అయ్యయ్యో వద్దమ్మా.. టమోటా రేట్లు పెరిగాయి కదా అని.. మీరు కూడా ఇతనిలా చేయకండి.!

ABN , First Publish Date - 2021-10-29T18:03:03+05:30 IST

ఇంట్లో ఏదైనా కూర చేయాలంటే..

అయ్యయ్యో వద్దమ్మా.. టమోటా రేట్లు పెరిగాయి కదా అని.. మీరు కూడా ఇతనిలా చేయకండి.!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఇంట్లో ఏదైనా కూర చేయాలంటే టమోటా తప్పనిసరి. అలాంటి టమోటా ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. దాదాపుగా రెండు నెలల క్రితం కిలో టమోటా ధర రూ.10లు ఉండగా, ప్రస్తుతం రూ.50లకు చేరుకుంది. ఇతర కూరగాయల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుదల ధరలకు కారణమైతే, వ్యాపారులు మరింత డిమాండ్‌ సృష్టిస్తూ మార్కెట్‌ ధర కంటే రూ.20ల అదనంగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ రేటు ప్రకారం కిలో టమోటా ధర రూ.50లు. కానీ, బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.70లకు అమ్ముతున్నారు. అదేంటని ప్రశ్నిస్తే.. సరుకు దొరకడం లేదు మరీ.. కొంటే కొనండి.. లేదంటే లేదూ అని వ్యాపారులు సమాధానం చెబుతున్నారు. దీన్ని అరికట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న ప్రజలకు అధిక ధరలు మరింత భారంగా మారాయి. దేశమొత్తం మీద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా పట్టణానికి చెందిన ఓ పేదకుటుంబానికి చెందిన యువకుడు గురువారం ఉదయం టమోటాలు కొనడానికని సికంద్రా కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. కిలో ఎంత అని అడిగాడు. ధర రూ.50 చెప్పడంతో షాక్‌కు గురయ్యాడు. అంత ధర పెట్టి కొనలేని ఆ యువకుడు ఓ నిర్ణయం తీసుకున్నాడు. అందరూ బిజీగా ఉండడం గమనించి ఓ షాపులో టమోటా బాక్స్‌లనే దొంగతనం చేయాలనుకున్నాడు. కానీ అతడు దొంగతనం చేసేది టమోటా బాక్స్‌ల యజమాని అర్హతీయ అనే వ్యక్తి గమనించాడు. ముందే రేట్లు ఎక్కువుగా అమ్ముతుండడంతో.. జనాలు ఎవరూ షాప్‌కు రావడంలేదనే కోపంలో ఉన్న అర్హతీయ.. అతని మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఆ యువకుడిని పిచ్చ కొట్టుడు కొట్టాడు. అంతేకాదు అక్కడ పనిచేసే మరికొంతమంది కూడా అతడిపై కర్రలతో దాడి చేశారు. ఓ గంటపాటు మార్కెట్ స్తంభించిపోయిందంటే అర్థం చేసుకోండి అతడిని ఎలా చావబాది ఉంటారో. కానీ ఆ యువకుడు అన్న మాటలు అందరినీ కలిచివేశాయి. ‘నాలాంటి పేదవాడికి ఇలాంటి శిక్ష పడడం కరెక్టే.. ఎందుకంటే ఇంత రేటు పెట్టి కూరగాయలు కొనలేము కదా.. నన్ను చంపేయండి’అంటూ రోదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు.సికంద్రా పోలీస్‌స్టేషన్ అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరగడంతో స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు టమోటా బాక్స్‌లను దొంగతనం చేయడానికి ప్రయత్నించాడన్నారు. షాపు యజమాని తీవ్రంగా కొట్టడంతో ఆ యువకుడికి గాయాలయ్యాయని, అతడిని ఆస్పత్రికి తరలించామన్నారు. యువకుడి రక్తం చూసి.. భయపడిపోయిన షాపు యజమాని పారిపోయాడని, అతడిని పట్టుకునే పనిలో ఉన్నామని అన్నారు.Updated Date - 2021-10-29T18:03:03+05:30 IST