ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్‌షిప్‌ .. ఫొటోలు తీసుకొని బ్లాక్‌మెయిల్‌

ABN , First Publish Date - 2021-02-06T11:36:11+05:30 IST

నకిలీ ఖాతా ద్వారా బాలికలు, యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తుంటాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్‌షిప్‌ .. ఫొటోలు తీసుకొని బ్లాక్‌మెయిల్‌

హైదరాబాద్‌ : నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి యువతులను మోసం చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతానికి చెందిన చిల్వరి సంతో‌ష్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా ద్వారా బాలికలు, యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తుంటాడు. వారికి మాయమాటలు చెప్పి వారి నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించేవాడు. వాటిని మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటాడు. ఈ మేరకు గతేడాది ఆగస్టు 11న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా... శుక్రవారం నిందితుడిని అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి (19)కి తాను మీ క్లాస్‌మేట్‌నంటూ చెప్పి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ రాగా, ఆమె యాక్సెప్ట్‌ చేసింది.


ఆ తర్వాత అతడు చెప్పిన మాటలు నమ్మి ఫోన్‌ నెంబర్లు, ఫొటోలు కూడా షేర్‌ చేసింది. ఆ తర్వాత అతను క్లాస్‌మేట్‌ కాదని, ఇలాగే చాలామంది యువతులను మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు అతడి అకౌంట్లను, ఫోన్లను బ్లాక్‌ చేసింది. దాంతో నిందితుడు ఆమె తండ్రికి ఫోన్‌ చేసి బెదిరించసాగాడు. యువతి తనతో మాట్లాడకుంటే ఫొటోలను షేర్‌ చేసి పెళ్లికాకుండా చేసి భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించాడు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సైబర్‌క్రైమ్‌ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-02-06T11:36:11+05:30 IST