మమ్మల్ని కొత్త దంపతుల్లాగా అలంకరించి అంత్యక్రియలు చేయండి.. అంటూ లేఖ రాసి మరీ భార్యతో సహా ఆ బ్యాంకు ఉద్యోగి..

ABN , First Publish Date - 2021-12-09T22:06:17+05:30 IST

అతడు ఓ బ్యాంకులో ఉద్యోగి కాగా భార్య గృహిణి. ఆ భార్యాభర్తలిద్దరూ అందమైన భవిష్యత్తును ఊహిస్తూ.. ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇలాంటి అన్యోన్యమైన జంట ఓ రోజు కీలక నిర్ణయం తీసుకుంది

మమ్మల్ని కొత్త దంపతుల్లాగా అలంకరించి అంత్యక్రియలు చేయండి.. అంటూ లేఖ రాసి మరీ భార్యతో సహా ఆ బ్యాంకు ఉద్యోగి..

భోపాల్: అతడు ఓ బ్యాంకులో ఉద్యోగి కాగా భార్య గృహిణి. ఆ భార్యాభర్తలిద్దరూ అందమైన భవిష్యత్తును ఊహిస్తూ.. ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఇలాంటి అన్యోన్యమైన జంట ఓ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘మమ్మల్ని కొత్త దంపతుల్లాగా అలంకరించి అంత్యక్రియలు చేయండి..’’ అంటూ లేఖ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..


ఇండోర్‌లోని ఓ ప్రముఖ బ్యాంకులో మోను అలియాస్ సూర్య ప్రకాష్ గుప్తా అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. మోనుకు గతంలోనే అంజలితో వివాహం జరిగింది. ఈ దంపతులు గ్రీన్ వ్యూ కాలనీలోని ఆయుష్మాన్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితం మంగళవారం అనూహ్య మలుపు తిరిగింది. ఏం బాధ కలిగిందో ఏమో తెలియదు కానీ సూసైడ్ నోట్ రాసి మరీ ఈ దంపతులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మోనూ కన్నుమూశాడు. బుధవారం ఉదయం చికిత్స పొందుతూ అంజలి చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.


సూసైడ్ నోట్‌లో ఏం రాశారంటే..

‘‘మేము జీవితంలో చాలా అలసిపోయాము. ఇంకా మాకు బ్రతికే ధైర్యం లేదు. కష్టాలను ఎదుర్కొనే శక్తి లేదు. మీకు తోడుగా ఉండలేకపోతున్నందుకు అమ్మా, నాన్న, లలి నన్ను క్షమించండి. నా పేరు మీద ఉన్న భూమిని మా అమ్మ పేరు మీదకు బదిలీ చేయాలి’’ అని మోను కోరాడు.


అంజలి ఏం రాసిందంటే.. ‘‘నా పెళ్లికి బహుమతిగా ఇచ్చిన బంగారు, వెండి నగలను నా సోదరి సాక్షికి ఇవ్వాలి. నా శవాన్ని కాల్చడానికి ముందు నన్ను బాగా రెడీ చేయాలి. నాకు అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. నన్ను, నా భర్తను వధూవరులలాగా అలంకరించి అంత్యక్రియలు జరిపించండి. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. మేము మా ఇష్టానుసారంగానే చనిపోతున్నాం. అమ్మా, నాన్నా.. మా చావుకు అత్తమామలు కారణమని మీరు అనుకోవద్దు. చాలా మంది కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు కానీ మాకు ఆ శక్తి లేదు. అందువల్లే మేము అందరినీ విడిచి వెళ్లిపోతున్నాం. ఐ లవ్యూ మమ్మీ, డాడీ, లలి..’’ అని అంజలి తన ఆవేదనను వ్యక్తం చేసింది.

 

Updated Date - 2021-12-09T22:06:17+05:30 IST