే కాదు. బాధ్యత కూడా. పరస్పరం కలహించుకునే రాజకీయపక్షాల వైరం నడుమనే తమకు కొంత న్యాయానికి ఆస్కారం ఉంటుందని ప్రజలకు తెలుసు. ఇప్పుడు వీరాలాపాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ రైతుల మీద దాష్టీకానికి పాల్పడిన ఘటనలు మునుపు లేవా? మార్క్సిస్టు పార్టీయే బెంగాల్‌లో రైతుల మీద కాల్పులు జరిపినప్పుడు, మరే పార్టీ నుంచి మాత్రం సత్ర్పవర్తన ఆశించగలం? అయినప్పటికీ, గత చరిత్రను పక్కనబెట్టి, ప్రజలు వర్తమాన రాజకీయ ఆవేశాలకు ఆలంబన వెదుక్కొనవలసిందే! ప్రతిపక్షాలు కూడా తాము పులుకడిగిన ముత్యమని, తమ చరిత్రలో నెత్తుటి మరకలే లేవని చెప్పుకుంటూ రంగంలోకి దిగుతాయి. ఇప్పుడు లఖింపూర్ ఖేరీలో ఇంత హడావుడి జరగడానికి, సంఘటన తీవ్రతతో పాటు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు త్వరలో ఉండడం కూడా ముఖ్యకారణమే! రైతులపై వాహనాలను తోలి, మరణాలకు కారణమైన సంఘటన, యోగి ఆదిత్యనాథ్‌ను చాలా చాలా ఇబ్బంది పెట్టే అవకాశమున్నది. 


ఆ ఇబ్బంది మరింతగా పెరిగే అవకాశమున్నది, ఎందుకంటే, భారతీయ జనతాపార్టీ వ్యూహరచనా యంత్రాంగంలో ఏదో వైరస్ ప్రవేశించినట్టు అనుమానం కలుగుతోంది. కొత్తగా ఆలోచించలేకపోతున్నారు. లేదా చేసిన ఆలోచనలన్నీ ఖర్చయిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే, బాధితులకు మాటవరస సానుభూతి అయినా చెప్పకుండా, ఖలిస్తాన్ తీవ్రవాదులు నిరసనకారులలో ఉన్నారని, నిందితుడి తండ్రి అయిన కేంద్రమంత్రే వ్యాఖ్యానిస్తే ఏమిటి అర్థం? ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగితే, దాని పేరు చెప్పుకుని, ఉత్తరాఖండ్‌లో జాతీయ భద్రతాచట్టం (ఎన్ఎస్ఎ) వినియోగాన్ని పొడిగించారు. ఈ చట్టాన్ని ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నారు. జర్నలిస్టులను కూడా ఎన్‌ఎస్‌ఎ కింద బంధించిన ఘనత యుపి ప్రభుత్వానిదే. అన్నట్టు, హత్రాస్ సంఘటన జరిగినప్పుడు విధినిర్వహణలో భాగంగా సందర్శనకు వచ్చిన పాత్రికేయుడు కప్పన్ ఏడాది కిందట అక్టోబర్ 5, 2020 నాడు అరెస్టయి ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. లఖింపూర్ ఖేరీలో కూడా సంఘటన స్థలాన్ని, బాధితుల కుటుంబాన్ని చూడడానికి నాయకులకే కాదు, పాత్రికేయులకు కూడా అనేక ఆంక్షలు విధిస్తున్నారు. లఖింపూర్ మృతులలో ఒక జర్నలిస్టు కూడా ఉన్నాడు. వాహన హత్యాకాండలో నలుగురు రైతులు మరణించగా, ఆందోళనకారుల ప్రతీకార దాడుల్లో ముగ్గురు మరణించారు. ఈ సంఘటనపై ఒక వైపు రాజకీయంగా ఇబ్బంది పడుతూనే, ఇటువంటి సంఘటనలను నివారించడానికి నిరసనలు ఆందోళనలు ఆగిపోవాలని అత్యున్నత న్యాయస్థానంలో అటార్నీ జనరల్ కె.కె వేణుగోపాల్ వాదించారు. బీమా కోరేగావ్, షహీన్ బాగ్ ఆందోళనల విషయంలో కూడా అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా కుట్రకేసులు పెట్టడం, నిరసన శిబిరాలు తొలగించడం తెలిసినదే. 


ఒక రాజకీయ శక్తికి అన్నిటి కంటె గడ్డు కాలం ఎప్పుడంటే, దాని నైతిక బలం అట్టడుగుకు చేరినప్పుడు. లఖింపూర్‌లో జరిగిన దారుణం, ప్రభుత్వాన్ని నైతిక బలహీనతలోకి నెట్టివేసింది. ఇంత కంటె పెద్ద దారుణాలు, దుర్మార్గాలు ఈ ప్రభుత్వాల హయాంలో జరిగి ఉండవచ్చు. కానీ, రైతులను తొక్కించి చంపడం అన్నది సమాజానికి అంత తొందరగా జీర్ణం కాదు. పనామా కాగితాలు, పండోరా రహస్యాలు, యుద్ధవిమానాల కమిషన్లు, ఒకే కార్పొరేట్ సంస్థకు పక్షపాత అభిమానాలు.. ఇవన్నీ వేరు. లఖింపూర్ వేరు. ఆదివారం నాటి సంఘటన మాత్రమే కాదు, దాని మీద ప్రభుత్వం తప్పులు మీద తప్పులు చేస్తూ, తనను తాను మరింతగా నైతికంగా దిగజార్చుకుంటున్నది. గురువారం నాడు సుప్రీంకోర్టు ఈ అంశంపై ఇచ్చే ఆదేశాలు ఎట్లా ఉంటాయో అని యోగి ప్రభుత్వం భయంగా, ప్రతిపక్షాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. 


ప్రతిపక్షాలు అంతగా నడుం కడుతున్నాయంటే, అక్కడ రాజకీయ లబ్ధి అవకాశాన్ని కనిపెట్టడమే కాక, అధికారపక్షం బలహీనతను కూడా పసిగట్టాయని అర్థం. బాధిత కుటుంబాలకు బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి పరిహారాలు ప్రకటిస్తున్నాయి. అంతెందుకు, బిజెపి పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన మీద తెలంగాణలో కెటిఆర్ వంటి అధికార పక్షముఖ్యుడు మాట్లాడక తప్పలేదంటే, లఖింపూర్ విషాదానికి చాలా పర్యవసానాలున్నాయని అర్థం చేసుకోవాలి.


కె. శ్రీనివాస్

Updated Date - 2021-10-07T06:32:45+05:30 IST