ఎయిడెడ్‌ విలీనం...ఒక వికృత చర్య

ABN , First Publish Date - 2021-10-29T06:15:04+05:30 IST

నిరసన సెగ రాజుకోవాలే గానీ క్షణంలో గుప్పుమంటుంది. ప్రజాగ్రహం వెల్లువలా పాకుతుంది. అంతర్లీనంగా మరుగుతున్న అలజడి ఎల్లకాలం అక్కడే ఉండిపోదు. ఒక్కో నిప్పురవ్వ ఎగసిపడుతోంది...

ఎయిడెడ్‌ విలీనం...ఒక వికృత చర్య

నిరసన సెగ రాజుకోవాలే గానీ క్షణంలో గుప్పుమంటుంది. ప్రజాగ్రహం వెల్లువలా పాకుతుంది. అంతర్లీనంగా మరుగుతున్న అలజడి ఎల్లకాలం అక్కడే ఉండిపోదు. ఒక్కో నిప్పురవ్వ ఎగసిపడుతోంది. ఇపుడు జరుగుతున్నదదే. ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనం అనే ఒక అనాలోచిత అసందర్భ చర్య ప్రభుత్వ నెత్తికి చుట్టుకోవడం తప్పనిసరి అనిపిస్తోంది. అన్నింటా లెక్కలేనితనం పనికిరాదు. మొండిగా ముందుకుపోవడం పాఠాలు నేర్వలేకపోవడం సహించరాని నేరమే. 


వదాన్యులు భూములిచ్చారు. భవనాలు నిర్మించారు. సకల సదుపాయాలు కల్పించారు. సామాజిక ప్రయోజనం ఆశించి చేసిన పని. ఆ మేరకు ప్రభుత్వం ఖర్చు తగ్గించారు. ప్రభుత్వం ఎయిడెడ్‌ చట్టం తీసుకొచ్చి ఉపాధ్యాయుల్ని సిబ్బందినీ నియమించింది. సమాజానికి మహోపకారం జరిగింది. ఆశించిన ఫలితాలొచ్చాయి. లక్షలాది మందికి విద్యాబోధన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు సమాంతర వ్యవస్థగా పనిచేసి ఘనతకెక్కాయి. తమ ప్రాంత విద్యాభివృద్ధికి ప్రజా శ్రేయస్సుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలు దశాబ్దాలుగా ఎనలేని విద్యాసేవ చేయడం జగమెరిగిన సత్యం.


ఉన్నట్టుండి పిడుగుపాటులా ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనం వార్త మేధావులకు సైతం విస్మయం కలిగించింది. ఈ నిర్ణయం తీసుకోడానికి ఏ మేరకు రాజకీయ ఆర్థిక కారణాలున్నాయో తెలియదు గానీ ఇది దారుణమైన నిర్ణయంగా భావించారు. రకరకాల ఊహాగానాలు చలామణీ అవుతున్నాయి. 


ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు సమకూరుస్తుంది. పర్యవేక్షణ కూడా ప్రభుత్వ విద్యాధికారులే చేస్తారు. వీరు గాక విద్యావిషయాలు చూసుకోడానికి ఎయిడెడ్‌ యాజమాన్యం పరిమిత హక్కులతో అజమాయిషీ చేస్తుంది. ఒకరకంగా వీరు నిమిత్తమాత్రులే. ఏ విధమైన చెప్పుకోదగిన అధికారాలుండవు. నిర్మాణాత్మక సలహాలు మాత్రం ఇవ్వగలదు. ఫలితంగా క్రమశిక్షణాయుత విద్యకు పునాదులు పడ్డాయి. మంచి బోధనతో దశాబ్దాలుగా విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయాలుగా పేరుగాంచాయి.


ప్రస్తుత కాలంలో విద్యకు ప్రాధాన్యం పెరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. ఉన్నంతలో మంచి పాఠశాలలు ఎంపిక చేసుకుని చదివిస్తున్నారు. జీవనగమనంలో మొదటి ప్రాధాన్యత విద్యకే ఇస్తున్నారు. అందుకోసం మానసికంగా శారీరకంగా శ్రమ పడుతున్నారు. ఆస్తులు కూడా అమ్మడానికి సిద్ధపడుతున్నారు. దూరప్రాంతాలకు సైతం పంపిస్తున్నారు. మరి ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? ఫీజులు చెల్లించనక్కర్లేని ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. వీటిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉంటారు. అన్నీ ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తాయి. అయితే నాడు–నేడు వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు వర్తింప చేయడం లేదు. ఇందులో పనిచేసే ఉపాధ్యాయులకు పిఎఫ్‌ వంటి సదుపాయాలు ఉండవు. విద్యాశాఖాధికారులుగా ప్రమోషన్లు ఉండవు. ఇదే కారణంగా ఈ సిబ్బంది ఎయిడెడ్‌ విలీనం వార్త రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి అంగీకార పత్రాలు ఇచ్చేశారు. అయితే ఎయిడెడ్‌ యాజమాన్యం వారు తమ ఆస్తుల్ని వదులుకోడానికి సిద్ధపడలేదు. అలాగే ఆర్థిక స్తోమతు, వ్యాపార ఆలోచనలు లేకపోయిన కారణంగా పాఠశాలలు నడపడానికి తమ అశక్తతను తెలియజేశారు. ఈ మొత్తం తతంగంలో ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం కూడా నెరవేరలేదు. కానీ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. 


గ్రామంలో పాఠశాల ఉంటుంది. పాఠశాల నడిచే మార్గాలు మూసుకుని పోయాయి. విద్యార్థుల్ని పక్క గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోకి సర్దుబాటు చేస్తున్నారు. ఇదెంత హాస్యాస్పదమో ఒక ఎయిడెడ్‌ పాఠశాల వాస్తవిక పరిస్థితి చూస్తే అర్థమౌతుంది. పాఠశాల పేరు ఎస్‌డివివిఆర్‌ఆర్‌ ఎయిడెడ్‌ ఉన్నతపాఠశాల. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలంలోని కోలంక గ్రామం. 1951లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో దాతల సహకారంతో నిర్మించారు. ఆనాడు విద్యా సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్న రోజుల్లో ఎంతో దూర ప్రాంతాల నుంచి బంధువుల ఇంట ఉండి ఎంతోమంది చదువుకున్నారు. ఒకప్పుడు 1400 మంది విద్యార్థులతో అలరారింది. ఒక్కో తరగతి నాలుగు సెక్షన్లుండేవి. ఎంతో క్రమశిక్షణ, అంకితభావంతో విద్యార్థులను తీర్చిదిద్దారు. విలీన ప్రక్రియలో భాగంగా ప్రయివేటుగా నడుపుకోవచ్చని ఫీజులు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం వారు చెప్పినప్పటికీ యాజమాన్యం చేతులెత్తేసింది. స్థితిమంతులు బస్సుల్లో ప్రవేటు కార్పొరేటు పాఠశాలల్లో ఇప్పటికే చేరిపోయారు. ఇక ఫీజులు కట్టలేని కూలి చేసుకునే అట్టడుగు ప్రజలు మిగిలారు. బాలికల సంఖ్య ఎక్కువ. కనీస విద్యాబుద్ధులు కోసం తల్లిదండ్రులు చేర్పిస్తారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుయ్యేరు గ్రామం లేదా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంజరం గ్రామాలకు పంపాల్సి ఉంటుంది. కిక్కిరిసిన రవాణా వాహనాలు తిరుగాడే గతుకుల రహదారులు. ఆడపిల్లల్ని అంతంత దూరం పంపలేని అశక్తతలు. ఏతావాతా చెప్పేదేమంటే అర్థంతరంగా చదువులకు పుల్‌స్టాపులు పెట్టడమే మిగిలింది. ఈ మొత్తం పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఉదాహరణ ఒక వాస్తవిక దృష్టిని తెలియజేయడానికే చెప్పడం జరిగింది.


ప్రభుత్వ విద్యా ప్రాధాన్యతల్లో అక్షరాస్యత పెంచాలనే ఆశయం ఉంటుంది. చదువును ప్రోత్సహించాలి. అందరూ చదువుకోవాలి. ‘అమ్మ ఒడి’ అక్కర్లేదు మాకు పాఠశాలలే కావాలని నినదిస్తున్న సంఘటనలు గమనించాలి. ప్రభుత్వం విలీన ప్రక్రియను తక్షణం విడనాడాలి. పునారాలోచన చేయాలి. మొండిగా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు ప్రవర్తించకూడదు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని పెద్ద మనసుతో యథాప్రకారం ఎయిడెడ్‌ విద్యాసంస్థల్ని కొనసాగించాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కలగజేసుకోవాలి. విద్యావంతులు నచ్చచెప్పాలి. విద్యార్థులకు జరిగే నష్టనివారణకు పూనుకోవాలి. లేదంటే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని గ్రహించాలి. 

దాట్ల దేవదానం రాజు

విశ్రాంత ఉపాధ్యాయుడు

Updated Date - 2021-10-29T06:15:04+05:30 IST