Chennaiలో నయా మోసం!

ABN , First Publish Date - 2021-10-28T13:55:29+05:30 IST

సాంకేతికత వినియోగంపై అవగాహన లేని ఓ జంట వద్ద జార్ఖండ్‌ ముఠా రూ.13 లక్షలు దోచుకుంది. తాము చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, రూ.5 చెల్లిస్తేనే మొబైల్‌ కనెక్షన్‌ వుంటుందని, లేకుంటే కట్‌ అవుతుందంటూ

Chennaiలో నయా మోసం!

- రూ.5 చెల్లించాలంటూ రూ.13 లక్షలు దోచుకున్నారు

- జార్ఖండ్‌కు చెందిన ముగ్గురి అరెస్టు


చెన్నై(Tamilnadu): సాంకేతికత వినియోగంపై అవగాహన లేని ఓ జంట వద్ద జార్ఖండ్‌ ముఠా రూ.13 లక్షలు దోచుకుంది. తాము చెప్పిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, రూ.5 చెల్లిస్తేనే మొబైల్‌ కనెక్షన్‌ వుంటుందని, లేకుంటే కట్‌ అవుతుందంటూ మాయమాటలు చెప్పి, ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అసలు విషయం తెలిసి లబోదిబోమన్న ఆ జంట ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... ఎట్టకేలకు ఆ ముఠాను కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే... 

గత సెప్టెంబర్‌ 26న కోడంబాక్కంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి మొబైల్‌ సర్వీస్‌ సెంటర్‌నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తుతెలియని వ్యక్తులు వెంటనే తాము చెప్పే వెబ్‌సైట్‌లో ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు ‘ఫాస్ట్‌ సపోర్ట్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి, తాము చెప్పే ఖాతాకు ఐదు రూపాయలు చెల్లించకపోతే సెల్‌ఫోన్‌ నెంబర్‌ కట్‌ అవుతుందని తెలిపారు. ఆ మాటలను నమ్మి ఆ వ్యక్తి తన ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపి వారు తెలిపిన వెబ్‌సైట్‌కు ఐదు రూపాయలు పంపారు. అయితే ఐదు రూపాయలు తమ ఖాతాకు జమ కాలేదని కోడంబాక్కం వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లో తెలిపి, మరొకరి ద్వారా ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పారు. ఆ మేరకు కోడంబాక్కం నివాసి తన భార్య ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాల వివరాలు పంపి ఐదు రూపాయలను పంపారు. అది కూడా అందలేదని కాసేపటికి దుండగుల నుంచి సమాచారం వచ్చింది. దీనితో కోడంబాక్కం వ్యక్తి తన భార్యకు చెందిన మరో బ్యాంకు ఖాతా వివరాలను మరో ఫోన్‌ నెంబర్‌ ద్వారా తెలిపి ఐదు రూపాయలను దుండుగులు తెలిపిన ఖాతాకు జమ చేశారు. ఇలా కోడంబాక్కం దంపతులకు చెందిన మూడు బ్యాంకు ఖాతాల వివరాలు దుండగులకు పంపటంతో కాసేపటికి ఆ మూడు బ్యాంకు ఖాతాలలో ఉన్న రూ.13 లక్షలు మాయమైంది. ఈ విషయమై కోడంబాక్కం దంపతులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దంపతులకు వచ్చిన ఫోన్‌కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లను బట్టి మోసగించిన వారు జార్ఖండ్‌కు చెందినవారని తెలుసుకున్నారు. వెంటనే ప్రత్యేకదళం పోలీసులు జార్ఖండ్‌కు వెళ్ళి బిశ్వనాథ్‌మండల్‌, బాబీ మండల్‌, పరేష్‌ చంద్రమండల్‌ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11 లక్షల నగదు, 20 సెల్‌ఫోన్లు, 160 సిమ్‌కార్డులు, నాలుగు స్వైపింగ్‌ మిషన్లు, లగ్జరీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎగ్మూరు కోర్టులో ముగ్గురినీ హాజరు పరిచి జైలుకు తరలించారు.

Updated Date - 2021-10-28T13:55:29+05:30 IST