హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల కొంత పంథా.. తస్మాత్ జాగ్రత్త
ABN , First Publish Date - 2021-04-26T13:51:01+05:30 IST
ఓ న్యాయవాది నకిలీ కాల్‌సెంటర్‌కు కాల్ చేసి ఎనీడెస్క్ యాక్సెస్ ఇచ్చారు...

- రిమోట్ కంట్రోల్ యాప్స్‌తో దోపిడీ
హైదరాబాద్ సిటీ : హెల్ప్‌లైన్ కేంద్రం నుంచి మాట్లాడుతున్నానని నమ్మించి మన కంప్యూటర్లను వారి అధీనంలోకి తీసుకుంటారు. ఉపకారం చేస్తున్నట్లు నటిస్తూ ఓటీపీలు తీసుకుంటారు. మన కంప్యూటర్ ద్వారా యాక్సెస్ తీసుకుని ఖాతాల్లోని డబ్బు మాయం చేస్తుంటారు. ఇదే విధంగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసి క్యాన్సిల్ చేసుకుందామనుకున్న ఓ న్యాయవాది నకిలీ కాల్‌సెంటర్‌కు కాల్ చేసి ఎనీడెస్క్ యాక్సెస్ ఇచ్చారు. సైబర్ మోసగాళ్లు ఆయన ఖాతా నుంచి రూ. 1.05 లక్షలు మాయం చేశారు. పలు రకాల మోసాలతో సైబర్ నేరగాళ్లు మన కంప్యూటర్లపై దాడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్యూటర్లను వివిధ రిమోట్ యాక్సెస్‌ల ద్వారా అనామకుల చేతుల్లో పెట్టరాదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఎనీడెస్క్ మాత్రమే కాదు... పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే లాంటి యాప్‌లు వాడుతున్న సిస్టమ్‌లలో ఎనీడెస్క్, టీమ్‌వ్యూయర్ లాంటి రిమోట్ యాప్‌లు వినియోగిస్తున్నారంటే జాగ్రత్త పడాల్సిందే.
గతేడాదిలో...
రాంనగర్‌కు చెందిన స్టీల్ వ్యాపారికి గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి రాజేంద్రప్రసాద్ అని పేరు చెప్పి పరిచయం చేసుకున్నాడు. పేటీఎం కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పాడు. మీకు అర్థం కాదు, నేనే చేస్తానని చెబుతూ ఆయన ఫోన్లో ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేయించి యాక్సెస్ తీసుకున్నాడు. లాగిన్ వివరాలతోపాటు ఓటీపీ సేకరించి వ్యాపారి ఖాతా నుంచి రూ. 1.03 లక్షలు కాజేశాడు. బాధితుడు సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు.
- అంతకు ముందు అమీర్‌పేట్ నివాసి ఇలాగే మోసపోయాడు. అతడి ఫోన్‌కు పేటీఎం ఖాతా గడువు ముగిసింది అంటూ మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా.. టీమ్ వ్యూయర్ ఇన్స్టాల్ చేస్తే సరి చేస్తానని నమ్మించాడు. బాధితుడు ఇన్స్టాల్ చేయగా యాక్సెస్ తీసుకున్న మోసగాడు బాధితుడి పేటీఎం ఖాతాకు క్రెడిట్‌కార్డు(బాధితుడికి చెందిన) లింకు జోడించాడు. క్షణాల్లో అతడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.88 లక్షలు మాయం చేశాడు.
- టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. ఖాతాలో సమస్య ఉందని చెప్పి ఎనీడెస్క్ డౌన్లోడ్ చేయించాడు. యాక్సెస్ తీసుకుని అతడి ఖాతా నుంచి రూ. 40 వేలు కాజేశాడు.
- నారాయణగూడ నివాసికి ఈ వ్యాలెట్ ప్రతినిధులమని చెప్పి ఫోన్ చేసి ఆయన ఫోన్లో క్విక్‌సపోర్ట్ డౌన్లోడ్ చేయించారు. ఆయన చూస్తుండగానే ఖాతాలో నుంచి రూ. 1.96 లక్షలు మాయం చేశారు.
ముంబైకి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ మోసగాడు పేటీఎం కస్టమర్‌కి సంబంధించిన కేవైసీ అప్డేట్ చేస్తానంటూ సిస్టంను తన అధీనంలోకి తీసుకున్నాడు. అప్డేట్ చేయకపోతే పేటీఎం ఖాతా బ్లాక్ అవుతుందని నమ్మించాడు. అప్డేట్ చేస్తున్న సమయంలో తనకు టీమ్ వ్యూయర్ ద్వారా యాక్సెస్ ఇస్తే చేస్తానని చెప్పాడు. టీమ్ వ్యూయర్ డౌన్లోడ్ చేయించి తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అప్డేట్ అయిందని చెబుతూ ఎవరికైనా ఒక రూపాయి పంపించమన్నాడు. అతడు చెప్పినట్లు చేసిన బాధితుడి పేటీఎం లాగిన్ వివరాలు సేకరించి క్షణాల్లో అతడి ఖాతా నుంచి సైబర్ మోసగాడు రూ. 1.72 లక్షలు మాయం చేశాడు.
ఈ మోసాలన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. ఫిర్యాదులు చేయని వారి సంఖ్య అఽధికంగానే ఉంటుంది. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్ పే ప్రతినిధులమంటూ సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారు. క్విక్‌సపోర్ట్, ఎనీడెస్క్, టీమ్‌వ్యూయర్, ఇతర రిమోట్ యాప్‌లను ఇన్స్టాల్ చేయించి దోచుకుంటూనే ఉన్నారు. కేవైసీ, ఖాతా క్లోజ్ అయింది.. అకౌంట్ అప్డేట్ చేయాలంటూ ఫోన్లు చేస్తున్న మోసగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు. ఎనీడెస్క్, టీమ్ వ్యూయర్, క్విక్‌సపోర్ట్ లాంటి ఎన్నో యాప్‌లతో మన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను మోసగాళ్లు యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఎవరైనా ఫోన్లు చేసి వివరాలు అడిగితే వారికి సమాధానం ఇవ్వొద్దని, అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
