ప్రపంచం గేట్టు ఎత్తివేసినా... ఆ రాష్ట్రాలు మాత్రం...

ABN , First Publish Date - 2021-12-16T02:35:32+05:30 IST

కేరళ, కర్నాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు బస్సుల విషయంలో ఘర్షణ వైఖరి ఇంకా కొనసాగుతోంది. ఒక రాష్ట్రం బస్సులు మరో రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో... సరిహద్దు జిల్లాలకు చెందిన విద్యార్థులు, చిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రపంచం గేట్టు ఎత్తివేసినా... ఆ రాష్ట్రాలు మాత్రం...

న్యూఢిల్లీ : కేరళ, కర్నాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు బస్సుల విషయంలో ఘర్షణ వైఖరి ఇంకా కొనసాగుతోంది. ఒక రాష్ట్రం బస్సులు మరో రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో... సరిహద్దు జిల్లాలకు చెందిన విద్యార్థులు, చిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేరళ నుంచి దక్షిణ కర్నాటక ప్రాంతాలకు వెళ్లాల్సిన వారి యాతనలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. కేరళ సరిహద్దు జిల్లాల్లో ఉప్పాల, మంజేశ్వర, హోసన్ గడి, కుంజత్తూరు ప్రాంతాలు-కర్నాటక లోని మంగళూరు మధ్య నిత్యం భారీ సంఖ్యలో ప్రజల రాకపోకలుంటాయి. గతంలో వీరంతా ఇక్కడ బస్సు ఎక్కితే, నేరుగా అక్కడ దిగేసేవారు. కానీ ఇప్పుడు రెండు బస్సులు కచ్చితంగా మారాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు ట్రావెల్స్ పై కూడా ఆధారపడాల్సి రావడంతో ఆర్థికంగా కూడా కష్టంగా మారింది. మరోవైపు బస్సులకోసం గంటల తరబడి వేచి చూడాల్సిన నేపధ్యంలో... విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.


పట్టించుకునే నాధులే లేరా ? 

ఇటు బస్సు సర్వీసుల్ని పునరుద్ధరించడంలో రెండు రాష్ట్రాలు పంతంగా వ్యవహరిసప్తున్నాయి. ఇక... రైలు సర్వీసులు కూడా అందుబాటులో లేవు. గతంలో మంగళూరు-పుత్తూరు ట్రైన్ సర్వీసు... ఇటు  విద్యార్థులకు, అటు ఉద్యోగులకు అందుబాటులో  ఉండేది. ఆ తర్వాత రద్దైంది. కొవిడ్-19 తర్వాత ఇతర ప్రాంతాల్లో అన్ని సర్వీసులు సాధారణ స్థితికి వస్తున్నప్పటికీ... ఈ లోకల్ ట్రైన్ మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో అటు బస్సులు లేక, ఇటు రైళ్లు లేక సరిహద్దు జిల్లాల ప్రజలు అవస్థలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలపై నిషేధాలు తొలగిపోయి, పరిస్థితి దాదాపుగా ఓ కొలిక్కి వస్తోన్న వేళ... పక్క పక్క రాష్ట్రాలు మాత్రం పట్టుదలకు పోతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-12-16T02:35:32+05:30 IST