కలవరపరుస్తున్న కొత్త ‘కాబూలీవాలా’ !

ABN , First Publish Date - 2021-08-20T06:22:14+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌లో మతతత్వ తాలిబాన్లు మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు..

కలవరపరుస్తున్న కొత్త ‘కాబూలీవాలా’ !

అఫ్ఘానిస్తాన్‌లో మతతత్వ తాలిబాన్లు మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. గత నెల రోజులుగా ఆ దేశంలో వేగంగా సంభవిస్తున్న పరిణామాలను గమనిస్తే తలెత్తే ఒక మౌలిక ప్రశ్న: మతమౌఢ్యాన్ని యుద్ధంతో ఓడించగలమా? 2021 ఆగస్టు 15న భారతదేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటూ ఉండగా అప్ఘానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో తాలిబాన్‌ దళాలు జయపతాక ఎగురవేశాయి. అఫ్ఘాన్ దేశాధ్యక్షుడు ఆఫ్జల్‌ ఘని పరారయ్యారు. ఇది, అమెరికా సామ్రాజ్యవాదానికి ఈ శతాబ్దిలో రాజకీయంగానూ, సైద్ధాంతికంగానూ ఎదురైన ఘోర పరాజయం. కాబూల్ లోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది ఉన్న పళంగా ఇళ్లు ఖాళీ చేసి అందినంత సామాను తీసుకుని కాబూల్‌ విమానాశ్రయానికి పరుగెడుతున్న దృశ్యాలు దిగ్భ్రాంతి గొలిపాయి. 1975లో వియత్నాం యుద్ధంలో పరాజయాన్ని చవిచూశాక అమెరికా సిబ్బంది సైగాన్‌ విమానాశ్రయానికి పరుగులు తీసిన సందర్భంతో కాబూల్ ఉదంతాన్ని పోల్చవచ్చు. తాలిబాన్‌ దళాల ధాటికి మూడు లక్షలకు పైబడి ఉన్న అఫ్ఘాన్ సైన్యం పేకమేడలా కుప్పకూలింది. ఇదేదో యుద్ధంలో ఓటమివలన కుప్పకూలటం కాదు. అధికారిక సైన్యంలో ప్రధాన భాగం తాలిబాన్లతో చేరిపోయింది! దాంతో ప్రతిఘటన లేకుండా అఫ్ఘాన్ తాలిబాన్ల వశమైంది. 


ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ అమెరికా రెండు దశాబ్దాల క్రితం తాలిబాన్ పాలనలో ఉన్న అఫ్ఘాన్‌పై యుద్ధం ప్రారంభించింది. ఇరవయ్యేళ్ల తర్వాత నేడు అఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబాన్‌ పతాకాలు మళ్ళీ రెపరెపలాడుతున్నాయి. 1884 మార్చి నుంచి 1885 జనవరి వరకు జరిగిన ఒక యుద్ధంలో ఈజిప్ట్‌లో భాగంగా ఉన్న ఖార్టోమ్‌ను సూడాన్‌ రాజు మొహ్మద్‌ మెహది దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సంఘటనతో రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్య పతనం ఆరంభమైంది. తాలిబాన్‌ దళాలు కాబూల్‌ను ఆక్రమించుకోవడం కూడా అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య పతనానికి గుర్తుగా ప్రపంచ వ్యవహారాల అధ్యయనపరులు పలువురు భావిస్తున్నారు. 


అఫ్ఘాన్ పరిణామాల పర్యవసానాలను మూడు కోణాల్లో అర్థం చేసుకోవాలి. 2001లో తాలిబాన్ల మద్దతుతో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ కాయిదా తమ దేశంలో నిర్వహించిన ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ ఎండూరింగ్‌ ఫ్రీడం’ ను అమెరికా ప్రారంభించింది. సుమారు 10 లక్షల కోట్ల డాలర్లు ఈ యుద్ధానికి వెచ్చించింది. అమెరికా సేనలు, నాటో దళాలు అఫ్ఘాన్‌ పౌరులు, తాలిబాన్లతో సహా దాదాపు రెండు లక్షల మంది ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. 


అఫ్ఘానిస్తాన్‌ను మతోన్మాదుల ఉక్కు పిడికెళ్ల నుంచి విముక్తి చేయటానికి అమెరికా మొదలు పెట్టిన యుద్ధం ‘నూతన శుభోదయం’ నినాదంతో ఇరాక్‌నూ ఆక్రమించుకునేందుకు దారితీసింది. ఇరాక్‌లోని చమురు బావులన్నీ అమెరికా కంపెనీల వశమయ్యాయి. దాదాపు నాలుగేళ్ల క్రితమే ఇరాక్‌ను, ఇస్లామిక్‌ రాజ్య నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న మతోన్మాద ఉగ్రవాద మూకలు స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ గుత్తపెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాలు తీరిన తర్వాత ఇరాక్‌లో మతోన్మాద ఉగ్రవాద సంస్థలతో వాషింగ్టన్ పాలకులు రాజీ కుదుర్చుకున్నారు. ఇరాక్‌ను క్రమంగా ఆ ఉగ్రవాద సంస్థలకు అప్పగించారు. కుడిఎడంగా అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలు కూడా అదే వరుసలో నడుస్తున్నాయి. ఈ కాలంలోనే నాటో సేనల సహకారంతో పశ్చిమాసియాలోని ఒక్కో అరబ్‌ దేశాన్నీ అమెరికా ఆక్రమించుకుంటూ పోయింది. ఆక్రమణకు లొంగని దేశాల్లో అంతర్యుద్ధం సృష్టించింది. ఆయా ఆక్రమిత దేశాల్లోని చమురు వనరులపై ఆధిపత్యాన్ని ఖాయం చేసుకుంటూ అమెరికా ముందుకు సాగింది. 


ఉగ్రవాదంపై యుద్ధం ఇస్లాంపై యుద్ధంగా రూపాంతరం చెందింది. ఈ పరిణామం పలు దేశాల్లో రకరకాల మతోన్మాద సిద్ధాంతాలు ప్రజామోదం పొందటానికి దారితీసింది. ఈ శతాబ్ది ప్రథమ, ద్వితీయ దశకాలలో ఈజిప్ట్‌ మొదలు పలు అరబ్బు దేశాల్లో మొదలైన ప్రజాస్వామిక ఉద్యమాలను కూడా అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా అణచివేసింది. చెస్‌ బోర్డులో పావులు కదిపినట్లు తనకు నచ్చిన తాను మెచ్చిన తనకు నమ్మిన బంటుగా పడి ఉండే నాయకులు దొరికేంత వరకూ ఆయా దేశాల్లో రాజకీయ అస్థిరతకు తెరతీసింది. పెట్టుబడిదారి విధానం ఓ ఆధునిక సమాజ నిర్మాణ సూత్రం అనీ, ప్రజాస్వామ్యం రాజకీయ నిర్ణయాల్లో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యానికి అవకాశమిచ్చే పాలనా రూపం అనీ ఊదరగొట్టిన అమెరికా దాని పనుపున పని చేసే ఉదారవాద మేధావుల వాదనలన్నీ ఈ ఇరవైయేళ్ళ ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో పటాపంచలయ్యాయి.


అఫ్ఘానిస్తాన్‌ తాలిబాన్ల వశం అయిన నేపథ్యంలో మనం ఆందోళన చెందాల్సిన రెండో అంశం అంతర్జాతీయ శాంతి భద్రతలు. ప్రత్యేకించి పశ్చిమాసియాలో శాంతి భద్రతలు. అలాగే ప్రజల మానవహక్కుల గురించిన అంశం. అఫ్ఘానిస్తాన్‌ను ప్రజాస్వామిక రాజ్యంగా మార్చటం అమెరికా సాగించిన యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించి 2020 నాటి ఎన్నికల్లో గెలుపొందాలన్న ఆశతో ట్రంప్‌ 2021 సెప్టెంబరు నాటికి అఫ్ఘానిస్తాన్‌ నుంచి అమెరికా సేనలను వెనక్కు రప్పిస్తామని వాగ్దానం చేశాడు. తదనుగుణంగా అటు నాటో దేశాలు, ఇటు అఫ్ఘానిస్తాన్‌, తాలిబాన్లతో రహస్య చర్చలు సాగించారు. చివరకు దోహాలో కుదిరిన ఒప్పందం ప్రకారం 2021 సెప్టెంబర్ కంటే ముందే అఫ్ఘాన్ నుంచి నిష్క్రమిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ రెండు దశాబ్దాల్లో తన ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా అమెరికా వ్యవహరించటంతో అఫ్ఘానిస్తాన్‌లో పురివిప్పుకున్న ప్రజాస్వామిక వ్యవస్థలు సంస్థలు ఏమీ లేవు. మతోన్మాదాన్ని ఎదుర్కోవటానికి మార్కెట్‌ ఒక ఆయుధం కాదన్న వాస్తవాన్ని గత రెండు దశాబ్దాల అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. 


అమెరికా సేనలు అఫ్ఘానిస్తాన్‌ నుంచి వెనక్కు వస్తున్నాయన్న విషయం స్పష్టమయ్యాక ‘న్యూయార్క్‌ టైమ్స్’ పత్రిక ప్రతినిధి ఫ్రెడరిక్‌ కగన్‌ దాదాపు రెండు నెలలు అఫ్ఘాన్‌లో పర్యటించాడు. సైనిక ఉపసంహరణ నిర్ణయానికి ఇది సమయం కాదని వివరిస్తూ అనేక వార్తలు రాశాడు. అఫ్ఘానిస్తాన్‌ దురాక్రమణ విఫలమైందని అమెరికా రక్షణశాఖ, పాలకవర్గం గుర్తించింది. దాంతో అఫ్ఘానిస్తాన్‌ పరిరక్షణ భారాన్ని ప్రపంచం మీద మోపుతూ 2020 ఫిబ్రవరిలో రష్యా, చైనా, భారత్‌, పాకిస్థాన్‌లతో అమెరికా ఓ ఒప్పందానికి వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే ఈ ఒప్పందంలో తాలిబాన్‌ కూడా ఒక భాగస్వామి! ఈ పరిణామాల నేపథ్యంలో ఆత్మస్థైర్యం పెరిగిన తాలిబాన్లు తిరిగి తమ పాత లక్షణాలు ప్రదర్శించటం ప్రారంభించారు. ఇప్పటికే మహిళలు పని చేయరాదనీ, విద్యార్థినులు బడికెళ్లరాదనీ ఇంకా అనేక మధ్యయుగాల మౌఢ్యానికి ప్రాతినిధ్యం వహిస్తూ అనేక ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల పర్యవసానమే గత వారం రోజులుగా అఫ్ఘానిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలు. వెరసి పశ్చిమాసియా తిరిగి మత మౌఢ్యానికి పెద్ద పీట వేసే శక్తులకు పట్టం కట్టబెట్టే వేదికగా మారింది. దీని పర్యవసానం అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు మానవ హక్కులపై ఎలా ఉంటుందన్నది ముందుముందు తేలనుంది. 


అఫ్ఘానిస్తాన్‌ పరిణామాల ప్రభావం మనదేశంపై ఎలా ఉండనున్నది? ఇది మనం ఆందోళన చెందాల్సిన మూడో అంశం. తాలిబాన్ల ఉనికి, అస్తిత్వం, ఆలోచన, నమ్మకాలు ఇస్లాం మతంతో ముడివడి ఉన్నాయి. భారతదేశంలో సమకాలీన రాజకీయాలు కూడా ఇస్లాం మత విశ్వాసులతో ముడివడి ఉన్నాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా భారత్‌ను ఒక హిందూ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్లు పెచ్చరిల్లుతున్నాయి. అఫ్ఘానిస్తాన్‌పై ఆధిపత్యం సంపాదించిన తాలిబాన్ల తొలి చర్య ఆ దేశాన్ని ఇస్లామిక్‌ దేశంగా ప్రకటించటం. 1996–2001 మధ్యకాలంలో బమియాన్‌ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన చరిత్ర కూడా తాలిబాన్ల స్వంతం. ఇటువంటి సంఘటనలు, సందర్భాలు ప్రస్తావిస్తూ మనదేశంలో మైనారిటీలు, భిన్నాభిప్రాయాలు కలిగిన ప్రజాస్వామిక వాదులపై ఒత్తిళ్లు పెంచే ప్రమాదం పొంచి ఉంది. అఫ్ఘానిస్తాన్‌లో ఇస్లాం మతతత్వం ఆధిపత్యం సాధించింది కాబట్టి, మెజారిటీ ప్రజలు హిందువులు అయినందున మన దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటిస్తే వచ్చే ప్రమాదం ఏమిటన్న చర్చలు కొత్త ఉద్ధృతితో ముందుకు రానున్నాయి. ఇటువంటి చర్చలు చేసేవాళ్లు ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదిగా ఉన్న స్వాతంత్య్రోద్యమం, దాని స్ఫూర్తి, ఆ ఉద్యమం ముందుకు తెచ్చిన విలువలను ఆది నుంచి వ్యతిరేకించే వాళ్లే కావటం గమనార్హం. ఏది ఏమైనా అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలు అంతర్జాతీయంగా ముందుకు తెచ్చే కొత్త సమస్యలతో పాటు మనదేశంలో ప్రజాతంత్ర శక్తులకు కూడా కొత్త సవాళ్లు విసరనున్నాయి. దేశీయంగా మతోన్మాద శక్తులు విశృంఖలత్వానికి ఈ పరిణామాలు పునాదులు వేసే ప్రమాదం ఉంది. మతమౌఢ్యం, మార్కెట్‌ ఉన్మాదం చెట్టాపట్టాలేసుకుని తిరగనున్నాయి. ప్రజా చైతన్యం, ప్రజాస్వామిక వాదుల అప్రమత్తతే శరణ్యం.


కొండూరి వీరయ్య 

Updated Date - 2021-08-20T06:22:14+05:30 IST