కొవిడ్‌ కాలంలో సం‘పన్నుల’ సమృద్ధి!

ABN , First Publish Date - 2021-08-20T06:11:20+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, కేంద్రప్రభుత్వ పన్ను ఆదాయం పెరగనుందని సి.ఐ.ఐ వార్షిక సమావేశంలో ఆర్థికశాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ చెప్పారు..

కొవిడ్‌ కాలంలో సం‘పన్నుల’ సమృద్ధి!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, కేంద్రప్రభుత్వ పన్ను ఆదాయం పెరగనుందని సి.ఐ.ఐ వార్షిక సమావేశంలో ఆర్థికశాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ చెప్పారు. కార్పొరేట్ల లాభాలు బాగా అధికమవడమూ, ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థీకృత రంగం పెరగడమే అందుకు కారణాలని తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల ఆదాయం పెరగడం అంటే, స్థూలంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని అంచనాకు వచ్చే అవకాశం వుంది. కానీ మన వాస్తవిక, నిత్య జీవితం దీనికి భిన్నమైన పరిస్థితిని మన ముందు ఉంచుతోంది. కొవిడ్‌-–19 పూర్వం నుంచే దిగజారుతున్న మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరింతగా దిగజారిందని సమస్త గణాంకాలూ చెబుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది, ప్రజల ఆదాయాలు పడిపోయాయి, తాము అత్యంత విలువైనదిగా భావించే బంగారాన్ని తాకట్టు పెట్టుకునే, అమ్ముకునే స్థితికి మధ్యతరగతి ప్రజలు వచ్చారు. ఆకలిచావులు పెరిగాయని గణాంకాలూ, జీవితాలూ చెబుతున్నాయి. మధ్య, చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమల దివాళాలు పెరిగిపోయాయి. వాటి మొండి బకాయిలు ఈ రోజు బ్యాంకులకు అదనపు బెడదగా మారాయి. గృహ ఋణాలూ, వ్యక్తిగత రుణాలూ, వాహన రుణాలూ, క్రెడిట్‌ కార్డుల రుణాలలోనూ మొండి బకాయిలూ భారీగా పెరుగుతున్నాయి. అంతిమంగా జీడీపీ సంఖ్య కూడా దిగజారిపోయే ఉంది. 


మరి ప్రభుత్వానికి పన్నుల ఆదాయం ఎలా పెరుగుతోంది? అసలు విషయం అక్కడే ఉంది...! ప్రత్యక్ష పన్నులు చెల్లించే కొద్ది మంది ఆదాయాలు ఈ కొవిడ్‌ కాలంలో కూడా పెరిగాయి. మెజారిటీ జనసామాన్యం స్థితి మాత్రం దిగజారింది. పేదలూ, చిన్న వ్యాపారులూ, చిన్న పరిశ్రమలను దెబ్బ తీసి - కార్పొరేట్లూ, ధనవంతులూ పెరిగిన కథ గత కొద్ది సంవత్సరాలుగా శరవేగంగా నడుస్తోంది. ఈ కథలోని భాగమే ధనవంతులూ కార్పొరేట్ల నుంచి వసూలు అయ్యే ఈ పన్ను ఆదాయం పెరుగుదల ఉపకథ!


2016 నవంబర్‌లో ‘పెద్ద నోట్ల రద్దు’తో ఒక పెద్ద ప్రహసనం ప్రారంభమయింది. కాకులను కొట్టి గద్దలకు వేసే వ్యవహారమది. సామాన్యులూ, చిన్న వ్యాపారులూ, పరిశ్రమల వ్యతిరేక ఆర్థిక నిర్ణయమది. కరెన్సీ నోట్లు అందుబాటులో లేని ‘పెద్ద నోట్ల రద్దు’ కాలంలో - డిజిటల్‌ లావాదేవీలు చేయలేని చిన్న వ్యాపారులూ తదితరులు చితికిపోయారు. ఈ క్రమంలోనే బడా మాల్స్‌, పెద్ద వ్యాపారుల (ఎవరైతే మనం సంఘటిత రంగం అంటున్నామో - వారి వ్యాపారం) అమ్మకాలూ, లాభాలూ పెరిగాయి. ఆ తరువాత వచ్చిన జి.ఎస్‌.టి పన్ను విధానం చిన్న పరిశ్రమలనూ, వ్యాపారులనూ మరింత దారుణంగా చిదిమేసింది. దాంతో బడా వ్యాపారులూ, కార్పొరేట్ల ఆధిపత్యం, వ్యాపారం మరింతగా పెరిగాయి. 


ఇదే వరుసలో అనంతర కాలపు కొవిడ్‌ -– 19 నియంత్రణలు పేద జనాలనూ, మధ్య తరగతినీ కూడా మరింతగా చిదిమేసాయి. ఈ కష్టకాలంలో ప్రభుత్వం అండ, ఆర్థిక సాయం లేక, చిన్న పరిశ్రమలూ, వ్యాపారులూ, మధ్యతరగతి, పేదలూ ... సమస్త సామాన్య జనాలస్థితీ చితికిపోయింది. కానీ ఆన్‌లైన్‌ వ్యాపారాలు చేయగల, లాక్‌డౌన్‌ల వంటి వ్యాపార ప్రతిష్ఠంభనల కాలంలో నిలదొక్కుకునేందుకు కావలసినంత ఆర్థిక బలం వున్న పెద్ద సంస్థలూ, కార్పొరేట్లూ మరింత బలంగా, ఈ సంక్షోభం నుంచి బయటపడ్డాయి. కష్టకాలంలో అండా, ఆసరాలేక చితికిపోయిన చిన్న చిన్న వ్యాపారాలూ, పరిశ్రమల మార్కెట్‌ వాటాను కూడా - ఈ బడా కార్పొరేట్లు దిగమింగేసాయి. చిన్న చేపను పెద్ద చేప మింగేసిన మార్కెట్‌ మాయాజాలం తాలూకు కథ! గతంలోని కేంద్రం పన్ను ఆదాయం కంటే, నేడు అది పెరగడానికి కారణం పన్ను కట్టే స్థాయి ఆదాయం ఉన్న బడా కార్పొరేట్ల ఆదాయాలు పెరగడం! గతంలో వ్యాపారాలు బాగున్న రోజులలో కూడా చిన్న వ్యాపారులకు పన్ను కట్టవలసిన అగత్యం ఉండే స్థాయిలో ఆదాయాలు లేవు. కానీ నేడు వారి వ్యాపార సమాధుల మీదే బడా కార్పొరేట్ల, ధనికుల ఆదాయాలు పెరిగాయి. ఈ పెరిగిన రాబడులు ఆ సంపన్నులకు ఒక రకంగా, ‘టాప్‌ - ఆన్‌’ వంటివి. అంటే అవి వారి పన్ను చెల్లించాల్సిన ఆదాయ స్థాయికి, అదనపు జోడింపు. అందుకే వారి పన్ను చెల్లింపులు పెరిగాయి. ప్రభుత్వ ఖజానా గలగలలాడుతోంది. ద్రవ్యలోటు సంఖ్య రానున్న ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో తగ్గి కనపడుతుంది. కానీ ఇదంతా, చితికిన, కొడిగట్టిన పేదలూ, మధ్యతరగతికి ఆలవాలంగా వున్న దుర్భర భారత్‌లో సుమా! 


డి. పాపారావు

Updated Date - 2021-08-20T06:11:20+05:30 IST