ఆ ప్రకటనతో.. ‘బొమ్మ’ కనిపించినట్లుంది...

ABN , First Publish Date - 2021-12-10T01:33:38+05:30 IST

దేశంలోని ఒకేఒక్క లిస్టెడ్ పేమెంట్ బ్యాంక్ ‘ఫినో పేమెంట్స్’... ప్రకటనతో ఇన్వెస్టర్లకు బొమ్మ కనిపించి ఉంటుందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.

ఆ ప్రకటనతో.. ‘బొమ్మ’ కనిపించినట్లుంది...

ముంబై : దేశంలోని ఒకేఒక్క లిస్టెడ్ పేమెంట్ బ్యాంక్ ‘ఫినో పేమెంట్స్’... ప్రకటనతో ఇన్వెస్టర్లకు బొమ్మ కనిపించి ఉంటుందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. కంపెనీని స్థాపించి వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఐదేళ్లు పూర్తికానుంది. ఐదేళ్లు పూర్తవ్వగానే, స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారడానికి అర్హత పొందినప్పటికీ... కన్వర్షన్‌పై ఫినో ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని తెగేసి మరీ చెప్పింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలను కరోనా వైరస్‌ గట్టి దెబ్బతీసిన విషయం తెలిసిందే. గత ఒకటిన్నర సంవత్సరాల్లో వాటి మొండి బకాయిలు పెరిగాయి. ఈ క్రమంలోనే... ఫినో... వెనక్కు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రుణాల పరిస్థితి బాగా లేదని, పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెబుతోంది. ఒకటి, రెండేళ్ల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.


ప్రస్తుతం కొనసాగిస్తున్న పేమెంట్స్‌, లయబిలిటీల వ్యాపారాన్ని పెంచడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యంగా ఫినో చెబుతోంది. ఈ వ్యాపారంలోనే ఎదగడానికి చాలా అవకాశాలున్నాయని కంపెనీ యాజమాన్యం  వెల్లడించింది. అంతేకాదు... రిస్క్ కూడా ఉండదని భావిస్తోంది. నాలుగేళ్ళ క్రితం(2017 లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఫినో... గత నెలలో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టైంది. రుణాల మంజూరుకు, చెల్లింపులపై ఫీజులు వసూలు చేయడానికి పేమెంట్స్‌ బ్యాంకులకు అనుమతి లేదు. పబ్లిక్ డిపాజిట్లు స్వీకరించినా కూడా.. సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్‌ డిపాజిట్ల రూపంలో, అది కూడా రూ. రెండు లక్షలకు మించకుండా తీసుకోవాలి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌గా మారితే... రుణాలనివ్వడానికి, డిపాజిట్ల రేంజ్‌ను పెంచడానికి వీలవుతుంది. కస్టమర్లకు రుణాలనందించడానికి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఫినో... ఆ సేవపై రుసుము రూపంలో ఆదాయం పొందుతోంది. గోల్డ్ లోన్, కన్స్యూమర్ లోన్, మర్చంట్ లోన్ల కోసం మూడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఫినో జతకట్టింది. వినియోగదాడికిచ్చే రుణ పరిమాణం సగటున రూ. 3 వేలు-రూ. 10 వేల మధ్య ఉంటుంది. చిన్న వ్యాపారాలకు ఇచ్చే రుణాలు రూ. 15 వేల నుంచి రూ. 40 వేల  వరకు ఉంటాయి. 


Updated Date - 2021-12-10T01:33:38+05:30 IST