ఐదు దశాబ్దాల రజక ఉద్యమానికి చిరునామా

ABN , First Publish Date - 2021-12-31T07:38:33+05:30 IST

ఐదు దశాబ్దాల రజక ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, ప్రభుత్వాల ద్వారా రజక సంక్షేమానికి ఎన్నో జీవోలు సాధించిన ఏకైక రజకనాయకుదు, తెలుగు రాష్ట్రాలలో ఒకేఒక్కడు డా.యం.అంజయ్య (80) ఉమ్మడి నెల్లూరు జిల్లా...

ఐదు దశాబ్దాల రజక ఉద్యమానికి చిరునామా

ఐదు దశాబ్దాల రజక ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, ప్రభుత్వాల ద్వారా రజక సంక్షేమానికి ఎన్నో జీవోలు సాధించిన ఏకైక రజకనాయకుదు, తెలుగు రాష్ట్రాలలో ఒకేఒక్కడు డా.యం.అంజయ్య (80) ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఒంగోలు తాలూకా, దశరాజుపల్లె గ్రామంలో పేద రజక కుటుంబంలో జన్మించారు. ఆర్‌.ఎం.పి. డాక్టర్‌గా మంచి వైద్యునిగా పేరు తెచ్చుకుంటూనే, రజకజాతిపై జరుగుతున్న వివక్షతపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ రజక నాయకునిగా అవతరించారు. ఆంధ్రప్రదేశ్‌ తొలి రజక సంఘమైన రజక జనసేవా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1981లో ‘ఆంధ్రప్రదేశ్‌ రజక అభివృద్ధి సంస్థ’ను స్థాపించారు. నాటి నుంచి తుది శ్వాస విడిచేవరకు, రజక అభివృద్ధి ఆకాంక్షించిన ‘రజకరత్న’ అంజయ్య గారు. 


నాటి ముఖ్యమంత్రి పి.వి. నరసింహరావు గారు ఒంగోలు సభలో ఆయనకు ‘రజకరత్న’ బిరుదును ప్రదానం చేశారు. దేశంలో మొట్టమొదటిసారి ‘రజక ఫెడరేషన్‌’ అంజయ్య గారి నిరాహారదీక్షతో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి హయాంలోను, అంతకుముందు టంగుటూరి అంజయ్య పాలనలోను, అలాగే రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలోను రజక ఫెడరేషన్‌ చైర్మన్‌గా అంజయ్య రజక సహకార సంఘాలకు ఎన్నో సేవలందించారు. తెలుగుదేశం పాలనలో ఎన్‌.టి.రామారావు గారు అంజయ్య గారిని ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించారు. ఎందరో ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రుల వద్ద సన్నిహితంగా మెలిగిన రజక సంఘ నాయకుడు అంజయ్య మాత్రమే అనడం అతిశయోక్తి కాదు! రాజశేఖర్‌ రెడ్ది హయాంలో రజక ఫెడరేషన్‌ ద్వారా రజకులకు రూ.49కోట్ల రూపాయల ఋణాన్ని రద్దు చేయించారు. అలాగే తనను గురువుగా భావించే, మొట్టమొదటి రజకమంత్రి, బి.సి.సంక్షేమ శాఖామాత్యులు బసవరాజు సారయ్య ద్వారా రూ.90కోట్లను అంజయ్య తమ జాతికి అందించారు. 


సామాజిక, సాంఘిక దురాచారాలతో పెండ్లి సమయంలో రజకుల చేత పల్లకీ మోయించే ఆచారాలను నిరసిస్తూ– గోదావరి జిల్లాలలో, రాయలసీమలో, తెలంగాణలో ఆ పల్లకీలను తగులబెట్టి జాతిచైతన్యానికి ధైర్యాన్ని నూరిపోసిన రజక మహానేత అంజయ్య. గ్రామ బహిష్కరణలో కునారిల్లుతున్న తెలంగాణ రజకజాతి సంరక్షణకు అంజయ్య ఎన్నెన్నో పోరాటాలు చేశారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు గడప దాకా వచ్చిపోయినా ఏనాడూ బాధపడలేదు. 


19 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉన్న రజకుల మాదిరే తెలుగు రజకజాతిని కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇందిరాగాంధీ హయాం నుంచి నేటివరకు పోరాటం చేస్తూనే వున్నారు. 1985లో 96 మంది పార్లమెంటు సభ్యుల చేత సంతకాలు చేయించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. 1990 ప్రాంతంలో ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వచ్చి హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో నిర్మించిన ద్వారకమయి రజకకాలనీలో నివాసమేర్చరుచుకున్న అంజయ్య తెలుగు రాష్ట్రాలలో ఎన్నో రజక కాలనీలను ప్రభుత్వాల ద్వారా నిర్మించారు. చివరిదశలో లోయర్‌ ట్యాంక్‌బండులో తన కాలనీలో నిర్మించుకున్న సాయిబాబా గుడిలో సాయి సేవకునిగా జీవితాన్ని గడుపుతూ, డిసెంబరు 27, 2021న హైదరాబాద్‌లో కన్ను మూశారు. అంజయ్య లాంటి మహానేత సహచర్యంలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం.

వింజమూరు మస్తాన్‌బాబు

ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌  రజక అభివృద్ధి సంస్థ, నెల్లూరు.

Updated Date - 2021-12-31T07:38:33+05:30 IST