భారత మార్కెట్లో ట్రైటాన్ ఎలక్ట్రిక్ కారు
ABN , First Publish Date - 2021-01-12T09:39:38+05:30 IST
అమెరికాకు చెందిన ఎలక్ర్టిక్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్ ఎన్4-జిటి లిమిటెడ్ ఎడిషన్ కారును భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

ప్రారంభ ధర రూ.35 లక్షలు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ర్టిక్ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్ ఎన్4-జిటి లిమిటెడ్ ఎడిషన్ కారును భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కారు ప్రారంభ ధర రూ.35 లక్షలు. పూర్తిగా అమెరికాలోనే తయారుచేసే ఈ కారు ప్రీ బుకింగ్‌లు కూడా తమ వెబ్‌సైట్‌లో ప్రారంభించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో కేవలం 100 కార్లు మాత్రమే ఉత్పత్తి చేస్తామని, దీనికి 75 కిలోవాట్ల నుంచి 100 కిలోవాట్ల బ్యాటరీ అమర్చడం వల్ల బ్యాటరీ పవర్‌నను బట్టి ఒకసారి చార్జింగ్ చేస్తే వాహనం నడిచే దూరం 523 కిలోమీటర్ల నుంచి 696 కిలోమీటర్ల మధ్యన ఉంటుందని కంపెనీ తెలిపింది.
బీఈఎల్‌తో జాయింట్ వెంచర్
భారత్‌లో జాయింట్ వెంచర్ ఏర్పాటు కోసం భారత్ ఎలక్ర్టానిక్స్‌తో (బీఈఎల్) సంప్రదింపులు చురుగ్గా జరుగుతున్నాయని, బ్యాటరీలు, ఇంధన స్టోరేజ్ సిస్టమ్‌కు అవసరం అయిన ఎలక్ర్టానిక్ వ్యవస్థలు అక్కడ తయారవుతాయని ట్రైటాన్ ఎలక్ర్టానిక్ వెహికల్ వ్యవస్థాపక సీఈఓ హిమాంశు.బీ.పటేల్ అన్నారు. భారత్‌ను తాము మూడు అగ్రశ్రేణి మార్కెట్లలో ఒకటిగా భావిస్తున్నందు వల్ల వాహన తయారీ దేశంలోనే చేపట్టడం, బలమైన కస్టమర్ల పునాది ఏర్పాటు చేసుకోవడం దిశగా పటిష్ఠమైన విస్తరణ ప్రణాళికలు తమ ముందున్నట్టు ఆయన చెప్పారు.