బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు అత్యాచారం నాటకం.. రంగంలోకి వెయ్యిమంది పోలీసులు.. చివరికి అంతా తూచ్!

ABN , First Publish Date - 2021-12-15T02:59:56+05:30 IST

బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు ఓ యువతి ఆడిన నాటకం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది..

బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు అత్యాచారం నాటకం.. రంగంలోకి వెయ్యిమంది పోలీసులు.. చివరికి అంతా తూచ్!

నాగ్‌పూర్: బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు ఓ యువతి ఆడిన నాటకం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారంటూ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 19 ఏళ్ల యువతి కలామ్నా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన నాగ్‌పూర్ పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు సహా ఏకంగా 1000 మంది పోలీసులు ఈ కేసును దర్యాప్తులో పాలుపంచుకున్నారు. నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. 


నగరంలోని 250కిపైగా సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని నిర్ధారించారు. ఆ అమ్మాయి కావాలనే ఈ కథ అల్లిందని గుర్తించారు. ఆ తర్వాత విచారణలో యువతి చెప్పిన విషయం విని పోలీసులకు మతిపోయినంత పనైంది. బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకే తాను ఈ నాటకం ఆడినట్టు పోలీసులకు చెప్పింది. అయితే, దీని వెనక ఉన్న కచ్చితమైన ప్రణాళిక ఏంటన్నది మాత్రం ఆమె వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. 


అంతకుముందు..  చిక్కాలి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. రాందాస్‌పేట ప్రాంతంలో మ్యూజిక్ క్లాస్‌కు వెళ్తున్న సమయంలో తెల్లని వ్యాన్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బుటిబొరి రోడ్డు గురించి తనను అడిగారని, తాను చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత తన ముఖాన్ని గుడ్డతో మూసేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. 


 కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కలమ్నా పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలిసి కమిషనర్ అమితేష్ కుమార్, అడిషనల్ సీపీ సునీల్ ఫుల్హారి, సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు.  మొత్తం వెయ్యిమంది పోలీసులతో 40 బృందాలను ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల కోసం యువతిని మాయో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరు గంటలపాటు 50మందికిపైగా విచారించారు. 250కిపైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. 


చివరికి యువతి చెప్పింది అంతా ఉత్తదేనని తేల్చారు. ఉదయం 9.50 గంటల సమయంలో వెరైటీ స్క్వేర్ వద్ద బస్సు దిగిన యువతి నడుచుకుంటూ వెళ్లి 10 గంటలకు ఝాన్సీ రాణి స్క్వేర్ వద్దకు చేరుకుంది.  10.15 గంటలకు ఆనంద్ టాకీస్ స్క్వేర్ వద్ద ఆటో ఎక్కి 10.25 గంటలకు మాయో ఆసుపత్రి వద్ద దిగింది. ఆ తర్వాత మరో ఆటో ఎక్కి 10.54 గంటలకు చిఖాలి స్క్వేర్ వద్ద దిగింది. ఓ పెట్రోలు పంపు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో నడుచుకుంటూ కలమ్నా పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నట్టు 11.04 గంటలకు రికార్డైంది.

 

సీసీటీవీ ఫుటేజీలన్నీ ఆమె చెప్పిన నేరం జరగలేదని కచ్చితంగా నిర్ధారిస్తుండడంతో పోలీసులు యువతిని గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు నిజం బయటపెట్టింది. తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకే ఈ నాటకం ఆడినట్టు చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అయితే, దీని వెనక ఉన్న కచ్చితమైన ప్రణాళిక ఏంటో యువతి చెప్పలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-15T02:59:56+05:30 IST