బ్యాడ్ బ్యాంక్‌కు రూ.2 లక్షల కోట్ల ఎన్‌పీఏల బదిలీ
ABN , First Publish Date - 2021-05-21T06:00:33+05:30 IST
బ్యాంకులపై మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గించే ప్రక్రియ ఊపందుకుంది.

80 పెద్ద ఖాతాలను గుర్తించిన బ్యాంకులు
న్యూఢిల్లీ: బ్యాంకులపై మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గించే ప్రక్రియ ఊపందుకుంది. ఈ భారాన్ని వచ్చే నెలలో ఏర్పాటు చేసే జాతీయ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమి టెడ్ (ఎన్‌ఏఆర్‌సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్‌కు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యాంకులు ఇందుకోసం ఇప్పటికే ఒక్కోటి రూ.500 కోట్లకుపైగా ఉన్న 70-80 పెద్ద మొండి పద్దుల ఖాతాలను గుర్తించాయి. ఈ ఖాతాల ఎన్‌పీఏల మొత్తం రూ.2 లక్షల కోట్లకుపైగా ఉంటుందని సమాచారం.
గత ఏడాది మార్చి నాటికి దేశీయ బ్యాంకింగ్ రంగం దాదాపు రూ.12 లక్షల కోట్ల మొండి బకాయిలతో సతమతమవుతోంది. కాగా బ్యాంకులు స్వాధీనం చేసుకున్న ఎన్‌పీఏ ఆస్తులను మళ్లీ వెలకట్టి, అందులో 15 శాతాన్ని బ్యాడ్ బ్యాంక్.. బ్యాంకులకు చెల్లిస్తుంది. మిగతా 85 శాతం వాటి అమ్మకం ద్వారా వచ్చే నిధుల నుంచి చెల్లిస్తుంది. ఈ 85 శాతం మొత్తానికి ప్రభుత్వ హామీ ఉంటుంది. ఆస్తుల అమ్మకంపై నష్టం వచ్చినపుడు మాత్రమే చెల్లింపులపై బ్యాంకులకు ప్రభుత్వ హామీ వర్తిస్తుంది.
బ్యాంకులకు ఉపశమనం:
ప్రస్తుతం బ్యాంకులు ఎన్‌పీఏల కోసం పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయాల్సి వస్తోంది. దీంతో వాటి లాభాలకూ గండి పడుతోంది. మొండి బకాయిలు.. బ్యాడ్ బ్యాంక్‌కు బదిలీ కావడంతో బ్యాంకులకు ఇక ఈ తిప్పలు ఉండవు. దీంతో వాటి బ్యాలెన్స్ షీట్ల ప్రక్షాళన జరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు.