3 గంటల్లోనే హత్య కేసు ఛేదించిన కాచిగూడ పోలీసులు

ABN , First Publish Date - 2021-05-02T13:01:36+05:30 IST

హత్య జరిగిన మూడు గంటల్లోనే నిందితుడిని కాచిగూడ పోలీసులు పట్టుకున్నారు...

3 గంటల్లోనే హత్య కేసు ఛేదించిన కాచిగూడ పోలీసులు

  • తాగిన మైకంలో బండరాయితో మోది హత్య  
  • కాచిగూడ పీఎస్‌ పరిధిలో ఘటన

హైదరాబాద్/బర్కత్‌పుర : హత్య జరిగిన మూడు గంటల్లోనే నిందితుడిని కాచిగూడ పోలీసులు పట్టుకున్నారు. తాగిన మైకంలో పెయింటర్‌ కృష్ణను తలపై బండరాయితో మోది హత్య చేసిన ముజీబ్‌ కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన వివరాలను కాచిగూడ ఎస్‌ఐ సైదులు వివరించారు. ఆదిలాబాద్‌కు చెందిన కృష్ణ (41) నగరంలో పెయింటర్‌గా పనిచేస్తూ కాచిగూడ పరిసర ప్రాంతాలలో ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుమార్‌ థియేటర్‌ పక్కన గల వైన్‌షాపు వద్దకు  కృష్ణ వచ్చాడు. అక్కడ సుందర్‌నగర్‌లో నివాసం ఉంటూ రోటీ మేకర్‌గా పనిచేస్తున్న ముజీబ్‌ (35)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత కృష్ణ, ముజీబ్‌లు సుందర్‌నగర్‌లోని గ్రేవ్‌యార్డ్‌వద్దకు రాత్రి 9 గంటల సమయంలోవచ్చారు. అక్కడ ఇద్దరిమధ్య గొడవ జరిగింది. తాగిన మైకంలో ఉన్న ముజీబ్‌ కోపోద్రిక్తుడై కృష్ణను కిందపడేసి బండరాయితో  తలపై మోది హత్య చేశాడు. ఆ తర్వాత ముజీబ్‌ ఇంటికి పారిపోయాడు. 


సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. వైన్‌షాపు వద్ద కృష్ణ, ముజీబ్‌లు కలిసి మద్యం తాగిన విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి పోలీసులకు కొంత సమాచారం ఇచ్చాడు. దీనిపై రంగంలోకి దిగిన కాచిగూడ పోలీసులు కృష్ణను హత్య చేసింది ముజీబ్‌ అని నిర్ధారించుకుని శుక్రవారం అర్ధరాత్రి సుందర్‌నగర్‌లోని అతని ఇంటిపై దాడిచేశారు. ముజీబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన మూడు గంటల్లోనే నిందితుడిని పట్టుకుని శభాష్‌ అనిపించుకున్నారు. ముజీబ్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-05-02T13:01:36+05:30 IST