భారత్ పౌరసత్వం మాకొద్దు... విదేశాలకు కోటీశ్వరులు..!

ABN , First Publish Date - 2021-12-31T00:05:31+05:30 IST

గత అయిదేళ్ళుగా... విదేశాలకు తరలిపోయిన కోటీశ్వరుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాదు... కుటుంబాలతో సహా వెళ్ళిపోతుండడం గమనార్హం. వీరిలో చాలామంది... ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టి, గ్రీన్ కార్డులు తీసుకుని అక్కడ పౌరసత్వాలను తీసుకుంటున్నారు.

భారత్ పౌరసత్వం మాకొద్దు... విదేశాలకు కోటీశ్వరులు..!

న్యూఢిల్లీ/ముంబై/బెంగళూరు : గత అయిదేళ్ళుగా... విదేశాలకు తరలిపోయిన కోటీశ్వరుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాదు... కుటుంబాలతో సహా వెళ్ళిపోతుండడం గమనార్హం. వీరిలో చాలామంది... ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టి, గ్రీన్ కార్డులు తీసుకుని అక్కడ పౌరసత్వాలను తీసుకుంటున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. వారిలో 40 % మంది అమెరికాలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో... ఆస్ట్రేలియా, కెనడా దేశాలున్నాయి. మొత్తంమీద... భారత్ నుంచి కుబేరుల వలసలు భారీగానే ఉంటున్నాయి. ఇక... గోల్డెన్ వీసా పొందుతున్న వారు కూడా ఉంటున్నారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


 ద్వంద్వ పౌరసత్వాన్ని ఆయా దేశాలు అంగీకరించని నేపధ్యంలో... మరో దేశ పౌరులుగా మారిన భారతీయులు తమ భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. అంటే... అలా వెళ్ళేవారు ఇండియాలో పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందే. ఇక... పలువురు కుబేరులు అక్కడే స్థిరపడిపోవడానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న వలసలు... 2017 నుండి ఈ వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. వలసలకు సంబంధించి... 2019 లో అత్యధిక సంఖ్యలో 1,44,017 అభ్యర్ధనలొచ్చాయి. కరోనా నేపధ్యంలో... లాక్‌డౌన్‌ల కారణంగా... 2020 లో 85, 248 కు పడిపోయింది. కాగా... ఈ ఏడాది తొమ్మిది నెలలకు అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు... ఈ సంఖ్య మళ్లీ పెరుగుతోంది. 


హై నెట్‌వర్త్ వ్యక్తులే...

గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ గణాంకాల ప్రకారం 2019 లో ఏడు వేల మంది సంపన్న భారతీయులు విదేశాలకు వెళ్లారు. ఇది ఇటీవలి సంవత్సరాలలో మరింతగా పెరిగింది. ఇక... దేశంలోని సంపన్నులు రెండు శాతం. ఈ విభాగంలో కుటుంబాలే వలసపోతున్నాయి. సంపన్నుల వలసల్లో 16 వేల మందితో చైనా మొదటి స్థానంలో ఉంటే, ఏడు వేల మందితో భారతదేశం తర్వాతి స్థానంలో ఉంది. రష్యా 5,500 మందితో మూడో స్థానంలో ఉంది. 

Updated Date - 2021-12-31T00:05:31+05:30 IST