సెమీ కండక్టర్ల తయారీ దిశగా ‘టాటా’...

ABN , First Publish Date - 2021-11-27T02:15:08+05:30 IST

ప్రపంచాన్ని ప్రస్తుతం కలవరపెడుతోన్న ‘చిప్’ల కొరత సమస్యను అధిగమించే దిశగా టాటా సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం... చిప్ కొరత తారస్థాయిలో ఉన్న పరిస్థితి తెలిసిందే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా టాటా దృష్టి సారించింది.

సెమీ కండక్టర్ల తయారీ దిశగా ‘టాటా’...

ముంబై : ప్రపంచాన్ని ప్రస్తుతం కలవరపెడుతోన్న ‘చిప్’ల కొరత సమస్యను అధిగమించే దిశగా టాటా సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం... చిప్ కొరత తారస్థాయిలో ఉన్న పరిస్థితి తెలిసిందే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా టాటా దృష్టి సారించింది. సెమీకండెక్టర్ల అసెంబ్లీ & టెస్టింగ్‌ యూనిట్ నిర్మాణం కోసం 300 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోన్న క్రమంలో... దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో టాటా గ్రూప్ చర్చిస్తున్నట్లు వినవస్తోంది. కాగా... సెమీకండెక్టర్ల తయారీ రంగంలోకి వ్యాపారంలోకి ప్రవేశించబోతున్నట్లు కొన్నాళ్ల క్రితం టాటా గ్రూప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లుగా వినవస్తోన్న నేపధ్యంలో... ఆ చర్చలు ఫలప్రదమైనపక్షంలో... ఏదో ఒక రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ & టెస్టింగ్‌(ఓఎస్ఏటీ) ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ ఓఎస్‌ఏటీ ప్లాంట్‌లో తయారుకానున్న సిలికాన్‌ వేఫర్లతో అసెంబ్లింగ్‌, పరీక్షలు, ప్యాకింగ్‌ వంటి వాటికి వినియోగించనున్నారు. కాగా... ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి... వచ్చే నెల చివరి నాటికి, ఓ ప్రాంతాన్ని ఖరారు చేసే అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 


కాగా... ప్రస్తుతం చైనాలో భారీగా సెమీకండెక్టర్ చిప్స్ తయారీ జరుగుతోంది. టాటా గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టు వల్ల చైనాకు వేల కోట్లలో నష్టం కలిగే పరిస్థితి నెలకొంటుందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. టాటా ఓఎస్ఏటీ వ్యాపారం కోసం ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్(ఎఎమ్‌డి), ఎస్ టి మైక్రోఎలక్ట్రానిక్స్ తదితర సంస్థలతో చర్చలు జరుపుతోంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ కర్మాగారం కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, నాలుగు వేల మంది కార్మికులను నియమించుకోనున్నారని వినవస్తోంది. 

Updated Date - 2021-11-27T02:15:08+05:30 IST