బాబాయ్... అబ్బాయ్ నిలువునా ముంచేశారు!
ABN , First Publish Date - 2021-02-06T11:42:23+05:30 IST
బాబాయ్... అబ్బాయ్ కలిసి నమ్మిన వారిని నిలువునా ముంచేశారు.

హైదరాబాద్/బంజారాహిల్స్ : బాబాయ్... అబ్బాయ్ కలిసి నమ్మిన వారిని నిలువునా ముంచేశారు. షేర్ మార్కెట్‌లో అధిక లాభం వస్తుందని చెప్పి రూ.1.5 కోట్ల కుచ్చుటోపీ పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా బెనర్జీపేటకు చెందిన కోటగిరి మోహన్‌కృష్ణ నిరుద్యోగి. కొద్ది రోజుల క్రితం రహ్మత్‌నగర్‌లో ఉంటున్న బాబాయ్ రంగారావు ఇంటికి వచ్చాడు. అదే భవనంలో ఉండే ఆర్.రాఘవేంద్ర ప్రసాద్‌తో పరిచయం పెంచుకున్నాడు. తాను షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతానని, బాగా లాభాలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో రాఘవేంద్ర కొద్ది డబ్బును మోహన్‌కృష్ణకు ఇచ్చాడు. నెల రోజుల్లో మోహన్ కొంత ఆదాయాన్ని చూపించాడు.
ఆ తర్వాత రాఘవేంద్ర పలు దఫాలుగా రూ.24 లక్షలను మోహన్‌తోపాటు అతడి బాబాయ్ రంగారావుకు ఇచ్చాడు. కొంత డబ్బును అప్పుగా కూడా, తీసుకొచ్చి ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా డబ్బు తిరిగి రాలేదు. ఇదే విషయాన్ని మోహన్‌ను నిలదీయగా షేర్ మార్కెట్‌లో నష్టం వచ్చిందని చెప్పాడు. ఈ విధంగా లాక్‌డౌన్‌లో చాలామంది వద్ద మోహన్ డబ్బు వసూలు చేసినట్టు తెలిసింది. రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు మోహన్, రంగారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో వీరి బాధితులున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. రూ1.5 కోట్ల మేర వీరు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.