ఎక్సైజ్‌లో నకిలీ చలానాల కలకలం

ABN , First Publish Date - 2021-01-10T08:20:51+05:30 IST

మద్యం వ్యాపారులు, ఎస్‌బీఐ వర్ధన్నపేట శాఖ క్యాషియర్‌ కుమ్మక్కై 19 నకిలీ చలానాలను సృష్టించి రూ.1.61 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.

ఎక్సైజ్‌లో నకిలీ చలానాల కలకలం

 మద్యం వ్యాపారులు, బ్యాంక్‌ క్యాషియర్‌ కుమ్మక్కు

 ఖజానాకు జమకాని రూ.1.61 కోట్లు  


వర్ధన్నపేట: మద్యం వ్యాపారులు, ఎస్‌బీఐ వర్ధన్నపేట శాఖ క్యాషియర్‌ కుమ్మక్కై 19 నకిలీ చలానాలను సృష్టించి రూ.1.61 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ సీఐ కరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎక్సైజ్‌ శాఖ కమిషనరేట్‌ నుంచి ఆమెను వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ సురేష్‌ రాథోడ్‌కు అటాచ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన చంద్రమౌళి వైన్స్‌, తులసి వైన్స్‌, ఇల్లందులోని మల్లికార్జునవైన్స్‌, పర్వతగిరి మండలం అన్నారం షరీ్‌ఫలోని నందిని వైన్స్‌ వారు త్రైమాసిక లైసెన్సు ఫీజు చెల్లింపుల్లో భాగంగా రూ.68.75లక్షలు విలువైన ఏడు నకిలీ చలానాలను ఇచ్చారు. డబ్బు ఖజానాలో జమకాకపోవడంతో ఎక్సైజ్‌ శాఖ ఆ మొత్తాన్ని జరిమానాతో పాటు రికవరీ చేసింది.


ఎస్‌బీఐ బ్యాంకు క్యాషియర్‌, మద్యం వ్యాపారులు, వారివద్ద పని చేసే సిబ్బందితో కలిసి తొమ్మిదిమందిపై ఈ నెల 5న కేసు నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులు, ఎస్‌బీఐ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుండగా వర్ధన్నపేటలో రెండేళ్ల క్రితం నిర్వహించిన చంద్రమౌళి, సింగం వైన్స్‌కు సంబంధించి రూ.92.50లక్షల విలువైన మరో 12 నకిలీ చలానాలను గుర్తించారు. మూడేళ్ల నుంచి ఎక్సైజ్‌ శాఖకు చెల్లించిన చలానాలు, బ్యాంకులో జమ, ఎస్‌టీఓలో పొందుపరిచిన వివరాలను సేకరిస్తున్నారు. మరిన్ని నకిలీ చలానాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

Updated Date - 2021-01-10T08:20:51+05:30 IST