కంపెనీలు అద్భుతం చేస్తాయా ?

ABN , First Publish Date - 2021-10-07T22:33:00+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఇబ్బందులను వదిలించుకుని, రెండో త్రైమాసికం ఆదాయాలు, నికర లాభాల వృద్ధిని నిఫ్టీ50 కంపెనీలు కొనసాగించాలని మార్కెట్‌ ఆశిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), మెటల్స్‌, ఎనర్జీ సెక్టార్లు లీడ్‌ చేస్తాయని భావిస్తోంది.

కంపెనీలు అద్భుతం చేస్తాయా ?

ముంబై : ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం  ఇబ్బందులను వదిలించుకుని, రెండో త్రైమాసికం ఆదాయాలు, నికర లాభాల వృద్ధిని నిఫ్టీ50 కంపెనీలు కొనసాగించాలని మార్కెట్‌ ఆశిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), మెటల్స్‌, ఎనర్జీ సెక్టార్లు లీడ్‌ చేస్తాయని భావిస్తోంది. ఎకనమిక్ టైమ్స్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ ఈటీఐ.జీ అంచనా ప్రకారం... గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని 8.2 % తగ్గుదలతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత కంపెనీలు 28.9 % ఆదాయం వృద్ధిని నివేదిస్తాయి. ఏడాది క్రితం 45.8 %గా ఉన్న నికరలాభం కంటే, ఈసారి మరో 32.3 % పెరగవచ్చు. త్వరలోనే అన్ని కంపెనీల నుంచి రెండో త్రైమాసికం ఫలితాలు రానున్నాయి. మన కంపెనీల నికర లాభం సంవత్సరం ప్రాతిపదికన  27 %, రెండేళ్ల ప్రాతిపదికన 23 % వృద్ధిని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది.


సీక్వెన్షియల్‌ బేసిస్‌లో, సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీలు కోలుకున్నాయి. ఆదాయం 10.6 %, నికర లాభం 12 % పెరిగే అవకాశమెంది. జూన్ త్రైమాసికంలో, ఆదాయం, నికర లాభం వరుసగా 6.5 %, 8.9 % తగ్గాయి.


ఇన్‌పుట్ వ్యయాల పెరుగుదలతో, సంవత్సరం ప్రాతిపదికన ఆపరేటింగ్‌ మార్జిన్‌ 80 బేసిస్ పాయింట్లు తగ్గి 20.5 % పడిపోవచ్చని, అయితే ఇది అన్ని రంగాలకూ వర్తించదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది.


మంచి ధరలు, వాల్యూమ్‌ అప్‌టేక్ కారణంగా మెటల్ కంపెనీలు మొత్తం మార్జిన్‌లో 920 బేసిస్ పాయింట్ల పెరుగుదలను నివేదించే అవకాశముందని మోతీలాల్‌ ఓస్వాల్‌ చెబుతోంది. ముడిసరుకుకు సంబంధించి పెరుగుతున్న ధరలు సిమెంట్, ఆటోమొబైల్, స్పెషాలిటీ కెమికల్స్, కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్ల లాభాలను కుదిస్తాయని భావిస్తోంది. అయితే, పండుగ సీజన్‌ కారణంగా డిమాండ్ రికవరీ విషయంలో పాజిటివ్‌గా ఉన్నట్లు పేర్కొంది. గ్లోబల్‌ ఎనర్జీ, కమొడిటీస్‌లో అత్యధిక ధరలు, చైనాలో రియల్‌‌ఎస్టేట్‌, పవర్ సెక్టార్‌ క్రైసిస్‌, గ్లోబల్‌ సప్లై చైన్‌లో అవాంతరాలు, యూఎస్‌ ఫెడ్‌ వైఖరి, పెరుగుతున్న బాండ్‌ ఈల్డ్స్‌ ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయని కూడా వివరించింది. ఇక సెక్టార్లవారీగా పరిస్థితి ఇలా ఉంటుందని చెబుతున్నారు. 


ఆటోమొబైల్స్...

గ్లోబల్ సెమీ కండక్టర్ల కొరత రెండో త్రైమాసికంలో ఆటో కంపెనీల అమ్మకాలను తగ్గించింది. ప్యాసింజర్ కార్లు, ప్రీమియం బైక్ తయారీ కంపెనీలు చిప్‌ కొరతతో ఎక్కువగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. 

బ్యాంకింగ్ అండ్‌ ఫైనాన్స్... 

రిటైల్ క్రెడిట్ డిమాండ్‌లో పెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, కార్పొరేట్ డిమాండ్ మందకొడిగానే ఉంది. రెండో త్రైమాసికంలో క్రెడిట్‌ గ్రోత్‌ 7-8 % వరకు ఉంటుందని అంచనా. రీపేమెంట్స్‌ ట్రెండ్‌ కూడా మెరుగుపడింది. తద్వారా, నిరర్థక ఆస్తుల భయం తగ్గుతుందని చెబుతున్నారు. 


క్యాపిటల్‌ గూడ్స్‌...

ప్రాజెక్టుల అమల్లో మెరుగుదల, కార్మికుల లభ్యత పెరగడం కాస్త అనుకూలాంశాలుగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్డర్లు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి సంతృప్తికరంగానే వచ్చాయి. మొత్తం ఓవరాల్‌ ఆర్డర్ ఫ్లోకు ఇది దన్నుగా మారుతుందని భావిస్తున్నారు.


సిమెంట్‌... 

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, తక్కువ ధర ఇళ్ల నిర్మాణాల్లో స్థిరంగా కొనసాగిన ట్రెండ్‌ కారణంగా, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్ ఆదాయాలు 10-15 % పెరుగుతాయని అంచనా. నికర లాభాలు 8-12 % పెరిగే అవకాశముంది.


ఎఫ్‌ఎంసీజీ...

రెండో త్రైమాసికంలో ఔట్‌ ఆఫ్‌ హోం కన్‌జంప్షన్‌ పెరిగింది. ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఉత్పత్తుల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాలను ఇది పెంచుతుంది. హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్, ఐటీసీ ఆశాజనకమైన  పనితీరు కనబరుస్తాయని భావిస్తున్నారు.


ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ...

రూపాయి విలువలో మార్పులు, నిరంతర డిమాండ్‌ కారణంగా ఆదాయాల్లో 4-6.5 % పెరుగుదలను ఐటీ ఎగుమతి కంపెనీలు నివేదించే అవకాశముంది. ఆపరేటింగ్ మార్జిన్లు స్వల్పంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయాలు 100 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 15-17 % వృద్ధిని చూడవచ్చని భావిస్తున్నారు.


మెటల్స్... 

టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, జిందాల్ స్టీల్‌ అండ్‌ పవర్‌ సహా ఉక్కు కంపెనీలకు అధిక ఉక్కు ధరలు కలిసి రానున్నట్లు భావిస్తున్నారు. అధిక అల్యూమినియం ధరల కారణంగా... హిందాల్కో, వేదాంత సహా నాన్‌-ఫెర్రస్ కంపెనీల ఆదాయాల పెరుగుదల బలంగా ఉంటుంది.


ఫార్మా...

నాన్-కొవిడ్ చికిత్సల్లో పెరుగుదల ఈ త్రైమాసికంలో ఔషధ కంపెనీలకు అండగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికన్‌ జనరిక్స్‌లో ధరల ఒత్తిడి, దేశీయ మార్కెట్‌లో కొవిడ్ ఔషధాల పోర్ట్‌ఫోలియో హేతుబద్ధీకరణ ఈ సెక్టార్‌కు ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బలమైన త్రైమాసికం అమ్మకాలతో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ పోటీ పడవచునని చెబుతున్నారు. 

Updated Date - 2021-10-07T22:33:00+05:30 IST