పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి కళ్లలో కారం చల్లి దాడి

ABN , First Publish Date - 2021-05-02T12:53:16+05:30 IST

పట్టపగలే దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించారు.

పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి కళ్లలో కారం చల్లి దాడి

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : పట్టపగలే దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. లోపల ఉన్న వారి కళ్లలో కారం కొట్టి, కర్రలతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 2 సాగర్‌ సొసైటీలో నివసించే బెజవాడ బాలకృష్ణ వ్యాపారి. ఆయన  తన స్నేహితుడు సుబ్రహ్మణ్యరాజుతో కలిసి ఉంటున్నాడు. సుబ్రహ్మణ్యం సోదరుడు చిత్తూరుజిల్లా మాసలి ముడుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు. ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న  ఎం.కృష్ణాత్మ పదిరోజుల క్రితం సాగర్‌ సొసైటీకి వచ్చి వీరితోనే కలిసి ఉంటున్నాడు. ఏప్రిల్‌ 30న ముగ్గురు హాల్‌లో కూర్చొని ఉండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి వారి కళ్లలో కారం చల్లారు. అనంతరం కర్రలతో దాడి చేసి క్షణాల్లో అక్కడి నుంచి కారులో పారిపోయారు. బాలకృష్ణ తేరుకొని చూడగా కృష్ణాత్మ తీవ్ర గాయాలతో పడిఉన్నాడు. అతన్ని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-02T12:53:16+05:30 IST