హైదరాబాద్‌లో కొత్తగా తయారవుతున్న సైబర్ ముఠాలు
ABN , First Publish Date - 2021-04-27T18:38:17+05:30 IST
టీలోనూ సైబర్ నేరగాళ్లు పెరుగుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీపై పట్టు

సైబర్ నేరగాళ్లు అనగానే మొదట గుర్తుకొచ్చేది నైజీరియన్స్. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అక్రమంగా ఉంటూ దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనూ సైబర్ నేరగాళ్లు తయారయ్యారు.
హైదరాబాద్ సిటీ : సిటీలోనూ సైబర్ నేరగాళ్లు పెరుగుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీపై పట్టు సాధిస్తున్న నేరగాళ్లు వివిధ రకాల స్కీములతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ ట్రేడింగ్లను ఆసరాగా చేసుకుని నకిలీ సైట్లు తయారు చేస్తున్నారు. షేర్ మార్కెట్లో, ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వారు తయారు చేసిన నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్ లింక్‌లను వాట్సా్ప్లో పంపిస్తున్నారు. ఆ తర్వాత వారిని అధికలాభాల పేరుతో ఆకట్టుకుని రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఆ డబ్బులు చేతికి అందగానే ఫోన్ స్విచాఫ్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన అలాంటి సైబర్ ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు.
16 లక్షలు కొట్టేసిన ముఠా
కేపీహెచ్‌బీకి చెందిన ముగ్గురు యువకులు సైబర్ ముఠాగా ఏర్పడ్డారు. షేర్మార్కెట్లు, ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టేవారి వివరాలు సేకరించారు. హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వాట్సా్‌పకు ఒక మెసేజ్ పంపారు. ‘మీరు ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయి. ప్రస్తుతం యూస్ డాలర్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. మీరు తక్కువ ధరకు యూస్ డాలర్ కొనుగోలు చేసి కొద్దిరోజుల తర్వాత అమ్మితే అధిక మొత్తంలో లాభం వస్తుంది’ అని ఆ మెసేజ్‌లో ఉంది. బాధితుడు వెంటనే వారు చెప్పిన వెబ్సెట్లో అతని పేరు రిజిస్టర్ చేయించాడు. 100 యూస్ డాలర్లు కొనుగోలు చేసి ఆ ఖాతాలో జమచేశానని వారికి చెప్పాడు. వారు చెప్పిన విధంగానే వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆన్లైన్లో అతనికి డబ్బులు వచ్చినట్లు కనిపించాయి. అందుకు కొంత కమీషన్ కూడా వారికి చెల్లించాడు.
కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన ముఠాలో ఉన్న మరో యువకుడు అతడిని వాట్సా్‌పలో సంప్రదించాడు. ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వారు బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడిపెడితే మొదటి విడతగా రూ.50 వేల అమెరికన్ డాలర్ల లాభాలు వస్తాయని నమ్మించాడు. 40 శాతం కమీషన్ ఇస్తానంటే మీ పేరును బిట్‌కాయిన్స్ పెట్టుబడిలో రిజిస్టర్ చేస్తామని చెప్పారు. బాధితుడు ముందు ఖాతాలో డబ్బులు జమ చేస్తే పెట్టుబడి పెడతానన్నాడు. దాంతో మొదటి సారి 100 డాలర్లు జమ చేసినట్లుగానే, ఇప్పుడు రూ.50 వేల అమెరికన్ డాలర్లు జమ చేసినట్లు సృష్టించి స్ర్కీన్ షాట్లు వాట్సాప్ చేశారు. తమకు కమీషన్ చెల్లించిన తర్వాత తన ఖాతాలోని డబ్బు తీసుకోవచ్చు అని చెప్పాడు.
దాంతో ముందు వెనుకా చూడకుండా బాధితుడు రూ.16 లక్షలు (40 శాతం కమీషన్ కింద) వారికి చెల్లించాడు. అనంతరం ఖాతాలో జమ అయినట్లు చూపించిన డబ్బుల కోసం బాధితుడు ప్రయత్నించగా, కనిపించలేదు. వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా, ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. టెక్నికల్ ఎవిడెన్స్‌ను సేకరించిన పోలీసులు కేపీహెచ్‌బీకి చెందిన సైబర్ ముఠాను గుర్తించారు. ముఠాకు చెందిన వంశీధర్‌రెడ్డి, దేవరాజ్‌రెడ్డి, ఎండీ సుభాన్లను కటకటాల్లోకి నెట్టారు. గుర్తుతెలియని వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని సెబీలో రిజిస్టర్ అయిన బ్రోకర్లను సంప్రదించి, వారి వద్ద సరైన సలహాలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
వ్యాక్సిన్ వేయించుకున్నారా అంటూ..
హిమాయత్‌నగర్ : సైబర్ నేరగాళ్లు కొత్త రూటు ఎంచుకున్నారు. ఫోన్ హ్యాక్ చేసి అందులో సమాచారాన్ని కాజేసేందుకు వ్యాక్సిన్ పేరుతో వల విసురుతున్నారు. ఇటీవల నగరవాసికి 912250041117 నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి ‘మీరు కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారా’ అని అడిగాడు. వ్యాక్సిన్ చేయించుకుంటే 1 నొక్కమని సూచించాడు. అతడు సూచించిన విధంగా చేసిన వెంటనే మొబైల్ హ్యాక్ అయింది. దాంతో బాధితుడు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు.