రూ. 7 లక్షలున్న బ్యాగ్‌ను వెనక్కి ఇచ్చి ప్రశంసలు.. సెల్‌ఫోన్‌ను వెనక్కి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసి అరెస్టైన ఆటో డ్రైవర్

ABN , First Publish Date - 2021-11-03T01:53:53+05:30 IST

తన ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన సంచిలో రూ. 7లక్షలు ఉండడం చూసి కూడా ఏ మాత్రం చలించకుండా

రూ. 7 లక్షలున్న బ్యాగ్‌ను వెనక్కి ఇచ్చి ప్రశంసలు.. సెల్‌ఫోన్‌ను వెనక్కి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసి అరెస్టైన ఆటో డ్రైవర్

పూణె: తన ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన సంచిలో రూ. 7లక్షలు ఉండడం చూసి కూడా ఏ మాత్రం చలించకుండా వెనక్కి ఇచ్చేసిన ఓ డ్రైవర్.. ఈసారి ఓ ప్రయాణికుడు మర్చిపోయిన సెల్‌ఫోన్‌ను వెనక్కి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశాడు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిందీ ఘటన.


బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.  పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కేశవ్‌నగర్‌కు చెందిన శేఖర్ భండారి (31) తన తండ్రిని గడిటాల్ ప్రాంతానికి పంపేందుకు ఆన్‌లైన్ యాప్ ద్వారా గత నెల 23న ఆటోరిక్షాను బుక్ చేశాడు. ఆటో ఎక్కిన ఆ పెద్దాయన తన సెల్‌ఫోన్ ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయాడు. 


ఆ తర్వాత గుర్తొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆటో యజమానిని కలిసి మర్చిపోయిన ఫోన్‌ను వెనక్కి ఇవ్వమని కోరారు. అయితే, ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను బయటపెట్టకుండా ఉండాలంటే రూ. 6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ ఆదర్శ్ బాబాసాహెబ్ పరాల్కర్ (22)ను అరెస్ట్ చేశారు. ఒకసారి ఇదే ఆటో డ్రైవర్ ప్రయాణికుడు ఒకరు తన ఆటోలో మర్చిపోయిన రూ. 7 లక్షలు ఉన్న బ్యాగును వెనక్కి ఇచ్చి ప్రశంసలు అందుకున్నట్టు పోలీసులు తెలిపారు.  


Updated Date - 2021-11-03T01:53:53+05:30 IST