వొడాఫోన్‌ ఐడియా కథ కంచికేనా?

ABN , First Publish Date - 2021-07-02T08:56:21+05:30 IST

దేశంలో మరో టెలికాం కంపెనీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌-బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌ సంయుక్త కంపెనీ.. వొడాఫోన్‌ ఐడి యా లిమిటెడ్‌ (వీఐఎల్‌) అప్పులు, బకాయిలు....

వొడాఫోన్‌ ఐడియా  కథ కంచికేనా?

బకాయిలు తీర్చలేక అవస్థలు

రూ.8,200 కోట్ల స్పెక్ట్రమ్‌ చెల్లింపులకూ కష్టాలు

ఏడాది మారటోరియం విధించాలంటూ డాట్‌కు వినతి

మొత్తం అప్పులు రూ.1.86 లక్షల కోట్లు


న్యూఢిల్లీ: దేశంలో మరో టెలికాం కంపెనీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌-బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌  గ్రూప్‌ సంయుక్త కంపెనీ.. వొడాఫోన్‌ ఐడి యా లిమిటెడ్‌ (వీఐఎల్‌) అప్పులు, బకాయిలు చెల్లించేందుకు అష్టకష్టాలు పడుతోంది. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీ రూ.44,233 కోట్ల భారీ నష్టాలు చవిచూసింది. ఇందులో రూ.6,985 కోట్లు జనవరి-మార్చి త్రైమాసిక నష్టాలుగా ఉన్నాయి. మరోవైపు ఒక్కో వినియోగదారుడి (సబ్‌స్ర్కైబర్‌) నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పడిపోతోంది. దీంతో కంపెనీ నష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. 


తగ్గుతున్న సబ్‌స్ర్కైబరు: మరోవైపు పెద్ద సంఖ్యలో సబ్‌స్ర్కైబర్లు వొడాఫోన్‌ ఐడియా సేవలకు గుడ్‌బై చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలోనూ దాదాపు 20 లక్షల మంది కంపెనీ సేవలకు గుడ్‌బై చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఇది కొంతలో కొంత నయం. అప్పట్లో ప్రతి మూడు నెలలకు 80 నుంచి 110 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు కంపెనీకి గుడ్‌బై చెప్పారు. దీంతో మార్చి నెలాఖరుకు నాటికి కంపెనీ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 27 కోట్లకు పడిపోయింది. 


భారంగా ఏజీఆర్‌, స్పెక్ట్రమ్‌ చెల్లింపులు: ఈ ఏడాది మార్చి చివరికి వొడాఫోన్‌ ఐడియా నెత్తిన రూ.1.86 లక్షల కోట్ల అప్పులు, ఏజీఆర్‌, స్పెక్ట్రమ్‌ బకాయిలు ఉన్నాయి. ఇందు లో రూ.1,78,400 కోట్లు ఏజీఆర్‌, స్పెక్ట్రమ్‌ చార్జీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాలి. ఈ అప్పులు తీర్చేందుకు కంపెనీ కిందా మీదా పడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా చెల్లించాల్సిన రూ.8,200 కోట్ల స్పెక్ట్రమ్‌ చార్జీల చెల్లింపు గడువు మరో ఏడాది పొడిగించాలని వొడాఫోన్‌ ఐడియా ఇప్పటికే కేంద్ర టెలికాం శాఖ (డాట్‌)ను కోరింది. వచ్చే మార్చిలో చెల్లించాల్సిన రూ.8,000 కోట్ల ఏజీఆర్‌ బకాయిలపైనా సుప్రీంకోర్టు ఏమైనా ఊరట ఇస్తుందోనని ఆశగా ఎదురు చూస్తోంది. 


అప్పులు పుట్టడం లేదు: ఈ ఆర్థిక కష్టాల నుంచి బయట పడేందుకు కంపెనీ మళ్లీ కొత్త అప్పుల కోసం చూస్తోంది. రూ.25,000 కోట్ల రుణ సేకరణకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు గత ఏడాది సెప్టెంబరులో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కంపెనీ ఆర్థిక కష్టాలు చూసి ఒక్క రుణదాత కూడా ఇప్పటి వరకు ముందుకు రాలేదు. కొన్ని అమెరికా టెలికాం సంస్థలకు ఈక్విటీ  షేర్లు అమ్మేందుకు ప్రయత్నించినా.. ఏ కంపెనీ ఆసక్తి చూపలేదని సమాచారం. 


ఆడిటర్ల ఆందోళన: వొడాఫోన్‌ ఐడియా ఆర్థిక కష్టాలు ఆ కంపెనీ ఆడిటర్లకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కష్టాల నుంచి కంపెనీ గట్కెక్కుతుందా? లేక నిండా మునుగుతుందా? అని వారు మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆడిటింగ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వొడాఫోన్‌ ఐడియా మనుగడపై మరిన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


మిగిలేది రెండే: ఐదారేళ్ల క్రితం భారత టెలికాం మార్కెట్లో దాదాపు 12 కంపెనీలు ఉండేవి. రిలయన్స్‌ జియో ప్రవేశంతో ఇందులో ఎనిమిది కంపెనీలు మూత లేదా విలీనాల బాటపట్టాయి. ఇప్పుడు పేరుకు నాలుగు కంపెనీలు ఉన్నా అందులో వొడాఫోన్‌ ఐడియా, ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రభుత్వ మద్దతుతో బీఎ్‌సఎన్‌ఎల్‌ ఏదోలా నెటుకొస్తోంది. వొడాఫోన్‌ ఐడియాకు మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రధాన ప్రమోటర్లయిన ఆదిత్య బిర్లా గ్రూప్‌, వొడాఫోన్‌ కంపెనీలు అదనపు నిధులు సమకూర్చటం ఇక మా వల్ల కాదని ఇప్పటికే చేతులు ఎత్తివేశాయి. మరోవైపు అప్పులు ఇచ్చే నాధుడూ కనిపించడం లేదు. దీంతో అనిల్‌ అంబానీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) తరహాలోనే వొడాఫోన్‌ ఐడియా కథ కూడా కంచికి చేరక తప్పదని మార్కెట్‌ వర్గాల అంచనా. అదే జరిగితే భారత టెలికాం మార్కెట్లో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌కు ఇక తిరుగుండదు. 


టెలికాం చార్జీలు పెంచక తప్పదు : సునీల్‌ మిట్టల్‌

టెలికాం పరిశ్రమ ఆర్థిక దుస్థితిపై భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందన్నారు. కనీసం ఖర్చులన్నా రావాలంటే టెలికాం సేవల చార్జీలు పెంచక తప్పదన్నారు. ఇందుకు తమ కంపెనీ ఏ మాత్రం వెనుకాడదన్నారు. అయితే దీనిపై తమ కంపెనీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదన్నారు. పోటీతో ఒకరిని ఒకరు ఎంత కాలం చంపుకుంటామని పరోక్షంగా రిలయన్స్‌ జియోని ప్రశ్నించారు. దేశ టెలికాం రంగంలో కనీసం మూడు కంపెనీలన్నా ఉండాలన్నారు. లేకపోతే ప్రభుత్వ డిజిటల్‌ కల సాకారం కావడం కష్టమన్నారు. పరిశ్రమ మొత్తంగా చూస్తే ఆర్థిక కష్టాల్లో ఉన్నా, ఎయిర్‌టెల్‌ ఆర్థిక పరిస్థితి మాత్రం ధృడంగానే ఉందని మిట్టల్‌ చెప్పారు. 


నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే కొంతమంది ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి.

- రవీందర్‌ టక్కర్‌, ఎండీ, సీఈఓ, వొడాఫోన్‌ ఐడియా.



Updated Date - 2021-07-02T08:56:21+05:30 IST