అమ్మవారి గుడి పక్కన ఉన్న చెట్టు దగ్గరి నుంచి వస్తున్న పసికందు ఏడుపులు.. ఏమైందోనని వెళ్తే.. అక్కడ ఉన్నది చూసి భక్తులందరూ షాక్..!

ABN , First Publish Date - 2021-10-12T19:21:02+05:30 IST

శరన్నవరాత్రుల సందర్భంగా..

అమ్మవారి గుడి పక్కన ఉన్న చెట్టు దగ్గరి నుంచి వస్తున్న పసికందు ఏడుపులు.. ఏమైందోనని వెళ్తే.. అక్కడ ఉన్నది చూసి భక్తులందరూ షాక్..!

ఇంటర్‌నెట్‌డెస్క్: శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజులాగే సోమవారం కూడా భక్తులందరూ అమ్మవారి గుడికి వెళ్లారు. కానీ వారికి ఆరోజు షాకింగ్ ఘటన ఎదురైంది. గుడి పక్కన ఉన్న ఓ పెద్ద చెట్టు దగ్గరి నుంచి పసికందు ఏడుపులు వినపడుతున్నాయి. ఏమైందోనని భక్తులందరూ భయపడ్డారు. పండగ పూట ఈ ఏడుపులు వినపడడమేంటి అని ఆందోళన చెందారు. కొంతమంది ధైర్యం చేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఓ మంచం మీద ఉన్నది చూసి భక్తులందరూ షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన హర్యాణాలోని ఝజ్జర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


ఝజ్జర్ జిల్లా మచ్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అహరి అనే ఓ గ్రామం ఉంది. శరన్నవరాత్రుల సందర్భంగా గ్రామంలోని అమ్మవారి గుడిలో ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తున్నారు. సోమవారం గుడికి వెళ్లిన భక్తులకు.. గుడి పక్కన్నే ఉన్న ఓ పెద్ద చెట్టు దగ్గరి నుంచి ఓ పసికందు ఏడుపులు వినపడ్డాయి. దీంతో గుడిలో ఉన్న వారందరూ భయబ్రాంతులకు గురయ్యారు. పండగపూట ఏ కీడు జరగనున్నదోనని భయపడ్డారు. కొంతమంది భక్తులు ధైర్యం చేసి ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు. చెట్టు దగ్గర ఓ మంచం ఉంది. మంచంపై ఓ మూట ఉంది. ఆ మూటలోనుంచి ఏడుపులు రావడం గమనించి దానిని తెరిచారు.



అంతే అందులో ఓ పసికందు ఉండడం చూసి షాక్‌కు గురయ్యారు. ఎవరో ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున ఆ చిన్నారిని తెచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్లారు. ఏడిచి ఏడిచి ఆ పాప అలసిపోయింది. ఓ మహిళ ఆ పసికందు నోట్లో కొన్ని నీళ్లు పోయగా.. మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. ఆ మహిళ మానవతా దృక్పథంతో పాపకు పాలు పట్టించింది. మాచ్రౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పసికందును ఝజ్జర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం బాగుంది. ఆ పసికందును చెట్టు దగ్గర వదిలివెళ్లిపోయిన తల్లిదండ్రులకోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. 


అశోక్ కుమార్ అనే పోలీసు అధికారి మాట్లాడుతూ ఆ పాప పుట్టి రెండు రోజులు కూడా కాలేదనపిస్తోందన్నారు. గుడి దగ్గర వదిలివెళ్లిన తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభిచామన్నారు. చుట్టు పక్కల గ్రామాల్లో ఇటీవల ఎవరైనా గర్భం దాల్చారా అనే విషయం కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సెక్షన్ 317కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు. పండగపూట జరిగిన ఈ ఘటనతో భక్తులందరూ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారన్నారు. 

Updated Date - 2021-10-12T19:21:02+05:30 IST