టీకా వివక్షలో ఆదివాసీలు

ABN , First Publish Date - 2021-07-29T07:12:57+05:30 IST

నోరున్న వాళ్లకు జరిగే చిన్న చిన్న అన్యాయాలు సైతం పెద్దగా ప్రచారమవుతాయి. నోరు లేని వాళ్లకు ఎంత పెద్ద అన్యాయం జరిగినా అది కనీసం వార్త కూడా కాదని మానవ హక్కుల దార్శనికుడు బాలగోపాల్ అన్నారు...

టీకా వివక్షలో ఆదివాసీలు

నోరున్న వాళ్లకు జరిగే చిన్న చిన్న అన్యాయాలు సైతం పెద్దగా ప్రచారమవుతాయి. నోరు లేని వాళ్లకు ఎంత పెద్ద అన్యాయం జరిగినా అది కనీసం వార్త కూడా కాదని మానవ హక్కుల దార్శనికుడు బాలగోపాల్ అన్నారు. అందుకేనేమో ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ ప్రాంతాలలో టీకాకరణ జరుగుతున్న పరిస్థితి గురించి బయట పెద్దగా వినిపించడం లేదు. కొవిడ్ వాక్సిన్ సరఫరాలో కొరత వలన టీకా ఇవ్వడంలో సమానత సూత్రాన్ని అనుసరించాలని, బాగా వెనుకబడిన వర్గాలకు, ఆరోగ్యరీత్యా బలహీనంగా ఉన్న వర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రణాళికా సంఘంతో సహా పలు ప్రభుత్వ ఏజెన్సీలు, యు.ఎన్.డి.పి. (UNDP) లాంటి సంస్థలు అనేకం ఆదివాసీల వెనుకబాటుతనం గురించి గతంలో పలుమార్లు నివేదికలు వెలువరించాయి.


ఆదివాసీల ఆయు పరిమాణం ఇతరుల కంటే సగటున దాదాపు 3.5 సం.వత్ఝసరాలు తక్కువని లాన్సెట్ ఆరోగ్య నిపుణుల కమిటీ నిర్ధారించింది. ఇక పి వి టి జి ల ఆయుపరిమాణం ఇతరుల కంటే తక్కువని పేర్కొంటూ అందుకనే వారికీ వృద్ధాప్య పింఛను అర్హత వయస్సు 65నుంచి 50 ఏళ్ళకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2014లో జి.ఓ. 157 విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పివిటిజిల జనాభా వృద్ధి రేటు క్షీణిస్తున్నట్లు పలువురు నిపుణులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ స్థితిలో సహజ న్యాయం అనుసరించి టీకాలు వేయడంలో మొదటి అవకాశం ఆదివాసీలకు ఇవ్వాల్సిఉంది. కానీ అలా జరగడంలేదు. గణాంకాలు వెల్లడించేది తక్కువ దాచేది ఎక్కువ అంటారు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో టీకా గణాంకాలు మాత్రం చాలా నిజాలనే చెబుతున్నాయి. 


కర్ణుడి చావుకు కోటి కారణాలు అన్నట్లు టీకా కార్యక్రమంలో సరఫరా వైపు, డిమాండ్ వైపు పలు సమస్యలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో టీకా కార్యక్రమం జనవరి నెలలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకా ఇవ్వడంతో ఆరంభమయింది. తర్వాత కార్యక్రమాన్ని సాధారణ ఆదివాసీలలో వయస్సు రీత్యా అర్హత ఉన్నవారికి విస్తరించారు. పాడేరు ఏజెన్సీ 11 మండలాలలో జూలై 10 నాటికి 1.36 లక్షల మంది టీకా తీసుకున్నారు. అందులో 1 లక్ష 15 వేల మంది మొదటి డోస్ టీకా వేయించుకోగా, రెండవ డోస్ దాదాపు 21 వేల మంది తీసుకున్నారు. అంటే టీకా ప్రక్రియ పూర్తి చేసుకున్నవారు 21 వేల మంది. దిగ్బ్రాంతి గొలిపే అంశం ఏమిటంటే విశాఖ జిల్లాలో ఆదివాసీ మండలాలతో పోల్చితే ఆదివాసేతర మండలాల్లో సగటున నాలుగు రెట్లు ఎక్కువ మందికి టీకా వేస్తున్నారు. ఇదే వేగంతో టీకా కార్యక్రమం జరిగితే ఒక్క పాడేరు ఏజెన్సీలో అర్హత కలిగిన 4.5 లక్షల మందికి టీకా వేయించడానికి కనీసం 5 ఏళ్ళ పైబడి సమయం పట్టే అవకాశం ఉంది. ఇంత మందకొడిగా టీకా కార్యక్రమం నడవడానికి కేవలం సరఫరాలో కొరత మాత్రమే కారణం కాదు. 


ఉదాహరణకు మిగిలిన సమూహాలతో పోల్చితే వాక్సినేషన్ పట్ల సంకోచం ఆదివాసీలలో ఎక్కువగా ఉన్నట్లు మా పరిశీలనలో తేలింది. టీకాల గూర్చిన అపోహలు, ఆధునిక వైద్య పద్ధతులపై నమ్మక లేమి, సంకోచానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. టీకా తీసుకున్న తర్వాత కొంత మందిలో అగుపించే లక్షణాలు ప్రాణాంతకం కావొచ్చనే భయం చాలా మంది ఆదివాసీలలో ఉంది. అలానే వాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు లేవలేని స్థితి దాపురిస్తుందని అందువలన తమ వ్యవసాయం పనులు దెబ్బతింటాయని కొంత మంది భయపడుతున్నారు. ఆదివాసీలలో వాక్సిన్ పట్ల సంకోచం తొలగించడానికి ఆరోగ్య శాఖ కానీ గిరిజన సంక్షేమ శాఖ కానీ నిర్దిష్టమైన ప్రయత్నాలూ చేయడం లేదు. వాక్సినేషన్ ప్రక్రియలో కమ్యూనిటీ నాయకులను, పౌర సమాజ సంస్థలను భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు కానీ అవి ఆశించిన ప్రయత్నాలు జరగడం లేదు.


అలానే ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉదాహరణకు పాడేరు ఏజెన్సీలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మూడవ వంతు డాక్టర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒకప్పుడు ఆదివాసీ ప్రాంతాలలో పనిచేసే ప్రభుత్వ ఎంబీబీస్ డాక్టర్లకు ఉన్నత విద్యలో కోటా ఉండేది, ఇప్పుడది తీసివేయడంతో ప్రభుత్వ వైద్యులుగా పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏజెన్సీ ప్రాంతాలలో పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని నియమించకుండా కీలకమైన వైద్య సేవలకు కమ్యూనిటీ ఆరోగ్య కార్యర్తలను కేవలం నాలుగు వేల రూపాయల జీతంతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. అలాగే ఆదివాసేతర ప్రాంతాలలో ఆరోగ్య సేవల బాధ్యత కొంత వరకూ ప్రైవేట్ రంగం తీసుకుంటుంది. ఐతే ఆదివాసీ ప్రాంతాలలో పైకం చెల్లించి సేవలు పొందగలిగే స్తోమత ఉన్న వారు లేకపోవడంతో మొత్తం భారం ప్రభుత్వ రంగానిదే. దీని వలన వైద్య సేవలు ఎక్కువ అవసరం ఉన్న ప్రాంతాలలో వైద్య వ్యవస్థ బలహీనంగా ఉంది.


ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లింకింగ్ లేకపోతే వాక్సినేషన్‌కు దిగువ స్థాయి సిబ్బంది అంగీకరించడం లేదు. అసలు వాక్సినేషన్‌ను ఆధార్‌తో ముడి పెట్టడం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును కాలరాయడమే. పాడేరు ఏజెన్సీలో మొదటి డోస్ తీసుకుని దాదాపు 12 వారాలు గడచినా రెండవ డోస్ తీసుకోని వారు 25 శాతం మంది ఉన్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు టీకా అందుబాటులో లేక పోవడం; రెండవ డోస్ అందుబాటులో ఉన్నా టీకా వేయించుకోవాల్సిన తేదీ వివరాలు ప్రజలకు అందకపోవడం; మొదటి డోస్ వేయించుకున్నవారు కూడా రెండవ డోస్ విషయంలో పునరాలోచించడం కారణాలుగా ఉన్నాయి. రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలో కొన్ని గంటల ముందు అది కూడా మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రూపంలో పంపడం వలన చాలా మంది సమయం దాటినా టీకా తీసుకోలేకపోతున్నారు. ఎక్కువ మంది ఉంటే తప్ప టీకాలు గ్రామాలలో వేయడం లేదు. దాని వలన ప్రజలు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాలలో 40–50 కిలో మీటర్ల ప్రయాణం తప్పడం లేదు. దానికి భయపడి మారుమూల ప్రాంత ప్రజలు రెండవ డోస్ వద్దనుకుంటున్నారు. గ్రామాలలో రెండవ డోస్ పంపిణీ తప్పనిసరి చేయాలి. రెండవ డోస్ ఇవ్వడంలో జరిగే ఆలస్యం వలన టీకా సమర్థంగా పని చేయకపోని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి టీకా కార్యక్రమం కేవలం కంటితుడుపుగా నిలుస్తుంది. పెద్ద ఎత్తున వనరులు వృధా ఔతాయి. 


జూన్ 21 నుంచి అమలులోకి వచ్చిన కేంద్రప్రభుత్వం సవరించిన టీకా మార్గదర్శకాల ప్రకారం, 18 సంవత్సరాలు పైబడిన వయోజనులలో, స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏ వర్గాలకు టీకాకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు. అలాంటపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు అందులోనూ పివిటిజిలకు టీకాకరణలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించడం తక్షణ అవసరం. లేకపోతే ప్రభుత్వ రాజకీయ చిత్తశుద్ధిపైన ప్రశ్నలు లేవనెత్తకతప్పదు. అలానే రాష్ట్రానికి కేటాయిస్తున్న టీకా కోటాలో ఏ ప్రాంతానికి ఎంత టీకా ఏ ప్రాతిపదికన కేటాయింపు చేస్తున్నారో ప్రజలకు తెలపడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. ఆదివాసీ ప్రాంతాలలో టీకా తీసుకున్నవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వైద్యులు కేంద్రంగా నడిచే వైద్య విధానం కాక, సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీల ఆధ్వర్యంలో ఆదివాసీలు కేంద్రంగా ఉండే వైద్య విధానం అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి సుజాతరావు అన్నారు. ఆదివాసీ ప్రాంతాలలో టీకా కార్యక్రమాన్ని రూపొందిస్తున్న, అమలు చేస్తున్న వారు ఈ సత్యాన్ని విస్మరించకూడదు. 

చక్రధర్ బుద్ధ, కగ్గా వెంకటకృష్ణ

సుగుణ భీమరశెట్టి, గజ్జల్‌గారి నవీన్ కుమార్

Updated Date - 2021-07-29T07:12:57+05:30 IST